vijayarama rao
-
బాసరలో వసంత పంచమి వేడుకలు
భెంసా: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో విజయరామారావు స్థానిక వైదిక బృందం ఆధ్వర్యంలో వేడుకలను ప్రారంభించారు. బాసర ఆలయ స్థానాచార్య, ప్రధానార్చకుల పర్యవేక్షణలో గోమాతకు పూజలు చేశారు. తర్వాత యాగశాలలో యాగ పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస పూజలు చేయించారు. -
కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ నుంచి 40 మంది..
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూటిమిగా ఏర్పడి గళం విప్పారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ పేరుతో 40 మందిమి ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి విజయరామారావు, రవీందర్, బొడా జనార్ధన్ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఆర్సీ కుంతియా ముగ్గురూ కూటమిగా ఏర్పడి మహాకూటమి పేరుతో మాయ చేశారని మండిపడ్డారు. రేపటి బీసీల బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ‘మా నలభై మంది గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. టికెట్లు అమ్ముకున్నారు కాబట్టే.. చివరి నిముషంలో కాంగ్రెస్‌లో చేరిన 19 మందికి సీట్లిచ్చారు. స్క్రీనింగ్ కమిటీ మమ్మల్ని ఎంత ఖర్చు పెడతారు. ఎన్ని డబ్బులున్నాయని అడిగింది. మరోసారి సమావేశమై అభ్యర్థుల్ని ప్రకటిస్తాం’ అని రెబల్స్ ఫ్రంట్ సభ్యులు తెలిపారు. పారాచూట్ నేతలకు సీట్లు లేవన్నారు.. పారచూట్ నేతలు, నాలుగు సార్లు ఓడిన నేతలకు టికెట్లిచ్చారని విజయరామారావు ధ్వజమెత్తారు. అయినా, పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని రాహుల్ గతంలో చెప్పాడని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక రాహుల్ గాంధీ ప్రిన్సిపల్స్‌కు అనుగుణంగానే జరిగిందా అని ఆయన టీపీసీసీ నేతలను ప్రశ్నించారు. పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేనివారికి కూడా సీట్లెలా కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఉత్తమ్ అమ్ముకున్నారని విజయరామారావు ఆరోపించారు. కాంగ్రెస్, కూటమి నేతల తీరుతో మళ్లీ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని ముంచేందుకే ఉత్తమ్ ఉన్నాడు.. ధర్మపురి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత రవీందర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నాలుగు సార్లు పోటీ చేసి ఓడిన వారికి కూడా టికెట్లెలా ఇస్తారని నిప్పులు చెరిగారు. ‘మా ధర్మపురిలో నాలుగు సార్లు ఓటమిపాలైన వారికి టికెట్ ఇచ్చారు. ప్రజల్లో సానుభూతి అంటే.. ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటుంది. అయిదో సారి కూడా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ముంచేలా ఉత్తమ్ వ్యవహరించాడని ఆరోపించారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ తరపున ధర్మపురి నుంచి పోటీకి దిగుతానని రవీందర్ స్పష్టం చేశారు. కాగా, ధర్మపురి టికెట్‌ను కాంగ్రెస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటాయించినన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..
పెద్దపల్లి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ను ఓడించి తీరుతామని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన తొలిసారిగా శనివారం పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఘనంగా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక ఎంబీగార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీకి పెద్దపల్లి కంచుకోట అని, రెండుపార్టీల్లోని నాయకులందరినీ ఏకం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, నాయకులను తానే స్వయంగా ఇంటింటికీ వెళ్లి కలుస్తానన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చినప్పటినుంచి పెద్దపల్లిలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నియోజకవర్గానికి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన నిధుల హామీలు నెరవేరలేదని విమర్శించారు. పార్టీ జిల్లా అధికార ప్రతిని«ధి దన్నాయక దామోదర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి విజయరమణ చేరికతో పెద్దపల్లిలో మంచిరోజులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు బలమైన నాయకుడు లేక కార్యకర్తలు అయోమయంలో పడ్డారని, ఇకపై విజయ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అంతకుముందు పెద్దకల్వల నుంచి విజయరమణారావును నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వారితో కలిసి పట్టణంలో మోటార్‌సైకిల్ ర్యాలీతో ఊరేగింపుగా సమావేశమందిరానికి చేరుకున్నారు. నాయకులు నూగిళ్ల మల్లయ్య, సాయిరి మహేందర్, ఎలువాక వెంకటస్వామి, అబ్బయ్య గౌడ్, నన్ను, బొడ్డుపెల్లి శ్రీనివాస్, వంగల తిరుపతిరెడ్డి, శంకర్, బూతగడ్డ సంపత్, కళ్ళేపల్లి జాని, రవి, రంగుశ్రీనివాస్, కుమార్ కిషోర్ పాల్గొన్నారు. పెద్దపల్లికి పూర్వ వైభవం తెస్తా.. సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లికి పూర్వవైభవం తీసుకొస్తానని విజయరమణారావు అన్నారు. ఆయన చేపట్టిన బైక్‌ర్యాలీ మండలకేంద్రం మీదుగా సాగింది. ఈ సందర్భంగా నెహ్రూ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నయ్యగౌడ్, మండల అధ్యక్షుడు ముత్యం రమేష్‌గౌడ్, స్రవంతిరావు, రజిత, మనేమ్మ, అంజలి, డీసీఎంఎస్ డైరెక్టర్ కల్లెపల్లి జాని, సాయిరి మహేందర్ ఉన్నారు. -
పసిపాపకు వాతలు
భద్రాచలం, న్యూస్‌లైన్: రెండు నెలల పసిపాప అనారోగ్యం పాలైతే చికిత్స చేయించకుండా కడ్డీతో ఉదరంపై కాల్చి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చాడో గిరిజన తండ్రి. ఖమ్మం జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రా మానికి చెందిన పూసం ప్రసాద్, అంజలి దంపతులకు రెండు నెలల చిన్నారి ఉంది. వారం క్రితం పాపకు ఆయాసం వస్తుండటంతో అదే గ్రామంలోని తన సమీప బంధువుచే బొడ్డు చుట్టూ ఇనుప కడ్డీతో వాతలు పెట్టించాడు. అవి చిన్నారి శరీరంపై బాగా ప్రభావం చూపటంతో మంగళవారం రాత్రి నుంచి ఏడవటం ప్రారంభించింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం చింతూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప ఆక్సిజన్ తీసుకోవటం కష్టంగా ఉందని, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చిందని, పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయారావు చెప్పారు. -
టీఆర్ఎస్కు విజయ రామారావు రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణపై నిబద్ధత, చిత్తశుద్ధితో 13 ఏండ్లుగా మీతో కలిసి పనిచేసిన. ఎన్నో కష్టానష్టాలెదురైనా పంటి బిగువున భరించిన. మీ పనితీరు వ్యక్తిగతంగా ఎంత బాధ కలిగించినా, మీ వ్యవహారశైలి రాజకీయ జీవితానికి నష్టం చేసినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఓర్చుకున్నా. జలదృశ్యంలో ఏ లక్ష్యంకోసం పార్టీ ఆవిర్భవించిందో అది నెరవేరింది. ఇక 13 ఏండ్ల ఉద్యమ ప్రస్థానానికి సెలవు’ అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ జి. విజయ రామారావు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌజుకు బుధవారం సాయంత్రం డాక్టర్ విజయ రామారావు వెళ్లి కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేసీఆర్ కుటుంబసభ్యులైన ఎమ్మెల్యేలు టి.హరీష్‌రావు, కె.తారక రామరావు మాత్రమే అక్కడ ఉన్నారు. కేసీఆర్‌కు అతి సన్నిహితంగా ఉండే విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం కేసీఆర్, విజయ రామారావుకు మధ్య జరిగిన చర్చల వివరాలు... ‘నేను సిద్దిపేటకు ఎంపీగా, గజ్వేల్‌కు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత తెలంగాణపై మమకారంతో, రాష్ట్ర ఏర్పాటుపై చిత్తశుద్ధి, నిబద్దతతో కలిసి పనిచేయాలని మీతో ఉద్యమ పథంలో అడుగేసిన. తెలుగుదేశంకు రాజీనామా లేఖను ఫ్యాక్సు ద్వారా పంపించి జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం నాడు జరిగిన సభకు ఇదే గజ్వేల్ నుంచి కదలివచ్చిన. అదేం అదృష్టమో తెలియదు కానీ ఇదే గజ్వేల్‌లోని ఈ ఫాంహౌజు నుంచి వీడ్కోలు తీసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. మన ఉద్యమ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకున్నం. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇదే గజ్వేల్ వేదికగా ఈ 30 ఏండ్ల రాజకీయ, వ్యక్తిగత మిత్రుని ఉద్యమ ప్రస్థానానికి సెలవు ఇవ్వండి’ అని బాధాతప్త హృదయంతో కేసీఆర్‌కు చెప్పినట్టుగా తెలిసింది. ‘నేనైతే మీకు విధేయునిగా, ఉద్యమానికి నష్టం కలగొద్దనే ఏకైక లక్ష్యంగా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. భవిష్యత్తులోనూ విప్పను. అయితే లక్ష్యం నెరవేరిన ఈ సమయంలోనూ నా గుండె బరువును దించుకోకుంటే జీవితాంతం వెంబడిస్తది. ఆ బరువులను ఇంకా మోయలేను. అవేవో మీకే చెప్పి, ఉద్యమ ప్రస్థానానికి వీడుకోలు తీసుకుంటా’ అని కేసీఆర్‌కు చెప్పుకుని వాపోయారు. ‘ఏనాడూ ఉద్యమంలో పనిచేయకపోగా.. అధికార పదవులను అనుభవిస్తూ ఉద్యమకారులపై నిర్బంధం విధించినవారిని, ఆర్థికంగా సంపన్నులైన కాంట్రాక్టర్లను, రియల్లర్లను పార్టీలో చేర్చుకున్నరు. ఈ క్రమంలో ఉద్యమంపై నిబద్దత, విధేయత కలిగిన నేను, నా లాంటి వాళ్లు అడ్డంకిగా ఉంటరు. నీ తోవకు అడ్డం ఉండకూడదనుకుంటున్నా. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య.. ఇలాంటివాళ్లు చాలామంది పార్టీలో చేరారు. పనికొచ్చినా, రాకున్నా సంఖ్యాబలంకోసం చేసిన ప్రయత్నంలో నాణ్యతను మీరు పట్టించుకోరని తేలిపోయింది. అందుకే అలాంటి శక్తులకు, వ్యక్తులకు అడ్డంకిగా మారొద్దనుకుంటున్నా. నాకు సెలవు ఇస్తే ఇక చాలు’ అని విజయ రామారావు చెప్పుకున్నట్టుగా తెలిసింది. దీనిని ఊహించని కేసీఆర్ కొంత సేపటికి తేరుకుని ‘ఇప్పటిదాకా కలిసి పనిచేశారు. భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు వస్తయి. నీవు పార్టీలో ఉండాలి. పార్టీని వీడిపోతే ఎలా. ఏమన్నా ఉంటే సరిదిద్దుకుందా’ అని కేసీఆర్ కోరినట్టుగా సమాచారం. ‘తెలంగాణ లక్ష్యం సాధించినం. అంతకన్నా మంచి అవకాశం, తృప్తి కలిగే అంశం మరొకటి లేదు. తెలంగాణ ఏర్పాటే అన్నింటికంటే సంతృప్తి కలిగించే విషయం. ఇష్టమున్నా, లేకున్నా నాకు సెలవు ఇవ్వండి చాలు’ అని విజయ రామారావు అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా సమాచారం.ఇదిలా ఉండగా ఆయన బుధవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వయంగా రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. -
టీఆర్ఎస్కు విజయరామారావు రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పార్టీకి మాజీ మంత్రి విజయరామారావు రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌తో విజయరామారావు సమావేశమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు విజయరామారావు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.