వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గోదావరి పుష్కర స్నానాలు చేసి పునీతులు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ గోదారమ్మ తల్లికి పూజలు చేసి.. వారి మనసులోని కోర్కెలు తెలిపి వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బుధవారం కుటుంబ సమేతంగా తాను భద్రాచలంలో పుష్కర స్నానం చేయనున్నట్లు చెప్పారు. గోదావరికి ఈ ఏడాది జరిగేవి మహా పుష్కరాలని, ఇవి 144 ఏళ్లకు ఒకసారి వస్తాయని చెప్పారు.
పన్నెండేళ్లకు వచ్చే మామూలు పుష్కరాల కన్నా ఇప్పుడు జరుగుతున్న పుష్కరం ఎంతో ముఖ్యమైందని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండేలా చేయాలని ప్రజలందరూ గోదారమ్మ తల్లిని ప్రార్థించాలని పొంగులేటి చెప్పారు. నదీమ తల్లికి పుష్కరం వచ్చిందంటే ఆ 12 రోజులూ 12 పర్వదినాలతో సమానమన్నారు. పుష్కర కాలంలో నదీస్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని, నిజ ఆషాఢంలో పితరుల సంస్మరణార్థం శ్రార్ధకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే చాలా మంచిదని పొంగులేటి చెప్పారు. పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రతి తెలుగువారినీ కోరుకుంటున్నానని చెప్పారు.
పుష్కర స్నానాలతో పునీతులుకండి
Published Tue, Jul 14 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement