అయోధ్య నుంచి ‘సాక్షి’ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి :దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో స్థానికంగా దైవ సంకీర్తనలు సహజమే.. కానీ ఆ ఊరిలో ఎన్ని ఇళ్లుంటాయో అన్ని గుడులు ఉండటం మాత్రం అయోధ్యకే చెల్లింది. ఆ పట్టణంలో 8 వేలకుపైగా ఆలయాలు ఉన్నాయని అయోధ్యవాసులు చెప్తున్నారు. మహమ్మదీయ రాజుల కాలంలో ధ్వంసంగా కాగా మిగిలిన వాటి సంఖ్య ఇదని అంటున్నారు.
ప్రతి ఇల్లూ ఓ ఆలయమే..
అయోధ్యలో ప్రతి హిందువు ఇంట్లో ఓ చిన్నపాటి దేవాలయం ఉంటుంది. మన ఇళ్లలో పూజా మందిరం ఉన్నట్టుగా కాకుండా పెద్ద పరిమాణంలోని విగ్రహాలతో ఓ చిన్న గుడి ఉంటుంది. నిత్య పూజలు, నైవేద్యాలు, గుడిని తలపించే పూజాదికాలు జరుగుతుంటాయి. అందుకే అయోధ్యలో ప్రతి ఇల్లూ ఓ ఆలయమే అంటారు. అయోధ్య పట్టణంలో ఉన్న ఇళ్ల సంఖ్య 10,026. అంటే అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు కూడా అన్ని ఉన్నట్టు.
ముఖ్యమైన ఆలయాల పునరుద్ధరణ
కొత్త రామాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిశాక అయోధ్యలోని ఇతర ప్రధాన దేవాలయాలను కూడా పునరుద్ధరించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది వేల గుడులున్నా వాటిలో ముఖ్యమైనవి వంద వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ చారిత్రక ప్రాధాన్యమున్నవే. వందల ఏళ్లుగా పూజాదికాలు జరుగుతున్నవే. వాటిలో కొన్ని ఆలయాలు చాలా పురాతనమైనవి కూడా. శ్రీరాముడి జీవిత ఘట్టాలు, వ్యక్తులతో ముడిపడిన ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరత–శత్రుజు్ఞలు, సుగ్రీవుడు, జాంబవంతుడు, విశ్వామిత్రుడు, వశిషు్టడు, జనకమహారాజు, దశరథుడు.. ఇలా ఎన్నో గుడులు ఉన్నాయి.
► సీతమ్మ వంట చేసినట్టుగా పేర్కొనే సీతా రసో యీ, దశరథుడు నివసించినట్టు చెప్పే రాజభవనం, మణిమాణిక్యాలను కానుకలుగా తెచి్చన జనక మహారాజు పేరుతో ఏర్పడ్డ మణి పర్వత, సుగ్రీవ ఖిలా.. ఇలాంటి నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిలో నిర్వహణ లోపాలు, వాతావరణ ప్రభావంతో కొన్ని శిథిలమయ్యా యి. ఇప్పటికీ సలక్షణంగా ఉన్న గుడులు, నిర్మాణాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రధానాలయ దర్శనానికే పరిమితం కాకుండా.. ఇవన్నీ చూసేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
కోనేరులకూ యోగం..
అయోధ్యలో చాలా చోట్ల ఆలయాలతోపాటు అనుసంధానంగా కోనేరులు ఉన్నాయి. వాటికి కూడా రామాయణ గాథలతో ముడిపడిన చరిత్ర ఉంది. వీటిలో ముఖ్యమైన 35 కోనేరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సరయూ నది రివర్‌ఫ్రంట్‌ను అహ్మదాబాద్ సబర్మతీ తీరం తరహాలో అభివృద్ధి చేశారు. లైట్ అండ్ మ్యూజిక్ షో, లేజర్ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం నదీ హారతి ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment