మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌ | Three Maoists Arrested In Dummugudem | Sakshi
Sakshi News home page

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌

Published Tue, Apr 2 2019 3:45 PM | Last Updated on Tue, Apr 2 2019 3:49 PM

Three Maoists Arrested In Dummugudem - Sakshi

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సునీల్‌దత్

సాక్షి, కొత్తగూడెం: ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి విప్లవ సాహిత్యంతో పాటు పలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్చి 31న దుమ్ముగూడెం ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది, 141 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్, స్పెషల్‌ పార్టీ పోలీసులతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీనగరంలోని యాసిన్‌ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్‌ దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా జొన్నగుడా గ్రామానికి చెందిన సవలం సోమా, మరొకరు సుకుమా జిల్లా పాలొడీ గ్రామానికి చెందిన మడివి ఉంగా అని గుర్తించినట్లు  చెప్పారు.

కాగా సోమా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొదటి బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమా వద్ద హెడ్‌క్వార్టర్‌ ప్లాటూన్‌లో సెక్షన్‌ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, ఇడుమాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ గన్‌మెన్‌గా, కొరియర్‌గా  పనిచేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా మడివి ఉంగా మూడేళ్లుగా మా వోయిస్టు బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమా పార్టీకి  సానుభూతిపరుడిగా పనిచేస్తూ అవసరమైన సామాన్లు, మందుగుండు సామగ్రి, యూనిఫామ్, క్లాత్, చెప్పులు, బూట్లు  సరఫరా చేస్తూ ఉండేవారని తెలిపారు. అరెస్టుచేసిన వారిలో మూ డవ వ్యక్తి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం లో ని యాసిన్‌ ఫుట్‌వేర్, హార్డ్‌వేర్‌ యజమాని ఎండీ. ఖాదర్‌ యాసిన్‌బేగ్‌గా చెప్పారు.

యాసిన్‌బేగ్‌ మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులను  భద్రాచలం, విజయవాడ వెళ్లి కొనుగోలు చేసి సోమా, ఉంగాల ద్వారా మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. సోమా, ఉంగాల నుంచి డబ్బులు తీసుకుని, వారు అడిగిన పేలుడు పదార్థాలు, మందుపాతరలు, గ్రనేడ్‌ లాంచర్లు ఇతర పరికరాలు, జనరేటర్, వెల్డింగ్‌ మిషన్, ఐరన్‌ రాడ్స్‌ తెప్పించేవా డని వివరించారు. ఆదివారం యాసిన్‌ తెప్పించిన సామగ్రిని తీసుకువెళ్లేందుకు సోమా, ఉంగా వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, క్లేమోర్‌ పైపులు, ఇతర పరికరాలతో పాటు భద్రాచలంలోని ప్రజా సంఘాల నాయకులకు అందజేసేందుకు తీసుకొచ్చిన విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 


పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్న సోమా  
సోమా ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలతో పాటు సీఆర్‌పీఎఫ్, ఎస్‌టీఎఫ్‌ పోలీస్‌ సిబ్బందిపై దాడిచేసి హతమార్చిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరిం చారు. 2014లో సుకుమా జిల్లాలోని చింతగుప్ప పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కసళ్లపాడు వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ పార్టీలపై బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమా ఆధ్వర్యంలో దాడి చేయగా 14మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మరణించారని, ఈ ఘటనలో సీఆర్‌పీఎఫ్‌కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసినట్లు తెలిపారు. 2015లో సుకుమా జిల్లాలో పిడమేలు వద్ద బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్‌ చేసి కూంబింగ్‌ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ పార్టీలపై దాడిచేయగా ఏడుగురు ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది చనిపోయారని, ఈ దాడిలో ఎస్‌టీఎఫ్‌ కు సంబంధించిన పలు ఆయుధాలను లూటీ చేసిన ఘటనలో సోమా పాల్గొన్నాడు. 


2017లో సుకుమా జిల్లా కొత్తచెరువు వద్ద బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్‌ చేసి, రోడ్డు తనిఖీ చేస్తున్న సీఆర్‌పీఎఫ్‌ పార్టీలపై దాడి చేయగా 22 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మరణించారని, ఈ దాడిలోనూ ఆయుధాలను లూటీ చేయడం జరిగిందన్నారు. 2017లో సుకు మా జిల్లాలోని బుర్కాపాల్‌ వద్ద బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమా ఆధ్వర్యంలో అంబుష్‌ చేసి రోడ్‌ తనిఖీ చేస్తున్న సీఆర్‌పీఎఫ్‌ పార్టీలపై దాడిచేయగా 24 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మృతి చెందగా, 20 తుపాకులు, ఇతర ఆయుధాలను మావోయిస్టులు లూటీ చేసిన ఘటనలో సోమా పాలుపంచుకున్నారన్నారు. 2018 డిసెంబర్‌లో జారపల్లి వద్ద పామేడు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కూడా సోమా నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ సునీల్‌దత్‌ వివరించారు. అరెస్టు చేసిన సోమా, ఉంగా, యాసిన్‌లను రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు  తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement