కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీ | Govt Working on Uniform Toll Policy Says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీ

Published Mon, Feb 3 2025 6:30 PM | Last Updated on Mon, Feb 3 2025 7:31 PM

Govt Working on Uniform Toll Policy Says Nitin Gadkari

భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే రోడ్డుపై టోల్ ప్లాజాలు అధికమవుతున్నాయి. టోల్ వసూళ్లు కూడా పెరిగాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' (Nithin Gadkari) 'ఏకరీతి టోల్ విధానం' గురించి ప్రస్తావించారు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు.

వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

జాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు.

ప్రస్తుతం, జాతీయ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్‌లో 60 శాతం ప్రైవేట్ కార్ల వల్లనే ఏర్పడుతోంది. ఈ వాహనాల ద్వారా వచ్చే టోల్ ఆదాయం కేవలం 20-26 శాతం మాత్రమే. అయితే గత పదేళ్లలో టోల్ వసూళ్ల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఆదాయం కూడా పెరిగింది. 2023-24లో భారతదేశంలో మొత్తం టోల్ వసూళ్లు రూ. 64,809.86 కోట్లకు చేరాయి. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2019-20లో ఈ వసూళ్లు రూ.27,503 కోట్లు.

ఇదీ చదవండి: అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా!

జాతీయ రహదారులపై అన్ని టోల్ ప్లాజాలు జాతీయ రహదారుల నియమాలు, 2008 & సంబంధిత రాయితీ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. హైవేల నిర్మాణం కూడా వేగంగా జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 37 కి.మీ హైవేల నిర్మాణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 7,000 కి.మీ హైవేల నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి-మార్చి కాలంలో రహదారుల నిర్మాణ వేగం మరింత పెరుగుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే భారతదేశం రెండవ అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశంలో జాతీయ రహదారులు మొత్తం 1,46,195 కి.మీ పొడవును కలిగి ఉన్నాయి. దేశంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి.. లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి 34,800 కి.మీ పొడవును కవర్ చేయడానికి 2017లో ప్రభుత్వం 'భారతమాల పరియోజన' (Bharatmala Pariyojana)ను ఆమోదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement