నిందితులు, గంజాయిని చూపుతున్న పోలీసులు
నల్లగొండక్రైం, నాగార్జునసాగర్: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.84లక్షల విలువైన 336 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ నుంచి డీసీఎంలో గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాగార్జునసాగర్‌లోని విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సంపత్ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కూరగాయల లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను ఆపారు. ఆ డీసీఎంలోని కూరగాయల ట్రేల అడుగున 168 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీసీఎంలోని నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ముఠాగా ఏర్పడి..
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన జ్ఞానోబా అమోల్ ఘెరే, సంగమేశ్వర సదా శివ జంగనే, ఖయ్యూమ్ ఇషాకే, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన గణపతి బసవరాజు సోనాల్ ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేయడం మొదలుపెట్టారు. జ్ఞానోబా అమోల్ ఘెరే డ్రైవర్‌గా పని చేస్తుండగా.. అతడికి నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జయపాల్ పరిచయమయ్యాడు.
వీరంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ మీదుగా వెళ్తే పట్టుబడతామని గుంటూరు, మాచర్ల మీదుగా డీసీఎంలో కూరగాయల లోడు మధ్యలో గంజాయి పెట్టుకొని తరలిస్తుండగా.. పోలీసులకు సమాచారం అందడంతో పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు.
నిందితుల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జయపాల్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. గంజాయి రవాణాపై మరింత నిఘా పెట్టి కట్టడి చేస్తామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment