మావోయిస్టుల కదలికలపై కన్ను
నరసాపురం(రాయపేట): రాష్ట్ర విభజన నేపథ్యం లో ఖమ్మం జిల్లా నుంచి రెండు మండలాలు, మరో మండలంలోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన దృష్ట్యా జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉండే అవకాశం లేకపోలేదని జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ ప్రాంత మావోయిస్టులు రాజమండ్రిని షెల్టర్ జోన్‌గా చేసుకుని కార్యకలాపాలు సాగించినట్టు తెలిసిందని, ఇప్పుడు ఏలూరును షెల్టర్ జోన్‌గా ఎంచుకున్నట్టుగా వారి కదలికలు కనబడుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకోసం ప్రత్యేక బలగాలను నియమించామని తెలిపారు.
జిల్లాలో ‘నో యవర్స్ క్రిమినల్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఎక్కడికక్కడ పోలీస్ సర్కిల్ పరిధిలో నేరస్తులు, రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీ సులు ప్రజలకు రక్షణగా నిలవాలని సూచించారు. మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకన్నా మహిళా సిబ్బంది లోటును భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు.
గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు సిబ్బంది అవసరాలపై రెవెన్యూ అధికారులతో చర్చించి పెద్దసంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. యాత్రికుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడతామని వివరించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే నరసాపురం డివిజన్‌లోని పలు పోలీస్‌స్టేషన్లను పరిశీలించేందుకు ఆయన రావడంతో పోలీసులు కలవరపడ్డారు. సీఐ, ఎస్సైలతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. ఎస్పీ వెంట డీఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి ఉన్నారు.