దుమ్ముగూడెం ప్రాజెక్టుకు మంగళం!
హైడల్ ప్రాజెక్టు రద్దుకు నీటిపారుదల, విద్యుత్‌శాఖల సూత్రప్రాయ నిర్ణయం
డ్యామ్‌కు అయ్యే ఖర్చు రూ.2 వేల కోట్లు భరించేందుకు వెనుకడుగు
సాగుభూమిలేని ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయలేమన్న నీటిపారుదల శాఖ
అంత వ్యయం భరించలేమని చేతులెత్తేసిన విద్యుత్ శాఖ
హైదరాబాద్: దుమ్ముగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం స్వస్తి పలికింది! ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారం కానుండడం, దీనిని భరించేందుకు నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు చేతులెత్తేయడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి మంగళం పాడాలని నిర్ణయించింది. తెలంగాణలో గోదావరి నదిపై కంతనపల్లి, దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాలు నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా ఉంది. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం దుమ్ముగూడెం వద్ద జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణంపై బుధవారం రాష్ట్ర నీటిపారుదల, ఇంధన శాఖలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలతో పాటు ఇరు శాఖల కార్యదర్శులు ఎస్‌కే జోషీ, అరవింద కుమార్, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ రావు పాల్గొని ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. దుమ్ముగూడెం జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ.2,458 కోట్లు వ్యయం అవుతుందని 2010-11లో జెన్‌కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. డ్యాంకు రూ.1,423 కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.720 కోట్లు, పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లకు రూ.315 కోట్లు వెచ్చించాలి ఉంటుందని పేర్కొంది. 2015-16 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం ఈ అంచనాలు రూ.3 వేల కోట్లు దాటుతుందని, అందులో డ్యామ్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.వెయ్యి కోట్ల ఖర్చు కానుందని జెన్‌కో ఈ సమావేశంలో నివేదించింది.
చేతులెత్తేసిన రెండు శాఖలు
దుమ్ముగూడెం, కంతనపల్లి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని నీటిపారుదల శాఖే భరించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, వ్యయం భరించేందుకు ఆ శాఖ విముఖత వ్యక్తం చేసింది. కనీసం డ్యాం నిర్మాణం వ్యయాన్ని భరించినా... విద్యుత్ కేంద్రాన్ని తామే నిర్మించుకుంటామని జెన్‌కో మరో ప్రతిపాదన చేసినా నీటిపారుదల శాఖ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ప్రతిపాదిత దుమ్ముగూడెం డ్యాం కింద ఎకరా ఆయకట్టు లేనందున ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టలేమని తేల్చి చెప్పింది. 320 (8ఁ40) మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లను వెచ్చించడం తమ వల్ల కాదని, ఒకవేళ నిర్మించినా విద్యుత్పత్తి వ్యయం తడిసి మోపెడవుతుందని జెన్‌కో అభిప్రాయపడింది. ఇంత వ్యయంతో విద్యుత్కేంద్రం నిర్మించేందుకు కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) సైతం అనుమతి ఇవ్వదని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెల్లడయ్యే అవకాశం ఉంది.