‘దుమ్ముగూడెం’ను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి
ప్రధాని మోడీకి వై.ఎస్.జగన్ లేఖ
* గోదావరి వరద నీటిని సాగర్ టెయిల్ పాండ్‌కు మళ్లించేందుకే ఈ ప్రాజెక్టు
* దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల రైతులకూ ప్రయోజనం
* ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. నిర్మాణ పనులు పునరుద్ధరించాలి
* ప్రధానమంత్రికి రాసిన లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనకారి అయిన ‘జ్యోతీరావ్ ఫూలే దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్ పాండ్’ సాగునీటి పారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి సత్వరం నిర్మాణ పనులు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రధానికి లేఖ రాశారు. లేఖలోని అంశాలిలా ఉన్నాయి...
మాన్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు, వారి సంక్షేమానికి కట్టుబడిన, వారి ప్రయోజనాల పట్ల శ్రద్ధాసక్తులు కలిగిన వ్యక్తిగా దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ సాగునీటి పారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలోని వరద నీటిని నాగార్జునసాగర్‌కు తరలించడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చవచ్చు.
ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి మా పార్టీ ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం ఇక్కడ చెప్పడం సందర్భోచితమని భావిస్తున్నాను. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలే కాక ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. గోదావరి నదిలో పుష్కలంగా వచ్చే వరద నీటిని కృష్ణానదిపై ఉన్న నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లోకి మళ్లించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని మనవి చేస్తున్నాను.
ప్రాజెక్టు నేపథ్యం...
గోదావరి, కృష్ణా నదులు రెండూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఎగువ భాగంలో ఎక్కువ వరద నీరు రాక పోయినా దిగువ భాగంలో 2,000 టీఎంసీల నీరు ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వృథాగా వెళుతూ ఉంటుంది. కృష్ణా నది రాష్ట్రం గుండా ప్రవహించే రెండో పెద్ద నది. ఈ నదిపై ఎగువ రాష్ట్రాలు ఎక్కువగా ప్రాజెక్టులు నిర్మించినందు వల్ల రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రాను రాను నీరు లభించే పరిస్థితి లేకుండా పోతున్నది. భద్రాచలం పట్టణానికి ఎగువన 45 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన జ్యోతీరావ్ ఫూలే దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా.. గోదావరిలో వరదలు వచ్చిన సీజన్‌లో 165 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలన్నది ప్రధాన ఉద్దేశం.
గోదావరిలో ఏడాదిలో 80 రోజుల పాటు వరద నీరు ఉంటుంది. ఈ నీటిలో 41.5 టీఎంసీల నీరు ఖమ్మం జిల్లాకు, మిగతా నీటిని నల్లగొండ జిల్లాలోని హాలియా నది ద్వారా నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌కు తరలించాలని ప్రతిపాదించారు. గోదావరి నీటిని ఈ విధంగా మళ్లించడం వల్ల ఉభయ రాష్ట్రాల్లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ), కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ - నీవా, గాలేరు - నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు స్థితిగతుల గురించి సవివరంగా మీకు విన్నవించాను. దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి సత్వరమే నిర్మించడానికి వీలుగా జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
కృతజ్ఞతలతో
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి’’