అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు.
దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు.
ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు.
దేశ నలుమూలల నుంచీ...
అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ
అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే.
అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్
అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు.
ఆరు హారతులు, నైవేద్యాలు
బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment