మావోయిస్టులు వదిలి వెళ్లిన పోస్టర్లు
దుమ్ముగూడెం: గిరిజన గ్రామాల్లో చర్చి పాస్టర్లుగా పని చేస్తున్న వారు ఆయా గ్రామాలను వదిలి స్వగ్రామాలకు వెళ్లి ప్రశాంతంగా జీవించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ పేరుతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలో శుక్రవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి.
గ్రామాల్లో పాస్టర్లను పోలీసులే ఏర్పాటు చేసి ఇన్‌ఫార్మర్లుగా వినియోగించుకుంటున్నారని, ఈ పద్ధతి తక్షణమే మార్చుకోవాలని పోస్టర్లలో హెచ్చరించారు. గిరిజనులు క్రిస్టియన్ మతం స్వీకరించవద్దని సూచించారు. అలాగే రోడ్ల నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీ గ్రామాల్లో మోహరిస్తున్న పోలీసు బలగాలను వెనక్కు తీసుకోవాలని, బైండోవర్ సంతకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణం అభివృద్ధి కాదని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. మండలంలోని కాటాయిగూడెం, అంజిపాక, బట్టిగూడెం క్రాస్‌రోడ్డు, వీరభద్రారం గ్రామాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. పంచాయతీ కార్యాలయాలతో సహా ఆయా గ్రామాల్లో కల్వర్టులు, రోడ్ల వెంట భారీగా వదిలి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.