పసిపాపకు వాతలు
భద్రాచలం, న్యూస్‌లైన్: రెండు నెలల పసిపాప అనారోగ్యం పాలైతే చికిత్స చేయించకుండా కడ్డీతో ఉదరంపై కాల్చి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చాడో గిరిజన తండ్రి. ఖమ్మం జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రా మానికి చెందిన పూసం ప్రసాద్, అంజలి దంపతులకు రెండు నెలల చిన్నారి ఉంది. వారం క్రితం పాపకు ఆయాసం వస్తుండటంతో అదే గ్రామంలోని తన సమీప బంధువుచే బొడ్డు చుట్టూ ఇనుప కడ్డీతో వాతలు పెట్టించాడు.
అవి చిన్నారి శరీరంపై బాగా ప్రభావం చూపటంతో మంగళవారం రాత్రి నుంచి ఏడవటం ప్రారంభించింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం చింతూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప ఆక్సిజన్ తీసుకోవటం కష్టంగా ఉందని, ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ వచ్చిందని, పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయారావు చెప్పారు.