Parnasala
-
పర్ణశాల ఆలయం అభివృద్ధి పై అధికారుల నిర్లక్ష్యం
-
బాణం లేని రాముడు.. రంగు లేని రావణుడు
సాక్షి, దుమ్ముగూడెం(ఖమ్మం): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామయ్య వనవాసం చేసిన సమయంలో కీలక ఘట్టాల ఇతివృత్తాన్ని తెలియచేసేలా పర్ణశాల ఆలయ ఆవరణలో విగ్రహాలు, కుటీరాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రానురాను అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇక్కడి విగ్రహాలు రంగు వెలిసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్ష్మణుడి విగ్రహం రెండు ముక్కలు కాగా అక్కడి నుంచి తొలగించారు. అలాగే, సీతమ్మ–రామయ్య కలిసి ఉన్న విగ్రహంలో రాముడి చేతిలో ఉన్న బాణం సగం విరిగిపోయింది. ఇక పది తలల రావణుడి విగ్రహం రంగు వెలిసిపోగా.. సీతమ్మ బొటన వేలు విరిగిపడిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచవటి కుటీరంలో బొటన వేలు విరిగిన సీతమ్మ విగ్రహం ఏటా రూ.కోటి ఆదాయం పర్ణశాల దేవాలయానికి వివిధ రకాల వేలం పాటల ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. పర్ణశాల గ్రామానికి చెందిన వ్యక్తిని భద్రాద్రి ఆలయ పాలక మండలిలోకి తీసుకుంటే తప్ప ఆలయ అభివృద్ధి సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అరకొర సిబ్బందే.. పర్ణశాల రామాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయంలో నలుగురు అర్చకులకు గాను ముగ్గురే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరిని భద్రాచలం నిత్యాన్నదాన సత్రానికి డిప్యుటేషన్‌పై పంపించారు. ఇక దేవాలయానికి సరిపడా స్థలం ఉన్నందున రాత్రివేళ భక్తులు బస చేసేలా కాటేజీలు నిర్మిస్తే అటు పర్యాటకులకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. దీనికి తోడు వ్యాపార వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. సమయపాలన పాటించడం లేదు ఆలయానికి వచ్చే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధానం కారణం. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తేనే సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావొచ్చు. – గోసంగి నరసింహారావు, గ్రామస్తుడు, పర్ణశాల కాటేజీలు నిర్మిస్తే బాగుండు పర్ణశాల ఆలయ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే సుదూర ప్రాంతా ల భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అవకా శం ఉంటుంది. కానీ ఇక్కడ కాటేజీలకు తోడు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వచ్చి వెంటనే వెళ్లిపోవాల్సి వస్తోంది. – శివ కోటేశ్వరి, భక్తురాలు, గుంటూరు జిల్లా చిల్డన్స్ పార్క్, గార్డెన్ ఏర్పాటు చేయాలి పర్ణశాల ఆలయ ప్రాంగణంలో భక్తులు, పిల్లలు సేద తీరేలా చిల్డ్రన్స్ పార్క్, గార్డెనింగ్ ఏర్పాటు చేయాలి. దర్శనం అనంతరం కొంచెంసేపు కాలక్షేపం చేద్దామంటే గోదావరి బోట్ షికార్ తప్ప మరేవి కనిపించడం లేదు. ఆలయ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. – శ్రీకాంత్, భక్తుడు, జమ్మికుంట -
మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, పర్ణశాల: మావోయిస్టు పార్టీకి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న సానుభూతిపరులైన ఏడుగురిని బుధవారం అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించినట్టు ఎస్ఐ.బాలకృష్ణ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు... మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామ శివారులోని తాటివారిగూడెం వెళ్లే దారి మధ్యన ఆటోలో ఏడుగురు వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమను చూసి ఆటోలో పారిపోతున్న ఆ ఏడుగురిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని, దుమ్ముగూడెం మండలంలోని దబ్బనూతల గ్రామస్తులు సొందె రవి, కుర్సం మురళి, తెల్లం నాగరాజు, బూర్గంపాడు మండలం వుడ్ యార్డ్ లక్ష్మీపురం గ్రామస్తుడు ఊకం శ్రీను, ఏపీలోని చింతూరు మండలం పోతనపల్లి గ్రామస్తుడు మడకం చిన్నబాబు, పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామస్తుడు బిందాని దమన్ అలియాస్ ధర్మ, ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామస్తుడు కొండ్రు జగదీష్గా గుర్తించారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. పాల్వంచ మండలంలోని తోగ్గూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం నుంచి మావోయిస్టులకు వీటిని సరఫరా చేస్తున్నట్టుగా వారు అంగీకరించారు. వీరి నుంచి పది ఎక్స్‌పోసివ్ బూస్టర్లు, పది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, 300 మీటర్ల డీఎఫ్ వైర్, ఆటో (టీఎస్28 టీ0208) స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేశారు. వారిని ఖమ్మం కోర్టుకు అప్పగించారు. కేసును చర్ల సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
వాననీటిలో సీతమ్మ విగ్రహం
పర్ణశాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామాలయం ఆవరణలోని ఉన్న కుటీరంలో సీతమ్మ వారి విగ్రహం చుట్టూ వర్షపునీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆనాటి రామాయణ వనవాస దృశ్యాలతో ఏర్పాటు చేసిన విగ్రహాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అక్కడ ఉన్న డ్రెయిన్లలో కూడా మురుగు పేరుకుపోయిందని, దీని వల్లే నీరంతా ఇలా విగ్రహాల చుట్టూ వచ్చి చేరుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అదిగో భద్రాద్రి ఇదిగో పర్ణశాల!
భద్రాచలం సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే. ఈ పుణ్య క్షేత్రం, రాములవారి గుడి, రామదాసు అని పిలువబడే గోపన్న, గుడి చరిత్రం.. అందరికీ తెలిసిందే. ఉగాది ముందు రామనవమి దాకా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే తిరునాళ్లు చాలా ప్రసిద్ధి. ప్రతి యేటా లాగే ఈ రామనవమికి కూడా భద్రాచలం సిద్ధమవుతోంది. సీతారాములవారి కల్యాణం బ్రహ్మానందమైన ఒక విశేషం. రామనవమి సంబురాలు, భద్రాచలం నుండి ప్రవహిస్తున్న గోదావరి, ఇవ్వన్ని తెలిసినవే! వీటిని మించి ప్రదేశం మరొకటి ఉంది. ఈ పట్టణం నుండి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉన్నది. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రఖ్యాతి చెందింది. పర్ణశాల వెళితే మొదట మనకు అనిపించేది ఏమిటంటే దీనికి రావల్సినంత గుర్తింపు రాలేదేమో అని. భద్రాచలం నుండి షేర్ ఆటో లేక టాక్సీల ద్వారా పర్ణశాల చేరుకోవచ్చు. ప్రభుత్వం నడిపే బస్సులు కూడా ఉన్నాయి. నవంబరు-ఫిబ్రవరి కాలంలో పర్ణశాలకు భధ్రచాలం నుంచి పడవలో కూడా వెళ్లవచ్చు. అప్పుడు గోదావరి నదిలో నీటి ప్రవాహం బాగుంటుంది కాబట్టి. రామనవమి సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పడవలుండవు. పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ఉంది. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొని ఉన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట. సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోని చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధగుట్ట’పై చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి. రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక స్థలాలు. అక్కడి స్థానికుల కథనం ప్రకారం.. రావణాసురుడు తన పుష్పకవిమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడట. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపి, సన్యాసి అవతారం ధరించి, పర్ణశాలకు వచ్చి, సీతమ్మవారిని అపహరించాడట. ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాములవారిని ఆ జింక కావాలని కోరిందిట. శ్రీరాముడు బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుని సంహరించాడట. ప్రస్తుతం పర్ణశాల, ఈ విశేషాలు చూడటానికి వచ్చిన పర్యాటకులు, వారు చేసే వ్యాపారం మీదే ఆధారపడి ఉంది. ఆ ఊరి పంచాయతి వారు సమగ్రంగా ఈ ప్రత్యేకతను వాడుకుంటున్నారు. ఊరి మధ్యలోనే ప్రతి వాహనం పై పన్ను సేకరిస్తున్నారు. పర్ణశాల కుటీరం పక్కనే సీతారాముల వారి చిన్న గుడి కూడా ఉంది. పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు. ప్రభుత్వం పర్ణశాలను ప్రత్యేక కేంద్రంగా గుర్తించి బాపు గారిని ఆహ్వానించి రామాయణంలో ఇక్కడి ఘట్టాన్ని బొమ్మల రూపంలో రూపొందించమని కోరింది. ఈ బొమ్మలు బాపు శైలిలో ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ, మనవాళ్లు దేవుడికి, కలానికి మర్యాద ఇవ్వడం లేదు. ఈ బొమ్మలు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాయి. ఏది ఏమైనా, పర్ణశాల ఒక మంచి సందర్శనీయ స్థలం. ప్రభుత్వం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, గొప్ప కళాఖండాలు బతికి బయటపడతాయి. లేకపోతే అక్కడ దళారుల చేతిలో ఇదొక ఆటబొమ్మలా మిగిలిపోతుంది. - కె. జయదేవ్ (వ్యాస రచయిత జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్) -
వైభవంగా పర్ణశాల రామయ్య తెప్పోత్సవం
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి వైభవంగా గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించారు. భద్రాచలంలో వైకుంఠ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించే తరుణంలో పర్ణశాల లోనూ తెప్పోత్సవం నిర్వహించారు. సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాడు, బాణసంచా, భక్తుల సందడి మధ్య గ్రామ పురవీధుల మీదుగా గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. గోదావరి తీరంలో అప్పటికే సిద్ధంగా ఉన్న హంసవాహనంలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ముచ్చటగొలిపే హంస వాహనంపై గోదావరిలో స్వామి వారిని మూడుసార్లు తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన జయజయద్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. గోదావరిలో విహరించిన స్వామి వారిని 6.30 నిమిషాల సమయంలో హంస వాహనం నుంచి స్నానఘట్టాల వరకు పల్లకిలో తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు ఎన్‌బీవీఎల్‌ఎన్ ఆచార్యులు, శ్యాసం కిరణ్‌కుమారాచార్యులు, కె విష్ణువర్ధనాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, కృష్ణమాచార్యులు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సత్యనారాయణ సమక్షంలో స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఆశాలత, స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఈఓఆర్డీ అల్లాడి నాగేశ్వరరావు, కార్యదర్శి నారాయణ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, వీఆర్వోలు, వైద్య, సాక్షరభారత్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.