టీఆర్‌ఎస్‌కు విజయ రామారావు రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణపై నిబద్ధత, చిత్తశుద్ధితో 13 ఏండ్లుగా మీతో కలిసి పనిచేసిన. ఎన్నో కష్టానష్టాలెదురైనా పంటి బిగువున భరించిన. మీ పనితీరు వ్యక్తిగతంగా ఎంత బాధ కలిగించినా, మీ వ్యవహారశైలి రాజకీయ జీవితానికి నష్టం చేసినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఓర్చుకున్నా. జలదృశ్యంలో ఏ లక్ష్యంకోసం పార్టీ ఆవిర్భవించిందో అది నెరవేరింది. ఇక 13 ఏండ్ల ఉద్యమ ప్రస్థానానికి సెలవు’ అని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ జి. విజయ రామారావు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు స్పష్టం చేశారు.
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌజుకు బుధవారం సాయంత్రం డాక్టర్ విజయ రామారావు వెళ్లి కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేసీఆర్ కుటుంబసభ్యులైన ఎమ్మెల్యేలు టి.హరీష్‌రావు, కె.తారక రామరావు మాత్రమే అక్కడ ఉన్నారు. కేసీఆర్‌కు అతి సన్నిహితంగా ఉండే విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం కేసీఆర్, విజయ రామారావుకు మధ్య జరిగిన చర్చల వివరాలు... ‘నేను సిద్దిపేటకు ఎంపీగా, గజ్వేల్‌కు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత తెలంగాణపై మమకారంతో, రాష్ట్ర ఏర్పాటుపై చిత్తశుద్ధి, నిబద్దతతో కలిసి పనిచేయాలని మీతో ఉద్యమ పథంలో అడుగేసిన. తెలుగుదేశంకు రాజీనామా లేఖను ఫ్యాక్సు ద్వారా పంపించి జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం నాడు జరిగిన సభకు ఇదే గజ్వేల్ నుంచి కదలివచ్చిన. అదేం అదృష్టమో తెలియదు కానీ ఇదే గజ్వేల్‌లోని ఈ ఫాంహౌజు నుంచి వీడ్కోలు తీసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది.
మన ఉద్యమ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకున్నం. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇదే గజ్వేల్ వేదికగా ఈ 30 ఏండ్ల రాజకీయ, వ్యక్తిగత మిత్రుని ఉద్యమ ప్రస్థానానికి సెలవు ఇవ్వండి’ అని బాధాతప్త హృదయంతో కేసీఆర్‌కు చెప్పినట్టుగా తెలిసింది. ‘నేనైతే మీకు విధేయునిగా, ఉద్యమానికి నష్టం కలగొద్దనే ఏకైక లక్ష్యంగా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. భవిష్యత్తులోనూ విప్పను. అయితే లక్ష్యం నెరవేరిన ఈ సమయంలోనూ నా గుండె బరువును దించుకోకుంటే జీవితాంతం వెంబడిస్తది. ఆ బరువులను ఇంకా మోయలేను. అవేవో మీకే చెప్పి, ఉద్యమ ప్రస్థానానికి వీడుకోలు తీసుకుంటా’ అని కేసీఆర్‌కు చెప్పుకుని వాపోయారు. ‘ఏనాడూ ఉద్యమంలో పనిచేయకపోగా.. అధికార పదవులను అనుభవిస్తూ ఉద్యమకారులపై నిర్బంధం విధించినవారిని, ఆర్థికంగా సంపన్నులైన కాంట్రాక్టర్లను, రియల్లర్లను పార్టీలో చేర్చుకున్నరు.
ఈ క్రమంలో ఉద్యమంపై నిబద్దత, విధేయత కలిగిన నేను, నా లాంటి వాళ్లు అడ్డంకిగా ఉంటరు. నీ తోవకు అడ్డం ఉండకూడదనుకుంటున్నా. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య.. ఇలాంటివాళ్లు చాలామంది పార్టీలో చేరారు. పనికొచ్చినా, రాకున్నా సంఖ్యాబలంకోసం చేసిన ప్రయత్నంలో నాణ్యతను మీరు పట్టించుకోరని తేలిపోయింది. అందుకే అలాంటి శక్తులకు, వ్యక్తులకు అడ్డంకిగా మారొద్దనుకుంటున్నా. నాకు సెలవు ఇస్తే ఇక చాలు’ అని విజయ రామారావు చెప్పుకున్నట్టుగా తెలిసింది. దీనిని ఊహించని కేసీఆర్ కొంత సేపటికి తేరుకుని ‘ఇప్పటిదాకా కలిసి పనిచేశారు. భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు వస్తయి. నీవు పార్టీలో ఉండాలి. పార్టీని వీడిపోతే ఎలా. ఏమన్నా ఉంటే సరిదిద్దుకుందా’ అని కేసీఆర్ కోరినట్టుగా సమాచారం.
‘తెలంగాణ లక్ష్యం సాధించినం. అంతకన్నా మంచి అవకాశం, తృప్తి కలిగే అంశం మరొకటి లేదు. తెలంగాణ ఏర్పాటే అన్నింటికంటే సంతృప్తి కలిగించే విషయం. ఇష్టమున్నా, లేకున్నా నాకు సెలవు ఇవ్వండి చాలు’ అని విజయ రామారావు అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా సమాచారం.ఇదిలా ఉండగా ఆయన బుధవారం రాత్రి ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వయంగా రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.