ఆడంబరాలొద్దు.. ఆదా ముద్దు  | 74 percent worry about personal financial situation | Sakshi
Sakshi News home page

ఆడంబరాలొద్దు.. ఆదా ముద్దు 

Apr 9 2023 3:55 AM | Updated on Apr 9 2023 5:57 PM

74 percent worry about personal financial situation - Sakshi

సాక్షి, అమరావతి: మారుతున్న కాలంతో పాటు మనుషుల పద్ధతులు మారుతుంటాయి. ఒకప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే కూడా లెక్కలేసుకునేవారు. అవసరమైన వాటికే ఖర్చు చేసేవారు. ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల.. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ కొలువుల్లో ఊహించని వేత­నాలు, అందుబాటులోకి వచ్చిన ఈ–కామర్స్‌ ఆన్‌లైన్‌ సైట్ల కారణంగా అవసరం లేనివాటిని కూడా విచ్చలవిడిగా కొన­డం మొదలైంది. కాలచక్రం గిర్రున తిరుగుతున్నట్టే మళ్లీ పాత రోజులొస్తున్నాయి. ఇలాంటి వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ప్రజలు ప్రయత్ని స్తున్నారు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌లను కట్టడి చేసుకుంటూ.. వీధిచివర దుకాణానికి వెళ్లి మరీ పచారీ సరుకులు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అనే సంస్థ భారత్‌లో గ్లోబల్‌ కన్స్యూమర్‌ ఇన్‌సైట్స్‌ పల్స్‌–2023 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పెరుగుతున్న ధరలు, ఆన్‌లైన్‌ డెలివరీలో అవకతవకలు, ఆలస్యం వంటి కారణాలు కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. మన దేశంలో 74% మంది.. ప్రపంచవ్యాప్తంగా 50% మంది వినియోగదారులు జీవన వ్యయం, వ్యక్తిగత ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. 

12 నగరాలు.. 25 ప్రాంతాలు 
విశాఖపట్నంతోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, నాగ్‌పూర్, జలంధర్, హైదరాబాద్, మీరట్‌ రాజ్‌కోట్‌ మెట్రో నగరాల్లోని 25 ప్రాంతాల్లో 9,180 మంది వినియోగదారుల నుంచి సర్వే సంస్థ పీడబ్ల్యూసీ అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 57 శాతం మంది పురుషులు కాగా.. 43 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 63 శాతం మంది అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నామని వెల్లడించారు.

75 శాతం మంది వినియోగదారులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్స్, లగ్జరీ వస్తువులను కొనడం మానుకుంటున్నారు. లగ్జరీ, ప్రీమియం, డిజైనర్‌ ఉత్పత్తులు 38 శాతం, వర్చువల్‌ ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌ 32 శాతం, కన్స్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌ 32 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులు (దుస్తులు, పాదరక్షలు) 31శాతం కొనుగోళ్లు పడిపోయాయి. 38 శాతం మంది ఇతరులు కొంటున్నారు కాబట్టి తామూ కొనాలని అనవసర ఖర్చు చేస్తున్నారు. అయితే.. 54 శాతం మంది మాత్రం వస్తువుల్లో నాణ్యత చూస్తున్నారు.    

ఆఫర్‌ ఉంటే చూద్దాంలే 
కొంతకాలం క్రితం ప్రతి వస్తువునూ ఇంటి వద్దకే తీసుకువచ్చి ఇస్తామనే ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. కూరగాయలు, ఆహారం, కిరాణా సరుకులు, పాలు, దుస్తులు, గృహోపకరణాలు ఇలా ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్‌ పెట్టినా ఇంటి వద్దకే చేరేవి. కానీ.. కొంతకాలంగా ఈ డెలివరీకి కూడా చార్జీలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఈ–కామర్స్‌ నిర్వాహకులు తెలివిగా వ్యవహరిస్తున్నారు.

నేరుగా డెలివరీ చార్జీలు తీసుకోకుండా కొంత మొత్తం నగదు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే డెలివరీ చార్జీలు ఉండవనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. లేదంటే ఆర్డర్‌ పెట్టిన సరుకు రావడానికి వారం పది రోజులు వేచి ఉండక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్‌లైన్‌ స్టోర్లకు బదులుగా ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోళ్లు జరపడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, 45 శాతం మంది మాత్రం ఈ–కామర్స్‌ సైట్లలో ప్రమోషన్, ప్రత్యేక రోజుల్లో ఆఫర్లు పెట్టినప్పుడు కొనుగోలు చేస్తున్నారు.

44 శాతం మంది నాణ్యత గల సరుకులను అందించే రిటైల్‌ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. 38 శాతం మంది బ్రాండెడ్‌ వస్తువులకు బదులు చవకైనవి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకోసం బ్రాండెడ్‌ వస్తువుకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో లభించే అలాంటి వస్తువు కోసం వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నారు.
  
సొంత బ్రాండ్లకు డిమాండ్‌ 
డబ్బును పొదుపు చేయడం కోసం రిటైలర్ల వ్యక్తిగత బ్రాండ్‌లను 33 శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. అంటే రిలయన్స్, డీ మార్ట్, మోర్, విశాల్‌ మార్ట్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్‌ వంటి కొన్ని భారీ దుకాణాల్లో వారి బ్రాండ్‌ పేరుతోనే వస్తువులు, దుస్తులు, సరుకులు లభిస్తుంటాయి. ఇవి మిగతా వాటితో పోలి్చతే కాస్త తక్కువకే దొరుకుతుంటాయి. అలాంటి వాటిని కొందరు కొంటున్నారు.

మన దేశంలోని వినియోగదారులలో సగం మంది దుకాణంలో షాపింగ్‌ చేసేటప్పుడు  ధరలు పెరిగిన విషయం తెలుసుకుని ఇబ్బందిగా భావిస్తున్నారు. దానికి తోడు భారీ దుకాణాల్లో రద్దీ, బిల్లింగ్‌ కోసం ఎక్కువ సేపు లైన్లలో నిలబడటం వంటి సమస్యలు 35 శాతం మందిని ఆ దుకాణాలకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి రిటైల్‌ దుకాణాల్లో వచ్చే ఆరు నెలల్లో వినియోగదారులు తమ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు.

చిత్రంగా 88 శాతం కంటే ఎక్కువ మంది స్థానికంగా ఉత్పత్తి చేసిన వాటిని కొనాలనుకుంటున్నారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారైన వస్తువులను 87 శాతం మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో వినియోగదారులు డేటా గోప్యత విషయంలో ఆందోళన చెందుతున్నారు. వాటి నుంచి వచ్చే ప్రమోషనల్‌ కాల్స్‌తో ఎక్కువగా విసిగిపోతున్నారు. ఫలితంగా, 41 శాతం మంది వ్యక్తిగత డేటాను అంటే ఫోన్‌ నెంబర్‌ను బిల్లింగ్‌ సమయంలో ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement