పుష్కరుడు వస్తున్నాడు! | Godavari puskaras to be started from july 14 | Sakshi
Sakshi News home page

పుష్కరుడు వస్తున్నాడు!

Published Mon, Jul 13 2015 1:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

పుష్కరుడు వస్తున్నాడు! - Sakshi

పుష్కరుడు వస్తున్నాడు!

* తెలంగాణలో తొలి పుష్కర సంరంభం రేపట్నుంచే
* ఉదయం 6.21 గంటల నుంచి పుణ్యస్నానాలు మొదలు
* ధర్మపురిలో సకుటుంబంగా స్నానం ఆచరించనున్న కేసీఆర్
* 25 వరకు కొనసాగనున్న పుష్కర స్నానాలు
* 2 కోట్ల మంది రావచ్చని అంచనా

 
సాక్షి, హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 25 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాలలో దాదాపు రెండు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. ఈ సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పుష్కరాలు కావటంతో ప్రభుత్వం  వీటిని ప్రతిష్టాత్మకంగా భావించి కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం, ముమ్మర ప్రచారం వెరసి గతంలో జరిగిన పుష్కరాలతో పోలిస్తే ఈ పుష్కరాలకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి తీరంలో 73 ప్రాంతాల్లో 81 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాలకు ప్రత్యేకంగా రోడ్లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ.50 కోట్లు అందజేసింది.
 
 ధర్మపురిలో కేసీఆర్ పుణ్యస్నానాలు
 మంగళవారం ఉదయం 6.21 గంటలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా ధర్మపురిలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఇందుకు సోమవారం సాయంత్రమే అక్కడికి బయలుదేరనున్నారు. అనంతరం కాళేశ్వరం, భద్రాచలం కూడా సందర్శించనున్నారు. ఆయన వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినా ఆయన రాకపై స్పష్టత లేదు.
 
 చాలాచోట్ల తుంపర స్నానాలే దిక్కు..
 వానలు లేకపోవడంతో ఇప్పటికీ నదిలోకి కొత్త నీరు అంతగా ప్రవేశించలేదు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. కరీంనగర్ జిల్లాలో త్రివేణీ సంగమ క్షేత్రమైన కాళేశ్వరం వరకు గోదావరిలో  ఇసుకే కనిపిస్తోంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత వచ్చి చేరటంతో అక్కడ్నుంచి నీటి ప్రవాహం కొంత పెరిగింది. వరంగల్ జిల్లా పరిధిలో గోదావరి ప్రవాహం ఓ పాయగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రాణహిత వచ్చి కలిసిన కాళేశ్వరం, భద్రాచలం మినహా మరెక్కడా పుష్కర ఘాట్లకు తగిలేలా నీరు లేదు. చాలాచోట్ల పైపుల కింద తుంపర స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 కనికరించని మహారాష్ట్ర
 ఎగువన మహారాష్ట్ర గోదావరిపై 12 ప్రాజెక్టులు నిర్మించిన నేపథ్యంలో వాటిల్లో నిల్వ ఉన్న నీటిని దిగువకు విడుదల చేసి పుష్కర భక్తులకు సాంత్వన కలిగించాలన్న తెలంగాణ అభ్యర్థనను మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తుది ప్రయత్నంగా సీఎం చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో ఆదివారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. గైక్వాడ్ రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చూడాలని కోరారు. కానీ అక్కడి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి ఈ నీరు ఖమ్మం సరిహద్దు వరకు చేరుకునే అవకాశం ఉంది. బాసర వద్ద నదిలో తాత్కాలిక అడ్డుకట్ట వేసి ఘాట్ల వద్ద నీరు ముందుకు వెళ్లకుండా చూస్తున్నారు. ధర్మపురి, వరంగల్ జిల్లా మంగపేట వద్ద కూడా ఇలాంటి ఏర్పాటు చేశారు.
 
 ఆంధ్రా వైపు దృష్టి
నీటి కొరత కారణంగా.. హైదరాబాద్ నుంచి పుష్కర స్నానాలకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ఆంధ్రావైపు దృష్టి సారించారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రత్యేక సర్వీసుల రిజర్వేషన్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. తెలంగాణలో భద్రాచలంపై భారం అధికంగా ఉంది. రోజుకు ఇక్కడికి దాదాపు 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఘాట్ల వద్దకు 12 రోజుల్లో కోటి మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఆదివారం రాత్రి వరకు కూడా చాలాచోట్ల పుష్కర ఘాట్లు, రోడ్ల పనులు జరుగుతూనే ఉన్నాయి.
 
బస్సులు, రైళ్లు ఫుల్
 పుష్కర భక్తుల కోసం 250 ట్రిప్పులకు సరిపడా రైళ్లు, 2,600 అదనపు బస్సులను ప్రకటించారు. ఇవి సరిపోయేలా కనిపించటం లేదు. హెలీకాప్టర్లనూ అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ నుంచి బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో 10 నిమిషాలు ఆకాశంలో విహరించవచ్చు. ఇందుకు రూ.2,500-రూ.3,000 వరకు చెల్లించాలి.
 
 బురద దాటితేనే నీళ్లు
 ప్రస్తుతం బాసరలో పాత ఘాట్ వద్ద మాత్రమే ఘాట్ల వరకు నీళ్లున్నాయి. వంతెన వద్ద నిర్మించిన కొత్త ఘాట్ల వద్ద 50 మీటర్లు బురదలో ముందుకు వెళ్తేనే నీళ్లు తగులుతాయి. ధర్మపురి, మంథని వద్ద ఇదే పరిస్థితి. వరంగల్ జిల్లా ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట వద్ద అర కిలోమీటరు నుంచి కిలోమీటరు మేర ఇసుకలో ముందుకు నడవాల్సిందే. భద్రాచలంలో ఘాట్లు దిగాక 10 మీటర్ల మేర బురద మేట వేసింది. దీంతో దానిపై రెండడుగుల మేర ఇసుక నింపారు. ఖమ్మం జిల్లా పర్ణశాల, మోతెగడ్డ, రామచంద్రాపురంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. చినరావిగూడెం, రామానుజపురంలో ఇసుకలో ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు చేసి ఘాట్ల వద్దకు నీటిని మళ్లిస్తున్నారు.
 
 ధర్మపురికి పీఠాధిపతుల రాక
 ధర్మపురి: ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు పీఠాధిపతులతోపాటు వంద మందికిపైగా వారి శిష్యులు రానున్నారు. శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధిపతి, రాఘవేంద్ర పీఠాధిపతి, వీరశైవ పీఠాధిపతి, ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, మదనానంద స్వామీజీ, తోగూట పీఠాధిపతి, విశాఖపట్నంకు చెందిన స్వరూపానంద స్వామీజీ రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement