సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూటిమిగా ఏర్పడి గళం విప్పారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ పేరుతో 40 మందిమి ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి విజయరామారావు, రవీందర్, బొడా జనార్ధన్ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఆర్‌సీ కుంతియా ముగ్గురూ కూటమిగా ఏర్పడి మహాకూటమి పేరుతో మాయ చేశారని మండిపడ్డారు. రేపటి బీసీల బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ‘మా నలభై మంది గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. టికెట్లు అమ్ముకున్నారు కాబట్టే.. చివరి నిముషంలో కాంగ్రెస్‌లో చేరిన 19 మందికి సీట్లిచ్చారు. స్క్రీనింగ్ కమిటీ మమ్మల్ని ఎంత ఖర్చు పెడతారు. ఎన్ని డబ్బులున్నాయని అడిగింది. మరోసారి సమావేశమై అభ్యర్థుల్ని ప్రకటిస్తాం’ అని రెబల్స్ ఫ్రంట్ సభ్యులు తెలిపారు.
పారాచూట్ నేతలకు సీట్లు లేవన్నారు..
పారచూట్ నేతలు, నాలుగు సార్లు ఓడిన నేతలకు టికెట్లిచ్చారని విజయరామారావు ధ్వజమెత్తారు. అయినా, పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని రాహుల్ గతంలో చెప్పాడని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక రాహుల్ గాంధీ ప్రిన్సిపల్స్‌కు అనుగుణంగానే జరిగిందా అని ఆయన టీపీసీసీ నేతలను ప్రశ్నించారు. పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేనివారికి కూడా సీట్లెలా కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఉత్తమ్ అమ్ముకున్నారని విజయరామారావు ఆరోపించారు. కాంగ్రెస్, కూటమి నేతల తీరుతో మళ్లీ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీని ముంచేందుకే ఉత్తమ్ ఉన్నాడు..
ధర్మపురి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత రవీందర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నాలుగు సార్లు పోటీ చేసి ఓడిన వారికి కూడా టికెట్లెలా ఇస్తారని నిప్పులు చెరిగారు. ‘మా ధర్మపురిలో నాలుగు సార్లు ఓటమిపాలైన వారికి టికెట్ ఇచ్చారు. ప్రజల్లో సానుభూతి అంటే.. ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటుంది. అయిదో సారి కూడా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ముంచేలా ఉత్తమ్ వ్యవహరించాడని ఆరోపించారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ తరపున ధర్మపురి నుంచి పోటీకి దిగుతానని రవీందర్ స్పష్టం చేశారు. కాగా, ధర్మపురి టికెట్‌ను కాంగ్రెస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటాయించినన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment