జెట్టీ కట్టి గర్భిణిని మోసుకొస్తున్న భద్రత బలగాలు
దుమ్ముగూడెం: నిత్యం దండకారణ్యంలో మావోయిస్టుల గాలింపు చర్యల్లో తలమునకలయ్యే భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో ఒక గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కిష్టారం పీఎస్ పరిధిలోని పొటుకపల్లి గ్రామానికి చెందిన వెట్టి మాయ అనే మహిళకు శనివారం తెల్లవారుజామున పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
దీంతో ఆమె భర్త, బంధువులు తక్షణమే వైద్య సేవలందించేలా చూడాలని బేస్‌క్యాంప్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. బేస్‌క్యాంపు కోబ్రా 208, కోబ్రా సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్, ఎస్టీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో 208 కోబ్రా వైద్యాధికారి రాజేష్ పుట్టా, డిప్యూటీ కమాండెంట్ రాజేంద్ర సింగ్, డిప్యూటీ కమాండెంట్‌తో కూడిన వైద్య బృందం పొటుకపల్లి గ్రామానికి వెళ్లి మాయకు వైద్య సహాయం అందించింది.
ప్రసవం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారి రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కుంట డీఐజీ ఎస్‌కే రాయ్‌కు సమాచారం ఇవ్వడంతో.. ఆయన ఆదేశాల మేరకు గర్భిణిని మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వాహన సదుపాయం లేకపోవడంతో భద్రత బలగాలు జెట్టీ కట్టి ప్రధాన రహదారి వరకు మోసుకుంటూ వచ్చాయి. అక్కడి నుంచి మరో వాహనంలో వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆదివారం వెలుగులోకి రాగా, స్థానికులు భద్రత సిబ్బందిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment