అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు.
ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్‌లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు.
అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment