ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి వస్తున్న వరద నీటితో ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.