rama mandiram
-
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!
అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు. ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి. ► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోనేరులకూ యోగం.. అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్‌ఫ్రంట్‌ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు. -
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
బాణం లేని రాముడు.. రంగు లేని రావణుడు
సాక్షి, దుమ్ముగూడెం(ఖమ్మం): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామయ్య వనవాసం చేసిన సమయంలో కీలక ఘట్టాల ఇతివృత్తాన్ని తెలియచేసేలా పర్ణశాల ఆలయ ఆవరణలో విగ్రహాలు, కుటీరాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రానురాను అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇక్కడి విగ్రహాలు రంగు వెలిసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్ష్మణుడి విగ్రహం రెండు ముక్కలు కాగా అక్కడి నుంచి తొలగించారు. అలాగే, సీతమ్మ–రామయ్య కలిసి ఉన్న విగ్రహంలో రాముడి చేతిలో ఉన్న బాణం సగం విరిగిపోయింది. ఇక పది తలల రావణుడి విగ్రహం రంగు వెలిసిపోగా.. సీతమ్మ బొటన వేలు విరిగిపడిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచవటి కుటీరంలో బొటన వేలు విరిగిన సీతమ్మ విగ్రహం ఏటా రూ.కోటి ఆదాయం పర్ణశాల దేవాలయానికి వివిధ రకాల వేలం పాటల ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. పర్ణశాల గ్రామానికి చెందిన వ్యక్తిని భద్రాద్రి ఆలయ పాలక మండలిలోకి తీసుకుంటే తప్ప ఆలయ అభివృద్ధి సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అరకొర సిబ్బందే.. పర్ణశాల రామాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయంలో నలుగురు అర్చకులకు గాను ముగ్గురే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరిని భద్రాచలం నిత్యాన్నదాన సత్రానికి డిప్యుటేషన్‌పై పంపించారు. ఇక దేవాలయానికి సరిపడా స్థలం ఉన్నందున రాత్రివేళ భక్తులు బస చేసేలా కాటేజీలు నిర్మిస్తే అటు పర్యాటకులకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. దీనికి తోడు వ్యాపార వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. సమయపాలన పాటించడం లేదు ఆలయానికి వచ్చే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధానం కారణం. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తేనే సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావొచ్చు. – గోసంగి నరసింహారావు, గ్రామస్తుడు, పర్ణశాల కాటేజీలు నిర్మిస్తే బాగుండు పర్ణశాల ఆలయ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే సుదూర ప్రాంతా ల భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అవకా శం ఉంటుంది. కానీ ఇక్కడ కాటేజీలకు తోడు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వచ్చి వెంటనే వెళ్లిపోవాల్సి వస్తోంది. – శివ కోటేశ్వరి, భక్తురాలు, గుంటూరు జిల్లా చిల్డన్స్ పార్క్, గార్డెన్ ఏర్పాటు చేయాలి పర్ణశాల ఆలయ ప్రాంగణంలో భక్తులు, పిల్లలు సేద తీరేలా చిల్డ్రన్స్ పార్క్, గార్డెనింగ్ ఏర్పాటు చేయాలి. దర్శనం అనంతరం కొంచెంసేపు కాలక్షేపం చేద్దామంటే గోదావరి బోట్ షికార్ తప్ప మరేవి కనిపించడం లేదు. ఆలయ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. – శ్రీకాంత్, భక్తుడు, జమ్మికుంట -
మందిర నిర్మాణానికి మహమ్మద్ విరాళం
మొయినాబాద్ (చేవెళ్ల): అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఓ ముస్లిం యువకుడు విరాళం అందజేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజగూడలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీమ్ అనే యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేలు విరాళం అందజేశాడు. దీనిపై బీజేపీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విరాళాల సేకరణలో కులమతాలకు అతీతంగా స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్) ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు మందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. -
ఒక తీర్పు – ఒక నమ్మకం
శ్రీరాముడు అనే పౌరాణిక పాత్ర భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద. హిందూ మతం అంటే ఏమిటో కూడా తెలియని ఈ దేశంలో పుట్టి పెరిగే వందలాది జాతులు, వేలాది తెగల మనుషులకు రాము డంటే తెలుసు. రాముడు దేవుడనీ తెలుసు. యాభయ్యే ళ్లకు పూర్వం మనదేశంలో రామాలయం లేని ఊరు ఉండేదే కాదు. శ్రీరాముడు జీవించిన కాలం త్రేతాయుగ మని చెబుతాయి మన పురాణాలు. నాటి యుగధర్మానికి విలువలకు రక్షణగా నిలబడినవాడు రాముడు. రాముని ఆదర్శాల్లో కొన్ని ఆ యుగానికి పనికివచ్చేవి మాత్రమే ఉన్నప్పటికీ సర్వకాలాలకూ పనికివచ్చేవి చాలా ఉన్నా యని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా మనిషి నడవ డిక, కుటుంబ సభ్యులతో, ప్రజలతో మెలగవలసిన తీరులో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. శ్రీరామావతారంలో మాయలూ మంత్రాలూ వుండవు. మానవీయ విలువలు మాత్రమే ఉంటాయి. అందువల్ల రాముడు మతచిహ్నం కాదు. ఈ దేశ సాంస్కృతిక చిహ్నం మాత్రమే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తెగల ఉమ్మడి ఆస్తి శ్రీరామచంద్రుడు. రామాయణం ఏ కొంచెం తెలిసినవాడైనా రాముడు పుట్టింది అయోధ్య లోనే అనుకుంటాడు. మన వూళ్లో రామాలయం ఉండగా లేనిది ఆయన పుట్టిన ఊళ్లో ఉంటే తప్పేమిటి అనుకుం టాడు. ఇలా అనుకునే వాళ్లలో అన్ని జీవన ప్రవాహాలకు చెందిన వాళ్లుంటారు. ఒకరకంగా ఇది భారతీయుల సమష్టి ఇచ్ఛ. ఆ ఇచ్ఛ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో ప్రతి ఫలించింది. తీర్పును శిరసావహించిన ముస్లిం మత పెద్దలు ఆదర్శనీయులు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా భారతీయులు ఈ తీర్పును స్వాగతించారు. వందల ఏళ్ల వివాదానికి ముగింపు పలుకుతూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మా సనం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పుపై అనూ హ్యంగా దేశ ప్రజల్లో వెల్లడైన దాదాపు ఏకగ్రీవ స్పందన పెరిగిన మన సామాజిక పరిణతికి నిదర్శనం. మత విశ్వాసాలనూ, నమ్మకాలనూ, భావోద్వేగాలనూ గౌర విస్తూ, వాటి జోలికి వెళ్లకుండా, న్యాయపరమైన అంశాలు, సాక్ష్యాలు–ఆధారాలు ప్రాతిపదికన వాదోప వాదాలను బేరీజు వేసి ఎటువంటి గుంజాటన లేకుండా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. మతాల మధ్య విషాన్ని చిమ్మి, మనుషుల మధ్య కల తలు రేపి, చరిత్రలో ఒక నెత్తుటి అధ్యాయాన్ని డిక్టేట్ చేసిన వివాదానికి ఈ తీర్పుతో ఎట్టకేలకు తెరపడిందని భావించవచ్చు. వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని న్యాయస్థానం ‘రాముడి’కే అప్పగించింది. మసీదు నిర్మాణంకోసం 5 ఎకరాల విలువైన భూమిని ఈ కేసులో ప్రధాన కక్షిదారైన సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చింది. మూడు మాసాల్లోగా ఒక ట్రస్టును ఏర్పాటుచేసి ఆలయ నిర్మాణ పనులను అప్పగించాలని కేంద్రానికి సూచించింది. ఈ తీర్పుపై ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి–అప్పటితో పోలిస్తే విద్వేషాలు బాగా తగ్గాయి. రెండు– ఈ వివాదం దీర్ఘకాలం సాగడం మంచిది కాదన్న అభిప్రాయం అందరిలో ఏర్పడటం. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతోపాటు సీపీఎం మాత్రమే తీర్పును వ్యతిరేకించింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. ప్రధాన కక్షిదారులైన సున్నీ వక్ఫ్ బోర్డు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ రివ్యూ పిటీషన్ వేయకూడదని నిర్ణయం తీసుకుని, తన హుందాతనాన్ని చాటుకున్నది. బాబ్రీ మసీదు ప్రాంగణంలోని రామ్ చబూత్రలో రామమందిరం నిర్మించుకోవడానికి అనుమతి కోరుతూ 1885వ సంవత్సరంలో మహంత్ రఘువరదాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక వ్యాజ్యం వేశాడు. అప్పుడు మొదలైన న్యాయపోరాటం 134 ఏళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరంగానే ముగింపు దశకు చేరుకోవడం విశేషం. కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. అప్పట్లో బాబ్రీ మసీద్ ఉద్యమ సమ న్వయ సంఘం(బీఎంఎంసీ) కన్వీనర్‌గా వున్న సయ్యద్ షహాబుద్దీన్ రాజీవ్‌గాంధీకి ఒక లేఖ రాశారు. రామ్ చబూత్ర ప్రాంతంలో రామమందిరం నిర్మించుకోవ చ్చనీ, బాబ్రీ మసీదు వున్న ప్రాంతాన్ని కేంద్రం అధీనం లోకి తీసుకొని రెంటి మధ్యన ఒక అడ్డు గోడ నిర్మిం చాలని, బాబ్రీ మసీదును చారిత్రక ప్రాధాన్యం వున్న కట్టడంగా గుర్తించాలని కోరారు. అదే సమయంలో బీజేపీ అగ్రనాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, బాబ్రీ మసీదు, రామమందిరం పక్కపక్కనే ఉండేలా మరో రక మైన అభిప్రాయాన్ని ప్రకటించారు. ముస్లింలు వివా దాస్పద స్థలాన్ని సౌహార్దతా సూచకంగా హిందువు లకు అప్పగించాలి. హిందువులు మసీదును అలాగే వుంచి పక్కనే రామమందిరాన్ని నిర్మించుకోవాలి. ఈ రెండు అభిప్రాయాల్లోనూ మందిరం, మసీదు పక్క పక్కనే ఉంటాయి. ప్రభుత్వం ఆ సమయంలో కొంత క్రియాశీల కంగా వ్యవహరించి వుంటే కోర్టు బయటే ఈ వివాదంపై ఒక అంగీకారం కుదిరి ఉండేదేమో. కానీ, ప్రభుత్వం చూపిన అలక్ష్యం వల్ల తరువాతి కాలంలో దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. 1986లో బాబ్రీ మసీదు తలుపులు తెరిచి హిందు వులు పూజలు చేసుకోవచ్చని ఫైజాబాద్ జిల్లా మేజి స్ట్రేట్ అనుమతులిచ్చారు. అదే సమయంలో, ఈ అంశం పార్టీ బలోపేతానికి ఉపకరించేదిగా బీజేపీ భావించి వ్యూహారచన సిద్ధం చేసింది. ముస్లిం వర్గాలు సైతం పోటీగా ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకు న్నాయి. 89 ఎన్నికల్లో బీజేపీ బలం గణనీయంగా పెరి గింది. ఆ ఎన్నికల్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయక త్వంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి మండల్ సిఫార్సులను ఆమోదిస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులూ, యువకులూ ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. సమాజంలో ఏర్పడిన అశాంతి వాతావరణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ రామ మందిర నినాదాన్ని ఉద్యమ స్థాయికి బీజేపీ తీసుకొని పోయింది. మండల్‌కు విరుగుడుగానే బీజేపీ మందిర్‌ను ప్రయోగించిందని విమర్శలు కొన్ని వచ్చినా, వాస్తవానికి ఢిల్లీ గద్దె లక్ష్యంగానే ‘రామ’ బాణాన్ని బీజేపీ ప్రయోగిం చిందని చెప్పవచ్చు. 1984 ఎన్నికల్లో రెండు సీట్లు గెలి చిన పార్టీ 89లో 85 సీట్లకు, 91లో 120 సీట్లకు ఎగబా కడానికి ఆ బాణమే కారణం. రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేసిన రథయాత్ర కూడా బీజేపీ పునాదు లను విస్తృతం చేసింది. ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్ గాంధీ దారుణహత్యకు గురికాకుండా వున్నట్ల యితే, బీజేపీ బలం మరింత పెరిగి వుండేది. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన, అనంతరం చెలరేగిన హింసా, రక్తపాతం దేశ లౌకిక త్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇప్పుడిప్పుడే ఆ పీడకలల ప్రభావం నుంచి బయటపడి దేశం కోలుకుంటున్న దశలో న్యాయస్థానం ద్వారా సమస్యకు న్యాయపరమైన పరిష్కారం లభించడం ప్రజలకు ఊరట కలిగించే విషయం. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా న్యాయపరమైన అంశాల ప్రాతిపదికగానే ఈ తీర్పును ఇస్తున్నట్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచి ప్రకటిం చింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం బాబ్రీ మసీదు నిర్మాణం, అంతకుముందే అక్కడ ఉన్న ఒక నిర్మాణం శిథిలాలపై జరిగింది. అలాగే, వివాదాస్పద స్థలం వెలుపల ప్రాంగణంలో క్రమం తప్ప కుండా పూజలు జరుగుతున్నట్టు హిందువులు సాక్ష్యాలు సమర్పించారు. కానీ, ప్రాంగణం లోపలి భాగం ముస్లింల ఆధీనంలోనే వుందనడానికి తగిన సాక్ష్యాలు సమర్పించ లేకపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది. బాబ్రీమసీదు నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను మూడు దశలుగా న్యాయ స్థానం అభిప్రాయపడినట్టు కనిపిస్తున్నది. 1528లో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినప్పటి నుంచి 1885 వరకు ఒక దశ. రామ్ చబూత్రలో పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని హిందువులు ఆ సంవత్సరం కోర్టులో వ్యాజ్యం వేశారు. అప్పటినుంచి 1949 వరకు ఒకదశ. బాబ్రీ మసీదులో శ్రీరాముడు, సీతాదేవిల విగ్ర హాలను పెట్టారంటూ కేసు నమోదు చేసి ప్రాంగణానికి ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం తాళాలు వేయించింది. నాటినుంచి నేటి వరకు ఉద్వేగాలు, ఉద్యమాలు, న్యాయపోరాటాలు తీవ్రమైన మూడవ దశ. అయోధ్య వివాదాస్పద భూమి మొత్తం రాముడికే చెందుతుం దంటూ ఐదుగురు న్యాయమూర్తులూ ఏకగ్రీవంగానే తీర్పునిచ్చారు. ఐదుగురిలో ఒక న్యాయమూర్తి మరిన్ని ఆధారాలను తీర్పుకు మద్దతుగా నమోదు చేశారు. 1858వ సంవత్సరంలో అవ«ద్ ఠాణేదార్ శీతల్ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్ జన్మస్థాన్ అని పేర్కొనడాన్ని ఒక ఆధారంగా న్యాయమూర్తి పేర్కొ న్నారు. మరో ఆధారం 1878లో సెటిల్మెంట్ అధికారి కార్నెగీ గీసిన ఫైజాబాద్ తాలూకా స్కెచ్. ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదని స్కెచ్‌లో కార్నెగి వ్యాఖ్యానిం చాడు. 1528లో జన్మస్థాన్లోనే బాబర్ మసీదును నిర్మిం చాడని అందులో కార్నెగీ అభిప్రాయపడ్డాడు. ఆర్కియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాయవ్య అవధ్ విభాగం 1889 నాటి నివేదికలో జన్మస్థాన్‌లో అద్భుతమైన ఆలయం వుండేదని, దాని స్తంభాలను కూడా ముస్లింలు తమ నిర్మాణంలో వాడుకున్నారని వుంది. బాబర్ నిర్మించిన మసీదు మూడు గుమ్మటాల అడుగున శ్రీరాముని జన్మస్థలం వుందనేది అక్కడి హిందువుల ప్రగాఢ విశ్వాసం. రామజన్మస్థలం మీదనే మసీదును నిర్మించారని తరతరాలుగా వారి నమ్మిక. ఒకపక్క ఎన్ని వివాదాలు, న్యాయపోరాటాలూ ముసు రుకుంటున్నా ఇదే నమ్మకం వారిలో పరంపరాగతంగా వస్తున్నదే తప్ప ఎప్పుడూ సడలలేదు. బ్రిటీష్ కాలం లోనే ఆ ప్రాంగణాన్ని విభజించి హిందువులను మూడు గుమ్మటాలకు ఆవలనే ఉంచినా, అది శ్రీరాముని జన్మ స్థలమన్న నమ్మకంతోనే పక్కన వున్న రామ్చబూత్ర నుంచి పూజలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో వారి నమ్మకం నిలువెత్తు ఆలయంగా నిల బడిపోనున్నది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఎన్నికలప్పుడు చాలా మాట్లాడతాం..
