న్యూఢిల్లీ : ప్రజస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు మతం, కులం, భాష, ప్రాంతం పేర్లు చెప్పి ఓట్లు అడగటం సరికాదంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అజెండా ఆజ్‌తక్ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలు తాము చేసిన, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి దాని ఆధారంగా ఓటు వేయమని కోరాలి. అంతే కానీ కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఓట్లు అడగకూడదన్నారు. పనితీరును బట్టి ప్రభుత్వ వ్యవస్థను అంచనా వేయాలి.. కానీ దురదృష్టం కొద్ది మన దేశంలో ఇది జరగడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన యువ ఓటర్లను ఉద్దేశిస్తూ.. అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి అని సూచించారు.
కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే బీజేపీ రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతుంది.. ఎందుకని ప్రశ్నించగా.. ‘రామ మందిరం నిర్మాణం పూర్తిగా భిన్నమైన అంశం. ఇది మతానికి సంబంధించినది కాదు. చరిత్రకు, సంస్కృతికి సంబంధించిన అంశం. పుట్టిన స్థలంలోనే మందిరం నిర్మించకూడదంటే.. మరేక్కడ నిర్మించాలి. కోట్ల మంది హిందువుల రామున్ని నమ్ముతారు. ఇది చాలా సున్నితమైన అంశం’ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు బీజేపీ నాయకులు హనుమంతుడు దళితుడంటూ.. రాజీవ్ గాంధీ గోత్రనామాల చెప్పాలంటూ డిమాండ్ చేయడాన్ని గూర్చి ప్రశ్నించగా.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చాలా మాట్లాడతారు. వాటిల్లో కొన్ని పనికి వచ్చేవి ఉంటాయి.. కొన్ని పనికిమాలినవి ఉంటాయి. అయితే మీడియా వాటిలో ఒకే ఒక్క లైన్‌ని తీసుకుని దాన్నే పదే పదే టెలికాస్ట్ చేస్తుంది అన్నారు. రిపోర్డ్ చేసే హక్కు మీడియాకుంది. కానీ దేశానికి పనికి వచ్చే విషయాలేంటే ఆలోచిస్తే మంచిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment