Maha Kumbh Mela 2025: మహా విషాదం | 30 dead, 60 injured in Prayagraj Maha Kumbh Mela stampede | Sakshi
Sakshi News home page

Maha Kumbh Mela 2025: మహా విషాదం

Published Thu, Jan 30 2025 1:27 AM | Last Updated on Thu, Jan 30 2025 7:11 AM

30 dead, 60 injured in Prayagraj Maha Kumbh Mela stampede
  • కుంభమేళాలో తొక్కిసలాట 
  • 30 మంది మృతి,  60 మందికి గాయాలు
  • మంగళవారం అర్ధరాత్రి దాటాకా దుర్ఘటన
  • మధ్యాహ్నం దాకా స్నానాల నిలిపివేత.. ఆ తర్వాత కొనసాగింపు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
  • నిర్వహణ సరిగా లేదంటూ విపక్షాల విసుర్లు

తెల్లవారుజామున మూడు గంటల సమయం.. బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు చేసేందుకు ‘సంగమ్‌ నోస్‌’ ఘాట్‌ వద్ద వేచిచూస్తున్న లక్షలాది మంది భక్తులు.. ఒక్కసారిగా బారికేడ్లకు అటువైపు పెరిగిన భక్తుల రద్దీ.. వారంతా పక్కన కూర్చున్న వారిపై పడటంతో అంతా హాహాకారాలు.. ఏం జరిగిందో తెలియని పరిస్థితి.. పోలీసులు కిందపడినపోయిన 90 మందిని తాత్కాలిక సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించారు.

 వారిలో 30 మంది ప్రాణాలు వదిలారు. 60 మంది గాయపడ్డారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటకు బలవటం విషాదాన్ని మిగిల్చింది. స్నానఘట్టాల్లో భక్తకోటి శరణుఘోషకు బదులు మృత్యుఘోష వినిపించింది.  

మహాకుంభ్‌ నగర్‌: అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాట(stampede)కు బలయ్యారు. గత కొద్దిరోజులుగా అశేష జనవాహినితో జనసంద్రమైన ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) మహాకుంభమేళా(Maha Kumbh Mela) స్నానఘట్టంతో భక్తకోటి శరణఘోషకు బదులు మరణమృదంగం వినిపించింది. మంగళవారం అర్ధరాత్రిదాటాక 1–2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమ స్థలి సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

 60 మంది గాయపడ్డారు. దీంతో కొద్దిసేపు పుణ్యస్నానాల క్రతువును మధ్యాహ్నందాకా ఆపేశారు. మృతుల్లో కర్ణాటక, అస్సాం, గుజరాత్‌ నుంచి వచ్చిన భక్తులున్నారు. మౌని అమావాస్య రోజు ఒక్కరోజే 10 కోట్లమంది భక్తులు రావొచ్చన్న ముందస్తు అంచనాతో యోగి ఆద్యిత్యనాథ్‌ ప్రభుత్వం అత్యంత పటిష్ట ఏర్పాట్లుచేసినా అపశృతి చోటుచేసుకోవడంతో అక్కడ అంతా విషాదం అలుముకుంది. 30 మంది మృతుల్లో 25 మందిని గుర్తించారు. వారిలో నలుగురు కర్ణాటక వాసులున్నారు. అస్సాం, గుజరాత్‌ నుంచి చెరో భక్తుడిని గుర్తించారు. గాయపడిన వారిలో 36 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. మిగతా వారిని డిశ్చార్జ్‌చేశారు.

అంతా గందరగోళం, హాహాకారాలు
తెల్లవారుజామున మూడుగంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయడానికి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ స్థలిలోని సంగమ్‌ నోస్‌ ఘాట్‌ వద్ద కూర్చుని వేచి చూస్తుండగా ఒంటిగంట దాటాక బ్యారీకేడ్లకు అటువైపుగా ఉన్న భక్తులు కిటకిట ఎక్కువ కావడంతో ఇటువైపు దూకారు. ఎక్కివస్తున్న, నెడుతున్న జనం ధాటికి బ్యారీకేడ్లు విరిగిపోయాయి. దీంతో కూర్చున్న వారిపై అటువైపు నిల్చున్న భక్తులు పడ్డారు. వారిపై పక్కనున్న వాళ్లు పడటంతో కిందనున్న వాళ్లు ఊపిరాడక చనిపోయారు. 

అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేసినా కోట్లాది జనం కావడంతో అది వెంటనే సాధ్యపడలేదు. కిందపడిన దాదాపు 90 మంది భక్తులను పోలీసులు ఆ జనం మధ్యే భుజాలపై ఎత్తుకుని, అంబులెన్సుల్లోకి ఎక్కించి మేళా ప్రాంగణంలోనే ఏర్పాటుచేసిన తాత్కాలిక సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించారు. అయినాసరే వారిలో 30 మంది చనిపోయారని మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌ కృష్ణ ప్రకటించారు. తొక్కిసలాట కారణంగా వెంటనే పుణ్నస్నానాలను పోలీసులు, సహాయక సిబ్బంది ఆపేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక మధ్యాహ్నం రెండున్నర గంటలకు 13 అఖాడాల అమృత్‌ స్నాన్‌తోపాటు భక్తుల పుణ్యస్నానాలకు అనుమతి ఇచ్చారు.

జనం మధ్య చిక్కుకున్న అంబులెన్సులు
భయంతో భక్తులు చిందరవందరగా పరుగెత్తడంతో బ్యాగులను వెంటేసుకొచ్చిన కొందరు వాటిని అక్కడే పడేశారు. అవి తగిలి ఇంకొందరు పడ్డారు. చెత్త కోసం ఏర్పాటుచేసిన ఇనుప చెత్త డబ్బాలు తగిలి చాలా మంది పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తొక్కిసలాటలో కిందపడి స్పృహకోల్పోయిన భక్తులను వెంటనే అంబులెన్సుల్లో ఎక్కించినా జనం మధ్యలో ముందుకు కదల్లేక అవి చాలాసేపు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు వాటికి దారి కల్పించారు. వీఐపీల కోసం కొంత మేర స్థలాన్ని వదిలేయడంతో పక్కన రద్దీ పెరుగుతోంది. 

ఇకపై వీఐపీ ప్రోటోకాల్‌ పేరిట జనాన్ని పక్కకు నెట్టేసే విధానాన్ని పాటించబోమని అక్కడి అధికారి ఒకరు చెప్పారు. సాధారణ భక్తులు, అఖాడాల కోసం వేర్వేరుగా ఏర్పాటుచేసిన వరసలు, బ్యారీకేడ్ల వద్ద ఘటన జరిగిందని అధికారి పేర్కొన్నారు. కుప్పలుగా భక్తుల దుస్తులు, దుప్పట్లు, బ్యాగులు, చెప్పులు పడి తొక్కిసలాట ప్రాంతం చిందరవందరగా తయారైంది. స్పృహ కోల్పోయిన తమ వారిని తట్టిలేపేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులతో ఆప్రాంతంలో ఒక్కసారిగా నిర్వేదం నెలకొంది. ‘‘ కర్ణాటక నుంచి మేం 60 మంది బృందంగా వచ్చాం. అన్ని వైపుల నుంచి తోశారు. 

తప్పించుకునే ఆస్కారం లేకుండాపోయింది’’ అని కర్ణాటక నుంచి వచ్చిన సరోజిని అనే భక్తురాలు ఏడుస్తూ చెప్పారు. ‘‘ బ్రహ్మముహూర్తంలో స్నానం చేద్దామని కూర్చుని, పడుకుని వేచిచూస్తున్న వారిపైకి వెనక నుంచి ఒక్కసారిగా జనం మీదపడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది’’ అని అస్సాం నుంచి వచ్చిన బాదామా దేవి చెప్పారు. ఇలా జరగాలని గంగమ్మ తలచిందేమో అని జార్ఖండ్‌లోని పలాము నుంచి వచ్చిన రామ్‌ సుమిరాన్‌ అనే భక్తుడు అన్నాడు.

 తొక్కిసలాటకు ముందే ఏదైనా ఉపద్రవం జరగొచ్చని ఊహించిన ప్రయాగ్‌రాజ్‌ డివిజనల్‌ కమిషనర్‌ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘాట్‌ వద్ద కూర్చుని వేచిచూస్తున్న భక్తులకు ఆయన ‘‘ లేవండి. లేవండి. త్వరగా స్నానంచేసి వెళ్లపొండి. వెనక నుంచి ఊహించనంత మంది జనం వచ్చేస్తున్నారు’’ అని ఆయన అక్కడి భక్తులకు ముందే హెచ్చరిస్తుండటం ఆ వీడియోలో ఉంది. ‘‘ భక్తుల్లో పోకిరీలూ ఉన్నారు. చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం లేకుండా నవ్వుతూ మమ్మల్ని తోసేశారు. తొక్కిసలాటలో మా పిల్లలు గాయపడ్డారు’’ అని ఆస్పత్రిలో ఉన్న ఒక మహిళ తెలిపింది. ­

విచారం వ్యక్తం చేసిన ప్రముఖులు
ఘటన జరిగిన విషయం తెల్సి వెంటనే ప్రధాని మోదీ సీఎం యోగికి ఉదయం, మధ్యాహ్నం నాలుగైదు సార్లు ఫోన్‌చేసి తాజా పరిస్థితిపై వాకబు చేశారు. భక్తుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ అన్నారు. రాష్ట్రపతి ముర్ము సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

 బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో బుధవారమే దాదాపు 10 కోట్ల మంది జనం వచ్చేశారని వారు బయటికెళ్లేదాకా కొత్తవారిని అనుమతించొద్దని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. సంగమ్‌ నోస్‌ ఘాట్‌ వైపు వెళ్లొద్దని భక్తులకు యోగి విజ్ఞప్తిచేశారు.  ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాలను మూసేసినట్లు తెలుస్తోంది. వెనక్కి వచ్చే భక్తుల కోసం రైల్వేశాఖ అదనపు రైళ్లను నడపనుంది.

ముగ్గురు సభ్యులతో జుడీషియల్‌ కమిషన్‌
ఘటనకు కారణాలను తెల్సుకునేందుకు జస్టిస్‌ హార్ష్ కుమార్, మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్‌ ఐఏఎస్‌ వీకే సింగ్‌లతో యోగి ప్రభుత్వం ఒక జుడీషయల్‌ కమిషన్‌ను నియమించింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి తలో రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఘటనాస్థలికి వచ్చి సమీక్ష జరపనున్నారు.

దుమ్మెత్తి పోసిన విపక్షాలు
నిర్వహణ లోపాలు, వీఐపీల స్నానాల మీదే అధికారుల ధ్యాస, ఘనంగా నిర్వహిస్తున్నామని అతి ప్రచార ఆర్భాటాలతో తొక్కిసలాట జరిగిందని విపక్షాలు యోగి, మోదీ ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశాయి. ‘‘ వీఐపీ సంస్కృతి వదిలేయండి. సాధారణ భక్తులను పట్టించుకోండి. ప్రచారంపై దృష్టిపెట్టి పటిష్ట భద్రతను గాలికొదిలేయడం వల్లే తొక్కిసలాట జరిగింది’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ, టీఎంసీ, శివసేన(యూబీటీ), బీఎస్పీ పార్టీలు యోగి, మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement