dummugudem
-
సాయం చేసి.. ప్రాణం పోసి
దుమ్ముగూడెం: నిత్యం దండకారణ్యంలో మావోయిస్టుల గాలింపు చర్యల్లో తలమునకలయ్యే భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో ఒక గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కిష్టారం పీఎస్ పరిధిలోని పొటుకపల్లి గ్రామానికి చెందిన వెట్టి మాయ అనే మహిళకు శనివారం తెల్లవారుజామున పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె భర్త, బంధువులు తక్షణమే వైద్య సేవలందించేలా చూడాలని బేస్‌క్యాంప్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. బేస్‌క్యాంపు కోబ్రా 208, కోబ్రా సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్, ఎస్టీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో 208 కోబ్రా వైద్యాధికారి రాజేష్ పుట్టా, డిప్యూటీ కమాండెంట్ రాజేంద్ర సింగ్, డిప్యూటీ కమాండెంట్‌తో కూడిన వైద్య బృందం పొటుకపల్లి గ్రామానికి వెళ్లి మాయకు వైద్య సహాయం అందించింది. ప్రసవం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారి రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కుంట డీఐజీ ఎస్కే రాయ్‌కు సమాచారం ఇవ్వడంతో.. ఆయన ఆదేశాల మేరకు గర్భిణిని మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వాహన సదుపాయం లేకపోవడంతో భద్రత బలగాలు జెట్టీ కట్టి ప్రధాన రహదారి వరకు మోసుకుంటూ వచ్చాయి. అక్కడి నుంచి మరో వాహనంలో వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆదివారం వెలుగులోకి రాగా, స్థానికులు భద్రత సిబ్బందిని అభినందించారు. -
బాణం లేని రాముడు.. రంగు లేని రావణుడు
సాక్షి, దుమ్ముగూడెం(ఖమ్మం): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామయ్య వనవాసం చేసిన సమయంలో కీలక ఘట్టాల ఇతివృత్తాన్ని తెలియచేసేలా పర్ణశాల ఆలయ ఆవరణలో విగ్రహాలు, కుటీరాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రానురాను అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇక్కడి విగ్రహాలు రంగు వెలిసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్ష్మణుడి విగ్రహం రెండు ముక్కలు కాగా అక్కడి నుంచి తొలగించారు. అలాగే, సీతమ్మ–రామయ్య కలిసి ఉన్న విగ్రహంలో రాముడి చేతిలో ఉన్న బాణం సగం విరిగిపోయింది. ఇక పది తలల రావణుడి విగ్రహం రంగు వెలిసిపోగా.. సీతమ్మ బొటన వేలు విరిగిపడిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచవటి కుటీరంలో బొటన వేలు విరిగిన సీతమ్మ విగ్రహం ఏటా రూ.కోటి ఆదాయం పర్ణశాల దేవాలయానికి వివిధ రకాల వేలం పాటల ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. పర్ణశాల గ్రామానికి చెందిన వ్యక్తిని భద్రాద్రి ఆలయ పాలక మండలిలోకి తీసుకుంటే తప్ప ఆలయ అభివృద్ధి సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అరకొర సిబ్బందే.. పర్ణశాల రామాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయంలో నలుగురు అర్చకులకు గాను ముగ్గురే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరిని భద్రాచలం నిత్యాన్నదాన సత్రానికి డిప్యుటేషన్‌పై పంపించారు. ఇక దేవాలయానికి సరిపడా స్థలం ఉన్నందున రాత్రివేళ భక్తులు బస చేసేలా కాటేజీలు నిర్మిస్తే అటు పర్యాటకులకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. దీనికి తోడు వ్యాపార వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. సమయపాలన పాటించడం లేదు ఆలయానికి వచ్చే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధానం కారణం. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తేనే సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావొచ్చు. – గోసంగి నరసింహారావు, గ్రామస్తుడు, పర్ణశాల కాటేజీలు నిర్మిస్తే బాగుండు పర్ణశాల ఆలయ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే సుదూర ప్రాంతా ల భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అవకా శం ఉంటుంది. కానీ ఇక్కడ కాటేజీలకు తోడు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వచ్చి వెంటనే వెళ్లిపోవాల్సి వస్తోంది. – శివ కోటేశ్వరి, భక్తురాలు, గుంటూరు జిల్లా చిల్డన్స్ పార్క్, గార్డెన్ ఏర్పాటు చేయాలి పర్ణశాల ఆలయ ప్రాంగణంలో భక్తులు, పిల్లలు సేద తీరేలా చిల్డ్రన్స్ పార్క్, గార్డెనింగ్ ఏర్పాటు చేయాలి. దర్శనం అనంతరం కొంచెంసేపు కాలక్షేపం చేద్దామంటే గోదావరి బోట్ షికార్ తప్ప మరేవి కనిపించడం లేదు. ఆలయ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. – శ్రీకాంత్, భక్తుడు, జమ్మికుంట -
సుపారీ ఇచ్చి చంపించారు
సాక్షి, చర్ల: దుమ్ముగూడెం మండలంలోని లచ్చిగూడెంలో ఈ నెల 10న అర్ధరాత్రి భూవివాదంలో ఓ వ్యక్తిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. శనివారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర వివరాలు వెల్లడించారు. లచ్చిగూడేనికి చెందిన తండ్రి కొడుకులు సోంది ముద్దరాజు, రవిబాబులతో అదే గ్రామానికి చెందిన హత్యకు గురైన కారం రామకృష్ణకు మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుంది. ఈ క్రమంలో తహసీల్దార్ ఆ భూ వ్యవహరంపై విచారణ నిర్వహించి, భూమి ముద్దరాజు కుటుంబీకులకే చెందుతుందని తెలియజేయడంతో ఆ నాటి నుంచి హత్యకు గురైన రామకృష్ణ కుటుంబం వివాదాస్పద భూమి నుంచి వైదొలిగింది. కాగా భూవివాదం కొనసాగుతున్న సందర్భంలో గ్రామంలో పంచాయితీ చేసిన పెద్దల్లో ఇద్దరు పెనుబల్లి భద్రయ్య, సోంది అర్జున్ అతడ్ని చంపితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంతో రామకృష్ణను చంపాలని ముద్దరాజు కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట సమీపంలో గల మైతా గ్రామానికి చెందిన పొడియం నగేష్, పొడియం లచ్చు, పొడియం భద్రయ్యలతో రూ.40వేలకు రామకృష్ణను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్యకు సంబంధించి సుపారీ తీసుకున్న వారు జాప్యం చేస్తుండడంతో ముద్దరాజుకు బంధువైన రాళ్లగూడేనికి చెందిన పాయం సతీష్ ఈ నెల 7న మైతాకు వెళ్లి వారితో మాట్లాడి రూ.2 వేలు చెల్లించి వచ్చాడు. 9న రాత్రి వచ్చిన మైతా గ్రామస్తులు రవిబాబుకు ఫోన్ చేయగా ముద్దరాజు, మడకం సతీష్ లతో కలిసి గుర్రాలబైలు సమీపంలో వారిని కలుసుకుని ఎలా హత్య చేయాలనే దానిపై చర్చించుకున్నారు. రాత్రి 12.30 గంటలకు రామకృష్ణ ఇంటికి చేరుకోగా, ముద్దరాజు, సతీష్, పొడియం భద్రయ్య ఇంటి సమీపంలో మాటు వేశారు. రవిబాబు, లచ్చు, నగేష్ ఇంటిలోకి ప్రవేశించి నిద్రలో ఉన్న రామకృష్ణను హతమార్చారు. రవిబాబు, నగేష్ కాళ్లు, చేతులు పటుకోగా, లచ్చు కత్తితో గొంతు కోశాడు. ఈ సందర్భంగా నిద్రలో నుంచి మేల్కొన్న మృతుడి భార్య తులసీ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా హతమార్చేందుకు నిందితులు యత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో తులసీని గొడ్డలితో కొట్టి, కత్తితో పొడిచేందుకు యత్నించారు. ఆమె చేయి అడ్డుపెట్టకోవడంతో చేతికి గాయమైంది. తులసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రితీష్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం గంగోలు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా రెండు బైకులపై వస్తున్న రవిబాబు, ముద్దరాజు, నగేష్, లచ్చు, భద్రయ్య, సతీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు గ్రామపెద్దలు అర్జున్, పెనుబల్లి భద్రయ్యలను కూడా అరెస్ట్ చేసి, విచారించడంతో నేరం అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిందరిపై హత్య కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. -
మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి విప్లవ సాహిత్యంతో పాటు పలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్చి 31న దుమ్ముగూడెం ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్, స్పెషల్ పార్టీ పోలీసులతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీనగరంలోని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా జొన్నగుడా గ్రామానికి చెందిన సవలం సోమా, మరొకరు సుకుమా జిల్లా పాలొడీ గ్రామానికి చెందిన మడివి ఉంగా అని గుర్తించినట్లు చెప్పారు. కాగా సోమా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొదటి బెటాలియన్ కమాండర్ ఇడుమా వద్ద హెడ్‌క్వార్టర్ ప్లాటూన్‌లో సెక్షన్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, ఇడుమాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ గన్‌మెన్‌గా, కొరియర్‌గా పనిచేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా మడివి ఉంగా మూడేళ్లుగా మా వోయిస్టు బెటాలియన్ కమాండర్ ఇడుమా పార్టీకి సానుభూతిపరుడిగా పనిచేస్తూ అవసరమైన సామాన్లు, మందుగుండు సామగ్రి, యూనిఫామ్, క్లాత్, చెప్పులు, బూట్లు సరఫరా చేస్తూ ఉండేవారని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో మూ డవ వ్యక్తి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం లో ని యాసిన్ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్ యజమాని ఎండీ. ఖాదర్ యాసిన్బేగ్గా చెప్పారు. యాసిన్‌బేగ్ మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులను భద్రాచలం, విజయవాడ వెళ్లి కొనుగోలు చేసి సోమా, ఉంగాల ద్వారా మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. సోమా, ఉంగాల నుంచి డబ్బులు తీసుకుని, వారు అడిగిన పేలుడు పదార్థాలు, మందుపాతరలు, గ్రనేడ్ లాంచర్లు ఇతర పరికరాలు, జనరేటర్, వెల్డింగ్ మిషన్, ఐరన్ రాడ్స్ తెప్పించేవా డని వివరించారు. ఆదివారం యాసిన్ తెప్పించిన సామగ్రిని తీసుకువెళ్లేందుకు సోమా, ఉంగా వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, క్లేమోర్ పైపులు, ఇతర పరికరాలతో పాటు భద్రాచలంలోని ప్రజా సంఘాల నాయకులకు అందజేసేందుకు తీసుకొచ్చిన విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్న సోమా సోమా ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలతో పాటు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ పోలీస్ సిబ్బందిపై దాడిచేసి హతమార్చిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరిం చారు. 2014లో సుకుమా జిల్లాలోని చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని కసళ్లపాడు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో దాడి చేయగా 14మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసినట్లు తెలిపారు. 2015లో సుకుమా జిల్లాలో పిడమేలు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా ఏడుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయారని, ఈ దాడిలో ఎస్టీఎఫ్ కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసిన ఘటనలో సోమా పాల్గొన్నాడు. 2017లో సుకుమా జిల్లా కొత్తచెరువు వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి, రోడ్డు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడి చేయగా 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, ఈ దాడిలోనూ ఆయుధాలను లూటీ చేయడం జరిగిందన్నారు. 2017లో సుకు మా జిల్లాలోని బుర్కాపాల్ వద్ద బెటాలియన్ కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్ చేసి రోడ్ తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ పార్టీలపై దాడిచేయగా 24 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందగా, 20 తుపాకులు, ఇతర ఆయుధాలను మావోయిస్టులు లూటీ చేసిన ఘటనలో సోమా పాలుపంచుకున్నారన్నారు. 2018 డిసెంబర్లో జారపల్లి వద్ద పామేడు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కూడా సోమా నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్ వివరించారు. అరెస్టు చేసిన సోమా, ఉంగా, యాసిన్‌లను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
పేలిన ప్రెషర్ బాంబు.. తెగిపడ్డ కాలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సరిహద్దులో మారాయగూడెం-గొల్లపల్లి రోడ్డులో ప్రెషర్ బాంబు పేలింది. ఈ ఘటనలో కూంబింగ్ నిర్వహిస్తున్న 217 బెటాలియన్‌కు చెందిన సీఆర్ఫీఎఫ్ జవాను ప్రభాకర్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుధాటికి అతని కాలు తెగిపడింది గాయపడిన జవాన్‌ను హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
దుమ్ముగూడెం ప్రాజెక్టుకు మంగళం!
హైడల్ ప్రాజెక్టు రద్దుకు నీటిపారుదల, విద్యుత్‌శాఖల సూత్రప్రాయ నిర్ణయం డ్యామ్‌కు అయ్యే ఖర్చు రూ.2 వేల కోట్లు భరించేందుకు వెనుకడుగు సాగుభూమిలేని ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయలేమన్న నీటిపారుదల శాఖ అంత వ్యయం భరించలేమని చేతులెత్తేసిన విద్యుత్ శాఖ హైదరాబాద్: దుమ్ముగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం స్వస్తి పలికింది! ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారం కానుండడం, దీనిని భరించేందుకు నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు చేతులెత్తేయడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి మంగళం పాడాలని నిర్ణయించింది. తెలంగాణలో గోదావరి నదిపై కంతనపల్లి, దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాలు నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా ఉంది. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం దుమ్ముగూడెం వద్ద జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణంపై బుధవారం రాష్ట్ర నీటిపారుదల, ఇంధన శాఖలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలతో పాటు ఇరు శాఖల కార్యదర్శులు ఎస్కే జోషీ, అరవింద కుమార్, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు పాల్గొని ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. దుమ్ముగూడెం జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ.2,458 కోట్లు వ్యయం అవుతుందని 2010-11లో జెన్కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. డ్యాంకు రూ.1,423 కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.720 కోట్లు, పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లకు రూ.315 కోట్లు వెచ్చించాలి ఉంటుందని పేర్కొంది. 2015-16 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఈ అంచనాలు రూ.3 వేల కోట్లు దాటుతుందని, అందులో డ్యామ్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.వెయ్యి కోట్ల ఖర్చు కానుందని జెన్కో ఈ సమావేశంలో నివేదించింది. చేతులెత్తేసిన రెండు శాఖలు దుమ్ముగూడెం, కంతనపల్లి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని నీటిపారుదల శాఖే భరించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, వ్యయం భరించేందుకు ఆ శాఖ విముఖత వ్యక్తం చేసింది. కనీసం డ్యాం నిర్మాణం వ్యయాన్ని భరించినా... విద్యుత్ కేంద్రాన్ని తామే నిర్మించుకుంటామని జెన్కో మరో ప్రతిపాదన చేసినా నీటిపారుదల శాఖ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ప్రతిపాదిత దుమ్ముగూడెం డ్యాం కింద ఎకరా ఆయకట్టు లేనందున ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టలేమని తేల్చి చెప్పింది. 320 (8ఁ40) మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లను వెచ్చించడం తమ వల్ల కాదని, ఒకవేళ నిర్మించినా విద్యుత్పత్తి వ్యయం తడిసి మోపెడవుతుందని జెన్కో అభిప్రాయపడింది. ఇంత వ్యయంతో విద్యుత్కేంద్రం నిర్మించేందుకు కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) సైతం అనుమతి ఇవ్వదని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెల్లడయ్యే అవకాశం ఉంది. -
'బాపు' గారి బొమ్మలు చూడలేమా ?
దుమ్ముగూడెం: కోట్లు వెచ్చించి ప్రతిష్టించిన చిత్రాలకు ఆదరణ లేకుండాపోయింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. 2003లో జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి కలెక్టర్, ప్రత్యేకాధికారి అరవింద్‌కుమార్ పర్ణశాలను మరింత అందంగా ముస్తాబు చేయడానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. రూ.1.40కోట్లు కేటాయించి.. రామాయణ దృశ్యాల చిత్రాలను ఏర్పాటు చేసే బాధ్యతను సినీ దర్శకుడు, సీనియర్ చిత్రకారుడు బాపుకు అప్పగించారు. ఆయన పర్ణశాలను సందర్శించి.. చిత్రాలను ప్రతిష్టించే ప్రాంతాలపై అధ్యయనం చేశారు. సీతా కుటీరంను బాంబోలతో నిర్మించడంతో పాటు చుట్టూ రామాయణ దృశ్యాల ప్రతిమలను ప్రతిష్టించారు. అయితే శిథిలమైన ఆ బొమ్మలు భక్తులకు కనిపించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వాటిని చూసే భాగ్యం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మావోయిస్టుల భారీ సభ
దండకారణ్యంలో మూడు రోజుల పాటు సభలు క్రీడా సామగ్రి పంపిణీ.. పోటీల నిర్వహణ దుమ్ముగూడెం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ జిల్లా సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగులంక అటవీ ప్రాంతంలో శుక్రవారం ఆదివాసీలతో మావోయిస్టుల అగ్ర నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా బహిరంగ సభలు నిర్వహించిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని బూగురులంక సంతలో మావోయిస్టు అగ్రనేత సావిత్రి (రామన్న భార్య)సహా 200 మంది మావోయిస్టులు తుపాకులతో హల్చల్ చేసినట్లు తెలిసింది. ఈ బహిరంగ సభలను మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న నేతృత్వంలో సంతోష్, సావిత్రి, లచ్చన్న, ఉదమ్‌సింగ్, భగ త్, నగేష్, సోనిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల ఆదివాసీలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు బుధవారం నుంచి బూరుగులంక అటవీప్రాంతంలో ఈ బహిరంగ సభలను నిర్వహించినట్లు తెలుస్తోంది. సభలకు దండకారణ్యానికి చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరైనట్లు తెలుస్తోంది. సభల్లో మావోయిస్టు నేతలు మాట్లాడుతూ పోలీసులు దండకారణ్యంలో నిర్మించతలపెట్టిన బేస్‌క్యాంపు నిర్మాణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న తమ గ్రామాలను నాశనం చేయవద్దని.. బేస్ క్యాంపు నిర్మాణానికి వచ్చిన పోలీసులను అడ్డుకోవాలని ఆదివాసీలకు సూచించినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో అదేవిధంగా నిర్మాణాలు చేపడితే ఎదురుతిరిగి అడ్డుకోవాలని ఆదివాసీలకు ధైర్యం నూరిపోసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. క్రీడా సామగ్రి పంపిణీ.. మావోయిస్టులు సరిహద్దు ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ యువకులకు క్రీడా కిట్లు పంపిణీ చేయడంతో పాటు.. క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులనూ పంపిణీ చేసినట్లు సమాచారం. -
దుమ్ముగూడెం కాంట్రాక్టులన్నీ రద్దు
హైదరాబాద్: రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసుకున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోని 10 ప్యాకేజీలలో పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు టెర్మినేట్ ఉత్తర్వులు పంపింది. తద్వారా ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థలతో నలుగుతున్న వివాదానికి రాష్ట్ర నీటిపారుదలశాఖ స్వస్తి పలికింది. అయితే కాంట్రాక్టు సంస్థలకు పంపిన ఉత్తర్వుల్లో ‘ప్రాజెక్టును ఇకపై చేపట్టరాదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మీరు ఊహించుకుంటున్నారు. మీ ఊహలకు ఎలాంటి అర్థం లేదు’ అని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై పలు కాంట్రాక్టు సంస్థలు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి
రాయలసీమ మహాసభ తీర్మానం కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాసభ కేంద్ర కమిటీ అధ్యక్షుడు శాంతి నారాయణ ప్రతిపాదించిన పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. దుమ్ముగూడెం వల్ల 160 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం నుంచి సీమ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవచ్చన్నారు. -
'దుమ్ముగూడెం'... ఏదో ఒకటి చేద్దాం!
హైదరాబాద్: రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తూ రద్దు చేసుకున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థతో నలుగుతున్న వివాదానికి స్వస్తి పలికే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ ఒప్పందాల రద్దును సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్ చేసిన పనులు, కోరుతున్న పరిహారం తదితరాలపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని నియమించి ఈ వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించి ఆయన సూచన మేరకు ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. గోదావరి జలాలను వినియోగించి తెలంగాణ రైతులకు సాగునీరివ్వడానికి ఉద్దేశించిన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టును టీఆర్ఎస్ తొలినుంచీ వ్యతిరేకిస్తోంది. రూ.19వేల కోట్ల అత్యంత భారీ వ్యయంతో పాటు, 1,800ల మెగావాట్ల భారీ విద్యుత్ అవసరం ఉన్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేదని చెబుతోంది. అదీగాక గోదావరి వరద నుంచి 160 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకలు సైతం బేసిన్ నీటిలో వాటా కోరే అవకాశాలుండటం, బేసిన్ దిగువకు వెళ్లే ఈ నీటిని వాడుకునే అవకాశం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఉండదు కాబట్టి, వారు ఎగువ నుంచి వచ్చే కృష్ణా నీటిలోనే వాటా తీసుకునేందుకు ప్రయత్నిస్తారని, అదే జరిగితే కృష్ణా జలాల్లో తెలంగాణకు కోత పడుతుందనే భావనతో ప్రాజెక్టును నిలిపివేయాలని వాదించింది. కమిటీతో చక్కదిద్దేందుకు: ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒప్పందాల రద్దు పూర్తిగా కాంట్రాక్టర్‌తో ముడిపడి ఉంది. మొత్తంగా రూ.17201 కోట్లతో ఒప్పందాలు జరగ్గా ఏడాదిన్నర కిందటి వరకు రూ.730కోట్ల మేర పనులు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం రూ.280కోట్ల మేర చెల్లించింది. ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెడుతున్న దృష్ట్యా కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతోంది. అది ఎంతన్నది మాత్రం వెల్లడికాలేదు. సంస్థ కోరుతున్న పరిహారం వందల కోట్ల మేర ఉండటంతో ప్రభుత్వం దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనే సందిగ్ధంలో పడింది. ఆరు నెలలుగా ఎటూ తేలకుండా ఉన్న ఈ వ్యవహారాన్ని చక్కపెట్టాలని, ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో కమిటీని వేసి వివాదాన్ని పరిష్కారించాలనే నిర్ణయానికి వచ్చింది. -
సరిహద్దులో మావోయిస్టులు
దుమ్ముగూడెం : మండల సరిహద్దులోకి మావోయిస్టులు చేరుకున్నట్టు తెలిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గౌరారం-పైడిగూడెం గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు పోలీసుల పహరా నడుమ నెల రోజుల నుంచి శరవేగంగా సాగుతున్నారుు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో వెంకటాపురం, శబరి ఏరియా కమిటీలతోపాటు మావోయిస్టు మిలీషియా ప్లాటూన్ కమాండర్ సుఖదేవ్ ఆధ్వర్యంలో మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ బలగాలు బుధవారం అర్ధరాత్రి దుమ్ముగూడెం మండల సరిహద్దులోకి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రాచలం ఏఎస్పీ ఆదేశాలతో రోడ్డు నిర్మాణ ప్రదేశం నుంచి పోలీసు బలగాలు రాత్రికి రాత్రే వెనుదిరిగారుు. నిర్మాణ పనులకు సంబంధించిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
‘దుమ్ముగూడెం’ను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి
ప్రధాని మోడీకి వై.ఎస్.జగన్ లేఖ * గోదావరి వరద నీటిని సాగర్ టెయిల్ పాండ్‌కు మళ్లించేందుకే ఈ ప్రాజెక్టు * దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల రైతులకూ ప్రయోజనం * ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. నిర్మాణ పనులు పునరుద్ధరించాలి * ప్రధానమంత్రికి రాసిన లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనకారి అయిన ‘జ్యోతీరావ్ ఫూలే దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్ పాండ్’ సాగునీటి పారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి సత్వరం నిర్మాణ పనులు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రధానికి లేఖ రాశారు. లేఖలోని అంశాలిలా ఉన్నాయి... మాన్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు, వారి సంక్షేమానికి కట్టుబడిన, వారి ప్రయోజనాల పట్ల శ్రద్ధాసక్తులు కలిగిన వ్యక్తిగా దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ సాగునీటి పారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలోని వరద నీటిని నాగార్జునసాగర్‌కు తరలించడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మా పార్టీ ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం ఇక్కడ చెప్పడం సందర్భోచితమని భావిస్తున్నాను. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలే కాక ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. గోదావరి నదిలో పుష్కలంగా వచ్చే వరద నీటిని కృష్ణానదిపై ఉన్న నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లోకి మళ్లించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని మనవి చేస్తున్నాను. ప్రాజెక్టు నేపథ్యం... గోదావరి, కృష్ణా నదులు రెండూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఎగువ భాగంలో ఎక్కువ వరద నీరు రాక పోయినా దిగువ భాగంలో 2,000 టీఎంసీల నీరు ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వృథాగా వెళుతూ ఉంటుంది. కృష్ణా నది రాష్ట్రం గుండా ప్రవహించే రెండో పెద్ద నది. ఈ నదిపై ఎగువ రాష్ట్రాలు ఎక్కువగా ప్రాజెక్టులు నిర్మించినందు వల్ల రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రాను రాను నీరు లభించే పరిస్థితి లేకుండా పోతున్నది. భద్రాచలం పట్టణానికి ఎగువన 45 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన జ్యోతీరావ్ ఫూలే దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా.. గోదావరిలో వరదలు వచ్చిన సీజన్లో 165 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలన్నది ప్రధాన ఉద్దేశం. గోదావరిలో ఏడాదిలో 80 రోజుల పాటు వరద నీరు ఉంటుంది. ఈ నీటిలో 41.5 టీఎంసీల నీరు ఖమ్మం జిల్లాకు, మిగతా నీటిని నల్లగొండ జిల్లాలోని హాలియా నది ద్వారా నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌కు తరలించాలని ప్రతిపాదించారు. గోదావరి నీటిని ఈ విధంగా మళ్లించడం వల్ల ఉభయ రాష్ట్రాల్లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ), కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు స్థితిగతుల గురించి సవివరంగా మీకు విన్నవించాను. దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి సత్వరమే నిర్మించడానికి వీలుగా జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కృతజ్ఞతలతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి’’ -
సై అంటే సై
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : మావోయిస్టులు కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు దళాలను అప్రమత్తం చేసి దాడులు ముమ్మరం చేయడానికి అగ్రనేతలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుసుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని దండకారణ్యంలోకి చేరుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల పోలీసులు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం, మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, దీనికి తోడు భద్రాచలం డివిజన్లోని కొరియర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం తదితర వరుస పరిణామాలు చోటుచేసుకోవడాన్ని అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు లు, ఇన్ఫార్మర్లను టార్గెట్ చేసుకుని యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశాయి. సవాల్.. ప్రతిసవాల్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగే వారపు సంతలకు చర్ల, దుమ్ముగూడెం మండలాల నుంచి వ్యాపారులు అధికంగా వెళ్తుంటారు. రాత్రి, పగలు అంటే తేడా లేకుండా ఏసమయంలోనైనా దండకారణ్యంలోకి వెళ్లినప్పుడు మావోయిస్టుల నుంచి వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురైన దాఖలాలు లేవు. మావోయిస్టులకు యధావిధిగా నిత్యావసర వస్తువులతో పాటు కావాల్సిన సరకులు ఎప్పటికప్పుడు సమకూరేవి. అయితే.. రెండేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు అధికం కావడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి భద్రాచలం డివవిజన్లోని వందలాది మంది మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. సంత వ్యాపారులను సైతం కట్టుదిట్టం చేసి మావోయిస్టులకు ఎలాంటి సరకులు అందకుండా చర్యలు చేపట్టారు. దీనికి తోడు ప్రతి ఆదివారం స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టించమనడంతో పాటు దండకారణ్య సమాచారాన్ని కూపీలాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మావోయిస్టుల అడ్డాకు మార్గమైన దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి-పైడిగూడెం రోడ్డును పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇది జీర్ణించుకోలేని మావోయిస్టులు దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్ బలగాలు అధికంగా ఉండడంతో విరమించుకున్నట్లు తెలిసింది. అయితే... మండల పరిధిలోని పెదార్లగూడెం ఎయిర్టెల్ సెల్ టవర్‌ను దహనం చేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో గత నెల 26న దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న ఎడ్లపాడు గ్రామంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందుకున్న పోలీసులు ఏకంగా అక్కడ ఉన్న 10 మందిని మట్టుబెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు ఒక ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్లడంతో కొద్ది క్షణాల్లోనే మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దాడిలో తమ దళం అంతరించుకుపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన మావోయిస్టులు మరోసారి వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. పోలీసులు దండకారణ్యంలోకి అడుగు పెట్టకుండా చర్యలు తీసుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. -
దండకారణ్యంలో బలగాల మోహరింపు
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : ఆంధ్రకు సరిహద్దున ఉన్న చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని కిష్టారం-గొల్లపల్లి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. సుమారు 300 మంది జవాన్లు రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గొల్లపల్లి- కిష్టారం పోలీస్స్టేషన్ల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు మిలీషియా సభ్యులపై పోలీసు బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మిలీషియా సభ్యులు తప్పించుకోగా, వారికి సంబంధించిన చెక్క తుపాకీ దొరికినట్లు సమాచారం. కాగా, దండకారణ్యంలోని సాకిలేరు, యాంపురం అటవీ ప్రాంతాలలో మూడు రోజుల క్రితం మావోయిస్టులు సమావేశం నిర్వహించారని, త్వరలో జరగనున్న పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై చర్చించారని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది పసిగట్టిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని మారాయిగూడెం మీదుగా సీఆర్పీఎఫ్ బలగాలను దండకారణ్యంలోకి తరలించారు. వారు రెండు రోజులుగా కూంబింగ్ చేస్తూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే పోలీసులు దండకారణ్యంలోకి వెళ్లడంతో కొందరు మావోయిస్టులు సరిహద్దున ఉన్న దుమ్ముగూడెం మండలం జిన్నెలగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం సంచరించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది. -
పాస్టర్లూ.. మీ గ్రామాలకు వెళ్లండి
దుమ్ముగూడెం: గిరిజన గ్రామాల్లో చర్చి పాస్టర్లుగా పని చేస్తున్న వారు ఆయా గ్రామాలను వదిలి స్వగ్రామాలకు వెళ్లి ప్రశాంతంగా జీవించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ పేరుతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలో శుక్రవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. గ్రామాల్లో పాస్టర్లను పోలీసులే ఏర్పాటు చేసి ఇన్ఫార్మర్లుగా వినియోగించుకుంటున్నారని, ఈ పద్ధతి తక్షణమే మార్చుకోవాలని పోస్టర్లలో హెచ్చరించారు. గిరిజనులు క్రిస్టియన్ మతం స్వీకరించవద్దని సూచించారు. అలాగే రోడ్ల నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీ గ్రామాల్లో మోహరిస్తున్న పోలీసు బలగాలను వెనక్కు తీసుకోవాలని, బైండోవర్ సంతకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణం అభివృద్ధి కాదని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. మండలంలోని కాటాయిగూడెం, అంజిపాక, బట్టిగూడెం క్రాస్‌రోడ్డు, వీరభద్రారం గ్రామాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. పంచాయతీ కార్యాలయాలతో సహా ఆయా గ్రామాల్లో కల్వర్టులు, రోడ్ల వెంట భారీగా వదిలి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. -
డెంగీ లక్షణాలతో గిరిజనుడి మృతి
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : డెంగీ లక్షణాలతో మండలంలోని బట్టిగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గిరిజనుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బట్టిగూడేనికి చెందిన మడకం శంకర్(30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతనిని డెంగీ జ్వరం రావడంతో చికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి యధావిథిగా పొలం పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్తున్నాడు. పది రోజుల క్రితం తిరిగి జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. కానీ రోజురోజుకు జ్వరం పెరుగుతూ నీరసిస్తుండడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు లక్ష్మీనగరం తరలించి వైద్యం చేయిస్తుండగా పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతనిని భద్రాచలం తరలించగా అక్కడ మృతి చెందాడు. శంకర్‌కు భార్య సమ్మక్కతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సమ్మక్క ఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ బాబాయికీ బ్రెయిన్ మలేరియా.. డెంగీ లక్షణాలతో మృతి చెందిన శంకర్ బాబాయి పూ నెం కృష్ణకు బ్రెయిన్ మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులలుగా జ్వరం వస్తుండడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. అదే గ్రామంలో జలకం భద్రయ్య అనే గిరిజనుడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.