న్యూఢిల్లీ : ప్రజస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు మతం, కులం, భాష, ప్రాంతం పేర్లు చెప్పి ఓట్లు అడగటం సరికాదంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అజెండా ఆజ్‌తక్ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలు తాము చేసిన, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి దాని ఆధారంగా ఓటు వేయమని కోరాలి. అంతే కానీ కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఓట్లు అడగకూడదన్నారు. పనితీరును బట్టి ప్రభుత్వ వ్యవస్థను అంచనా వేయాలి.. కానీ దురదృష్టం కొద్ది మన దేశంలో ఇది జరగడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన యువ ఓటర్లను ఉద్దేశిస్తూ.. అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి అని సూచించారు. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే బీజేపీ రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతుంది.. ఎందుకని ప్రశ్నించగా.. ‘రామ మందిరం నిర్మాణం పూర్తిగా భిన్నమైన అంశం. ఇది మతానికి సంబంధించినది కాదు. చరిత్రకు, సంస్కృతికి సంబంధించిన అంశం. పుట్టిన స్థలంలోనే మందిరం నిర్మించకూడదంటే.. మరేక్కడ నిర్మించాలి. కోట్ల మంది హిందువుల రామున్ని నమ్ముతారు. ఇది చాలా సున్నితమైన అంశం’ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు బీజేపీ నాయకులు హనుమంతుడు దళితుడంటూ.. రాజీవ్ గాంధీ గోత్రనామాల చెప్పాలంటూ డిమాండ్ చేయడాన్ని గూర్చి ప్రశ్నించగా.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చాలా మాట్లాడతారు. వాటిల్లో కొన్ని పనికి వచ్చేవి ఉంటాయి.. కొన్ని పనికిమాలినవి ఉంటాయి. అయితే మీడియా వాటిలో ఒకే ఒక్క లైన్‌ని తీసుకుని దాన్నే పదే పదే టెలికాస్ట్ చేస్తుంది అన్నారు. రిపోర్డ్ చేసే హక్కు మీడియాకుంది. కానీ దేశానికి పనికి వచ్చే విషయాలేంటే ఆలోచిస్తే మంచిదన్నారు. -
రామ మందిరం కట్టకపోతే బీజేపీ కథ అంతే!
లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీకి అధికారం దక్కదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. రెండు రోజుల అయ్యోధ్య పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ఆదివారం ఉదయం వివాదాస్పద రామమందిరం-బాబ్రీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామ మందిర నిర్మాణం ఎప్పుడు చేపడతారో బీజేపీ చెప్పాలి. రాష్టంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. దశాబ్దాలుగా రామమందిర విషయాన్ని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో మందిర నిర్మాణం కష్టమే కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీలో ఉందన్నారు. ఆర్డినెన్స్ తెస్తారో చట్టం చేస్తారో మాకనవసరమని, రామ మందిర నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో మాత్రమే చెప్పండంటూ నిలదీశారు.‘ రామ మందిరాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిర్మించాలి, ఆ ఘనతను వారేనే తీసుకోమనండి. వారు నిర్మించకపోయినా.. రామమందిర నిర్మాణం జరుగుతుంది, కానీ బీజేపీ మాత్రం అధికారంలో కొనసాగదు’ అని హెచ్చరించారు. రామమందిరం ముందుండేది, ఇప్పుడు, ఎప్పుడు ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. ఈ ఆలయ నిర్మాణం హిందువుల మనోభావాలకు సంబంధించిందని, ఇంకెప్పుడు నిర్మిస్తారని, తామెప్పుడు చూడాలని ప్రశ్నించారు. తొలుత ఆర్ఎస్సెస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) రామమందిర నిర్మాణనికి ఆర్డినేన్సు తిసుకురావలంటూ డిమాండ్ చేయగా.. తాజాగా విశ్వహిందూ పరిషత్, శివసేనలు సైతం ఆలయ నిర్మాణం చేపట్టాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ ఆలయ స్థలం వివాదం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం ఈ కేసును జనవరికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
రామ మందిరాన్ని విపక్షాలూ వ్యతిరేకించలేవు
హరిద్వార్: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించబోవని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు రాముడే ఆరాధ్య దేవుడైనందున రామ మందిర నిర్మా ణాన్ని ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించబోరన్నారు. ఆరెస్సెస్, బీజేపీలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాయని, అయితే, కొన్ని అంశాలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. హరిద్వార్‌లో పతంజలి యోగాపీఠ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలకు కొన్ని పరిమితులు ఉంటాయని, ఆ పరిమితులకు లోబడే అవి పని చేయాల్సి ఉంటుందన్న భాగవత్.. సాధువులు, సన్యాసులకు ఆ పరిమితులేవీ ఉండవు కనుక దేశం, మతం, సమాజం అభివృద్ధి కొరకు పనిచేయాలని కోరారు. అధికారంలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యమైన విషయమని, ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాలే అధికారంలో కొనసాగడం అవసరమన్నారు. తమ కన్నా సాధువులు సమర్ధులని మంత్రులు, సంపన్నులు అంగీకరించాలని బాబా రామ్ దేవ్ అన్నారు. -
'రామమందిరం నిర్మించి తీరుతాం'
సాక్షి, నాగ్‌పూర్ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించడం కష్టమే అయినా, అక్కడ మందిరం నిర్మించడం మాత్రం ఖాయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఆదివారం స్పష్టం చేశారు. అయోధ్యలో మరే ఇతర కట్టడాన్నీ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ శనివారం జరిగిన సంఘ్ సమావేశంలో జోషి ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికవడం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సంఘ్ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్ క్షేత్రీయ సంఘ్ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు సంస్థ ప్రకటించింది. -
‘రెండు నెలల్లో రామమందిర నిర్మాణం’
హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. హిందువులు రామమందిరం కోసం కాకుండా, రామ జన్మభూమి కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి కాచిగూడలోని మ్యాడం అంజయ్యహాల్‌లో జరిగిన బజరంగ్దళ్ శక్తి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రామమందిర నిర్మాణానికి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని, చట్టం ద్వారానే మందిర నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. దేశంలో, తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింలకు మాదిరిగానే హిందువుల కోసం హిందూ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆర్టికల్ 370ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్లో హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, సైనికులపై రోజూ దాడులు చేస్తున్నా ఏం చేయలేకపోతున్నారని అన్నారు. మానవ హక్కులు కేవలం మైనారిటీలకే ఉన్నాయా.. హిందువులకు ఉండవా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు గుణంపల్లి రాఘవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ ప్రాంత సంయోజక్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
‘మందిరం’ కోసం చావడానికైనా రెడీ
ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు లక్నో: రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని, మందిరం కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను కలిసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ‘రామ మందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. దానిపై నాకెంతో గౌరవం ఉంది. మందిరం కోసం జైలుకెళ్లడానికైనా, ఉరేసుకోడానికైనా సిద్ధం’ అని చెప్పారు. ‘ రామ మందిరంపై చర్చించాల్సిందేమీ లేదు. ఈ అంశం మాకేం కొత్త కాదు. రామ మందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు అవైద్యనాథ్ నాయకుడు’ అని వివరించారు.