హైదరాబాద్: రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తూ రద్దు చేసుకున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థతో నలుగుతున్న వివాదానికి స్వస్తి పలికే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ ఒప్పందాల రద్దును సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్ చేసిన పనులు, కోరుతున్న పరిహారం తదితరాలపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని నియమించి ఈ వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించి ఆయన సూచన మేరకు ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
గోదావరి జలాలను వినియోగించి తెలంగాణ రైతులకు సాగునీరివ్వడానికి ఉద్దేశించిన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టును టీఆర్‌ఎస్ తొలినుంచీ వ్యతిరేకిస్తోంది. రూ.19వేల కోట్ల అత్యంత భారీ వ్యయంతో పాటు, 1,800ల మెగావాట్ల భారీ విద్యుత్ అవసరం ఉన్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం లేదని చెబుతోంది. అదీగాక గోదావరి వరద నుంచి 160 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకలు సైతం బేసిన్ నీటిలో వాటా కోరే అవకాశాలుండటం, బేసిన్ దిగువకు వెళ్లే ఈ నీటిని వాడుకునే అవకాశం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఉండదు కాబట్టి, వారు ఎగువ నుంచి వచ్చే కృష్ణా నీటిలోనే వాటా తీసుకునేందుకు ప్రయత్నిస్తారని, అదే జరిగితే కృష్ణా జలాల్లో తెలంగాణకు కోత పడుతుందనే భావనతో ప్రాజెక్టును నిలిపివేయాలని వాదించింది.
కమిటీతో చక్కదిద్దేందుకు: ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒప్పందాల రద్దు పూర్తిగా కాంట్రాక్టర్‌తో ముడిపడి ఉంది. మొత్తంగా రూ.17201 కోట్లతో ఒప్పందాలు జరగ్గా ఏడాదిన్నర కిందటి వరకు రూ.730కోట్ల మేర పనులు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం రూ.280కోట్ల మేర చెల్లించింది. ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెడుతున్న దృష్ట్యా కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతోంది. అది ఎంతన్నది మాత్రం వెల్లడికాలేదు. సంస్థ కోరుతున్న పరిహారం వందల కోట్ల మేర ఉండటంతో ప్రభుత్వం దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనే సందిగ్ధంలో పడింది. ఆరు నెలలుగా ఎటూ తేలకుండా ఉన్న ఈ వ్యవహారాన్ని చక్కపెట్టాలని, ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో కమిటీని వేసి వివాదాన్ని పరిష్కారించాలనే నిర్ణయానికి వచ్చింది.
'దుమ్ముగూడెం'... ఏదో ఒకటి చేద్దాం!
Published Sun, Mar 8 2015 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement