హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. హిందువులు రామమందిరం కోసం కాకుండా, రామ జన్మభూమి కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి కాచిగూడలోని మ్యాడం అంజయ్యహాల్‌లో జరిగిన బజరంగ్‌దళ్ శక్తి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రామమందిర నిర్మాణానికి పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని, చట్టం ద్వారానే మందిర నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
దేశంలో, తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింలకు మాదిరిగానే హిందువుల కోసం హిందూ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆర్టికల్ 370ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, సైనికులపై రోజూ దాడులు చేస్తున్నా ఏం చేయలేకపోతున్నారని అన్నారు. మానవ హక్కులు కేవలం మైనారిటీలకే ఉన్నాయా.. హిందువులకు ఉండవా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు గుణంపల్లి రాఘవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్ ప్రాంత సంయోజక్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.