అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు దేశంలో ప్రజలు పెట్టే ఖర్చులే ఎక్కువ
గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్లలో ఈ తరహా ఖర్చులు రెట్టింపు
2009–10లో ఒక్కొక్కరి నెలసరి మొత్తం ఖర్చులో 3.5 శాతం..
2022–23 నాటికి 7.6 శాతానికి పెరుగుదల
పట్టణ ప్రాంతాల్లోనూ 5.6 శాతం నుంచి 8.6 శాతం పెరుగుదల
కేంద్ర ఎన్‌ఎస్‌ఎస్ సర్వే రిపోర్టు నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో జనాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు పెట్టే ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయని కేంద్ర ఎన్‌ఎస్‌ఎస్ సర్వే రిపోర్టు నివేదిక వెల్లడించింది. రోజు రోజుకీ కొత్త కొత్త అలవాట్లకు ఆకర్షించబడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటిల్లపాది తిండి సహా పిల్లల చదువులు, దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలు, కారు, మోటర్ సైకిల్ వాహనాలు, వైద్య ఖర్చులు.. ఇలా ఒక్కో కుటుంబం ప్రతి నెలా పెట్టే మొత్తం ఖర్చులో గ్రామాల్లో అయితే 7.6 శాతం మేర ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త ఖర్చులకే వినియోగిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ తరహా ఖర్చులు సరాసరి 8.6 శాతం మేర ఉంటున్నాయి. కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య దేశవ్యాప్తంగా కుటుంబాల వారీగా వినియోగ ఖర్చులపై నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదికను ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8,723 గ్రామాల్లో 1,55,014 కుటుంబాల నుంచి, పట్టణ ప్రాంతాల్లో 6,115 మున్సిపల్ వార్డుల్లో 1,06,732 కుటుంబాల నుంచి వివరాలు సేకరించినట్లు కేంద్రం ఆ నివేదికలో వివరించింది.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే మొత్తం ఖర్చులో 2009–10లో కేవలం 3.5 శాతం మాత్రమే ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులకు వినియోగించిన పరిస్థితి ఉండగా.. 2022–23 నాటికి ఆ తరహా ఖర్చులు రెట్టింపు స్థాయికి పెరిగి 7.6 శాతానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ 2009–10లో 5.6 శాతంగా ఉన్న ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులు 2022–23 నాటికి 8.6 శాతానికి పెరిగాయి.
దేశ సగటు కంటే ఏపీలో వినియోగ స్థాయి ఎక్కువ..
సర్వే నివేదిక ప్రకారం మన ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,871 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ. 6,782 చొప్పున ఖర్చు పెడుతున్నారు.
గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సగటు సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే ఖర్చులు దేశ సగటుతో పోల్చితే దేశమంతటా పట్టణ ప్రాంత వ్యక్తుల సరాసరి వినియోగ స్థాయిలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగ స్థాయి సగం మేర ఉండగా... మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు కాస్త దగ్గరగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ స్థాయి ఉండడం గమనార్హం.
దేశమంతటా గ్రామీణ ప్రాంత వ్యక్తుల 30 రోజుల వినియోగస్థాయి కంటే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగస్థాయి రూ.1,098 అదనంగా ఉండగా, అదే పట్టణ ప్రాంతాల్లో దేశ సగటు, రాష్ట్ర సగటు వ్యత్యాసం కేవలం రూ. 324గా ఉంది.
» దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల వినియోగస్థాయిలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా మన రాష్ట్రం గ్రామీణ ప్రజల వినియోగస్థాయి అధికంగా ఉంది.
» ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి 30 రోజుల సరాసరి తమ మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో 44.13 శాతం చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 38.58 చొప్పున రకరకాల తిండి అవసరాలకు ఖర్చు పెడుతున్నారు.
» రాష్ట్రంలో అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి 7.83 శాతం , పట్టణ
ప్రాంతాల్లో 8.37 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువే..
దేశమంతటా పట్టణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి తిండి అవసరాలకు 39.17 శాతం, తిండేతర అవసరాలకు 60.83 శాతం ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తిండి అవసరాలకు 46.38 శాతం , తిండేతర అవసరాలకు 53.62 శాతం ఖర్చు పెడుతున్నారు.
దేశమంతటా ఒక్కో వ్యక్తి సరాసరి 30 రోజుల్లో పెట్టే మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో రూ.285 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.383 చొప్పున కొత్తగా పుట్టుకొచ్చే అలవాట్లకే ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ఒక్కో వ్యక్తి సరాసరిన 30 రోజుల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో తిండి, సంబంధిత ఖర్చులకు రూ. 2,529 చొప్పున, ఇతర అవసరాలకు రూ.3,929 చొప్పున మొత్తం రూ. 6,458 ఖర్చు పెడుతున్నట్లు నిర్ధారించారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి సరాసరిన తిండి సంబంధిత అవసరాలకు రూ.1,749 చొప్పున, ఇతర అవసరాలకు రూ.2,023 చొప్పున ఒక్కొక్కరు మొత్తం రూ. 3,773 ఖర్చు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment