* తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ
* తెలంగాణలో ఉదయం 6.21, ఏపీలో 6.26 గంటల నుంచి పుష్కర సంరంభం
* 12 రోజులపాటు జనసంద్రం కానున్న గోదావరి తీరం
* పుణ్యస్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా తరలివెళ్తున్న భక్తులు
* కుటుంబ సమేతంగా ధర్మపురికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
* భద్రాచలంలో పుష్కరాలు ప్రారంభించనున్న చినజీయర్
* రాజమండ్రిలో పుణ్యస్నానం చేసి ప్రారంభించనున్న జయేంద్ర సరస్వతి
* అనంతరం అక్కడే స్నానమాచరించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
(రాజమండ్రిలో సోమవారం రాత్రి గోదావరికి హారతి ఇస్తున్న దృశ్యం)
అమృత ఘడియలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాలకు పుష్కర శోభను తెచ్చాయి. పవిత్ర గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం వరకు, ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ నుంచి అంతర్వేది వరకు తీరం యావత్తూ జయజయ ధ్వానాలతో మార్మోగుతోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తొలి పుష్కరాలు కావడం, అందునా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా పుష్కరాలు కావడంతో జనం పెద్దఎత్తున పవిత్ర స్నానాలకు తరలి వెళ్తున్నారు. తెలంగాణలో మంగళవారం ఉదయం 6.21 గంటలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26 గంటలకు దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయాన గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభం కానున్నాయి. ధర్మపురిలో పుష్కర స్నానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజమండ్రి పుష్కరఘాట్‌లో సకుటుంబంగా పుష్కర స్నానం ఆచరిస్తారు.
తెలంగాణలో..
తెలంగాణలో ప్రముఖ క్షేత్రాలకు సోమవారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. తొలిరోజు పది లక్షల మంది నదీ స్నానం ఆచరిస్తారని అంచనా. తెలంగాణ తొలి పుష్కరాలు కావటంతో వీటిని కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావించి విస్తృత ప్రచారం నిర్వహించింది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం లేకపోవటంతో భక్తుల్లో నిరాశ నెలకొంది. వరుణుడు కరుణించకపోవటంతో జలకళ లేక చాలాచోట్ల ఘాట్లు వెలవెలబోతున్నాయి.
మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పెట్టుకున్న ఆశలూ ఆవిరయ్యాయి. దీంతో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోని నీటి విడుదలతోనే సరిపుచ్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. అవి కూడా అంతంత మాత్రమే కావటంతో పుష్కర ఘాట్ల వరకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక్క కాళేశ్వరం వద్ద మాత్రమే ఘాట్ల వరకు నీళ్లున్నాయి. సీఎం స్నానం ఆచరించనున్న ధర్మపురిలో ఘాట్ల నుంచి 10 మీటర్లు వెళ్లిన తర్వాతే నీళ్లున్నాయి.
కాళేశ్వరంలో వసతులేవీ?: పుష్కలంగా నీళ్లున్న త్రివేణి సంగమ ప్రాంతమైన కాళేశ్వరంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. సోమవారం రాత్రి వరకు ఇక్కడికి దాదాపు 3 వేల మంది భక్తులు చేరుకున్నారు. వారికి సరైన వసతి లేదు. దేవాలయ నిర్వాహకులు సాధారణ టెంట్లు వేయటంతో వాటి కిందే సేద తీరారు.
భద్రాచలం కళకళ: మిగతా క్షేత్రాలతో పోలిస్తే భద్రాచలం భక్తులతో కళకళలాడుతోంది. సోమవారం రాత్రి వరకు ఇక్కడికి పది వేల మంది వరకు భక్తులు చేరుకున్నారు. ఉదయం 6.21 సమయంలో త్రిదండి చినజీయర్ స్వామి ఇక్కడ స్నానమాచరించి మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావుతో కలసి పుష్కరాలను ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ కూడా ఘాట్ల వద్ద నీళ్లు లేవు. 10 మీటర్ల మేర బురదలో నడిచి నీటి వద్దకు చేరుకోవాల్సిన పరిస్థితి. భద్రాచలానికి సమీపంలోని తారపాక వద్ద నాగ సాధువుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు గాలివానతో కూలిపోయాయి.
బాసర వెలవెల: దాదాపు లక్ష మంది వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్న బాసర వెలవెలబోతోంది. నదిలో ప్రవాహం తక్కువగా ఉండటంతో భక్తులు ఇక్కడికి రావటానికి ఉత్సాహం చూపటం లేదు. రోజువారీ భక్తులు తప్ప సోమవారం రాత్రి వరకు ఇక్కడికి అదనంగా ఎవరూ రాలేదు. వరంగల్‌లో రామన్నగూడెం, ముళ్లకట్ట, మంగపేట వద్ద ఘాట్లకు దూరంగా ప్రవాహం ఉంది.
హైదరాబాద్ నుంచి అంతంతే: తొలి రోజు పుణ్యస్నానాల కోసం హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలుతారని ఆశించినప్పటికీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, వరంగల్ వైపు ఏమాత్రం డిమాండ్ లేకపోవటంతో ప్రత్యేక బస్సుల జోలికి వెళ్లలేదు. భద్రాచలం వైపు మాత్రం 30 ప్రత్యేక బస్సులు నడిపారు. మంగళవారం నుంచి రద్దీ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇబ్బంది లేకుండా చూడండి: సీఎం
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం ధర్మపురికి వచ్చిన సీఎం పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
- సాక్షి, హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీరం భక్తజనంతో పోటెత్తనుంది. పుష్కరాలు జరిగే 12 రోజులూ నదిలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారితో ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి సంకల్ప సహితంగా రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసి పుష్కరాలు ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. సరిగ్గా ఇదే సమయానికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కంచిపీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం ఆచరించనున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం ఆచరిస్తారు.
దేదీప్యమానంగా గోదావరి తీరం
రాజమండ్రి వద్ద గోదావరి తీరాన్ని విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పచ్చదనం ఉట్టిపడేలా ప్రధాన పుష్కర ఘాట్‌లకు వెళ్లే రోడ్లతోపాటు, ప్రధాన కూడళ్లను మొక్కలతో తీర్చిదిద్దారు. ఘాట్‌లలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో సీలేరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. సీలేరు బేసిన్ నుంచి 10వేల క్యుసెక్కులు నీటిని సోమవారం విడుదల చేశారు.
పీఠాధిపతుల రాక..
తొలి పుష్కర స్నానమాచరించేందుకు కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి, మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి, త్రిదండి అహోబిల జీయర్‌స్వామి రాజమండ్రికి చేరుకోగా, మరికొంత మంది పీఠాధిపతులు, స్వామీజీలు మంగళవారం చేరుకోనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో స్నానమాచరించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు లాలాచెరువు వద్ద లక్ష మందితో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ప్రసంగించనున్నారు.
అట్టహాసంగా నిత్యహారతి
అఖండ పుష్కరజ్యోతి యాత్ర రాజమండ్రి చేరుకున్న సందర్భంగా గోదావరి నదికి చంద్రబాబు సమక్షంలో సోమవారం రాత్రి ఇచ్చిన నిత్యహారతి అట్టహాసంగా జరిగింది. పుష్కర ఘాట్‌లో మెట్లపై హారతి ఇవ్వాల్సి ఉండగా.. గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై నుంచి హారతి ఇచ్చారు. ఘాట్‌పై నుంచి కాకుండా సీఎం కోసం పంటుపై నుంచి హారతులు ఇవ్వడంతో ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరగలేదని భక్తులు ఆక్షేపిస్తున్నారు. అనంతరం గోదావరి ప్రాశస్త్యాన్ని లేజర్‌షో ద్వారా చూపించారు.
- సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు, హైదరాబాద్
ఏపీలో అట్టహాసంగా పుష్కర శోభాయాత్ర
ద్వారకాతిరుమల: గోదావరి పుష్కరాల శోభాయాత్ర అట్టహాసంగా మొదలైంది. శోభాయాత్రను ద్వారకాతిరుమలలోని చినవెంకన్న సన్నిధి వద్ద ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు మాణిక్యాలరావు, పీతల సుజాత సోమవారం ప్రారంభించారు.
రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం
సాక్షి, రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తిరుమల వేంకటేశ్వరస్వామి నమూనా ఆలయాన్ని సోమవారం ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఉదయం జరిగింది. ఉదయం ఆరు నుంచి రాత్రి 10.30 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
జయ జయ గోదావరి
Published Tue, Jul 14 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement