దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : మావోయిస్టులు కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు దళాలను అప్రమత్తం చేసి దాడులు ముమ్మరం చేయడానికి అగ్రనేతలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుసుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని దండకారణ్యంలోకి చేరుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల పోలీసులు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం, మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, దీనికి తోడు భద్రాచలం డివిజన్‌లోని కొరియర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం తదితర వరుస పరిణామాలు చోటుచేసుకోవడాన్ని అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు లు, ఇన్‌ఫార్మర్లను టార్గెట్ చేసుకుని యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశాయి.
సవాల్.. ప్రతిసవాల్
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగే వారపు సంతలకు చర్ల, దుమ్ముగూడెం మండలాల నుంచి వ్యాపారులు అధికంగా వెళ్తుంటారు. రాత్రి, పగలు అంటే తేడా లేకుండా ఏసమయంలోనైనా దండకారణ్యంలోకి వెళ్లినప్పుడు మావోయిస్టుల నుంచి వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురైన దాఖలాలు లేవు. మావోయిస్టులకు యధావిధిగా నిత్యావసర వస్తువులతో పాటు కావాల్సిన సరకులు ఎప్పటికప్పుడు సమకూరేవి. అయితే.. రెండేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు అధికం కావడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చారు.
అప్పటి నుంచి భద్రాచలం డివవిజన్‌లోని వందలాది మంది మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. సంత వ్యాపారులను సైతం కట్టుదిట్టం చేసి మావోయిస్టులకు ఎలాంటి సరకులు అందకుండా చర్యలు చేపట్టారు. దీనికి తోడు ప్రతి ఆదివారం స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టించమనడంతో పాటు దండకారణ్య సమాచారాన్ని కూపీలాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మావోయిస్టుల అడ్డాకు మార్గమైన దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి-పైడిగూడెం రోడ్డును పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇది జీర్ణించుకోలేని మావోయిస్టులు దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్ బలగాలు అధికంగా ఉండడంతో విరమించుకున్నట్లు తెలిసింది.
అయితే... మండల పరిధిలోని పెదార్లగూడెం ఎయిర్‌టెల్ సెల్ టవర్‌ను దహనం చేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో గత నెల 26న దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న ఎడ్లపాడు గ్రామంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందుకున్న పోలీసులు ఏకంగా అక్కడ ఉన్న 10 మందిని మట్టుబెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు ఒక ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్లడంతో కొద్ది క్షణాల్లోనే మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దాడిలో తమ దళం అంతరించుకుపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన మావోయిస్టులు మరోసారి వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. పోలీసులు దండకారణ్యంలోకి అడుగు పెట్టకుండా చర్యలు తీసుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
సై అంటే సై
Published Fri, May 23 2014 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement