పర్ణశాలలోని రామయ్య చేతిలో విరిగిన బాణం, రంగు వెలిసిపోయి కనిపిస్తున్న రావణుడి విగ్రహం
సాక్షి, దుమ్ముగూడెం(ఖమ్మం): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామయ్య వనవాసం చేసిన సమయంలో కీలక ఘట్టాల ఇతివృత్తాన్ని తెలియచేసేలా పర్ణశాల ఆలయ ఆవరణలో విగ్రహాలు, కుటీరాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రానురాను అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇక్కడి విగ్రహాలు రంగు వెలిసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్ష్మణుడి విగ్రహం రెండు ముక్కలు కాగా అక్కడి నుంచి తొలగించారు. అలాగే, సీతమ్మ–రామయ్య కలిసి ఉన్న విగ్రహంలో రాముడి చేతిలో ఉన్న బాణం సగం విరిగిపోయింది. ఇక పది తలల రావణుడి విగ్రహం రంగు వెలిసిపోగా.. సీతమ్మ బొటన వేలు విరిగిపడిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచవటి కుటీరంలో బొటన వేలు విరిగిన సీతమ్మ విగ్రహం
ఏటా రూ.కోటి ఆదాయం
పర్ణశాల దేవాలయానికి వివిధ రకాల వేలం పాటల ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. పర్ణశాల గ్రామానికి చెందిన వ్యక్తిని భద్రాద్రి ఆలయ పాలక మండలిలోకి తీసుకుంటే తప్ప ఆలయ అభివృద్ధి సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది.
అరకొర సిబ్బందే..
పర్ణశాల రామాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయంలో నలుగురు అర్చకులకు గాను ముగ్గురే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరిని భద్రాచలం నిత్యాన్నదాన సత్రానికి డిప్యుటేషన్‌పై పంపించారు. ఇక దేవాలయానికి సరిపడా స్థలం ఉన్నందున రాత్రివేళ భక్తులు బస చేసేలా కాటేజీలు నిర్మిస్తే అటు పర్యాటకులకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. దీనికి తోడు వ్యాపార వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
సమయపాలన పాటించడం లేదు
ఆలయానికి వచ్చే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధానం కారణం. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తేనే సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావొచ్చు.
– గోసంగి నరసింహారావు, గ్రామస్తుడు, పర్ణశాల
కాటేజీలు నిర్మిస్తే బాగుండు
పర్ణశాల ఆలయ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే సుదూర ప్రాంతా ల భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అవకా శం ఉంటుంది. కానీ ఇక్కడ కాటేజీలకు తోడు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వచ్చి వెంటనే వెళ్లిపోవాల్సి వస్తోంది.
– శివ కోటేశ్వరి, భక్తురాలు, గుంటూరు జిల్లా
చిల్డన్స్ పార్క్, గార్డెన్ ఏర్పాటు చేయాలి
పర్ణశాల ఆలయ ప్రాంగణంలో భక్తులు, పిల్లలు సేద తీరేలా చిల్డ్రన్స్ పార్క్, గార్డెనింగ్ ఏర్పాటు చేయాలి. దర్శనం అనంతరం కొంచెంసేపు కాలక్షేపం చేద్దామంటే గోదావరి బోట్ షికార్ తప్ప మరేవి కనిపించడం లేదు. ఆలయ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి.
– శ్రీకాంత్, భక్తుడు, జమ్మికుంట
Comments
Please login to add a commentAdd a comment