కలీమొద్దీన్ (ఫైల్)
మోత్కూరు: అనుమానాస్పద స్థితిలో పాత ఇనుప సామాను దుకాణ యజమాని మృతి చెందాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణానికి చెందిన ఎండీ కలీమొద్దీన్(70) సుమారు 30 సంవత్సరాలుగా మో త్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడిబజార్ ప్రాథమిక పాఠశాల సమీపంలో పాత ఇనుప సామాను దుకాణం నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు.
అతడికి భార్యాపిల్లలు లేరు. ఇటీవల కలీమొద్దీన్ భువనగిరికి వెళ్లి తన సమీప బంధువుల వద్ద దాచుకున్న రూ.1.90 లక్షల నగదును తీసుకొని వచ్చి తన దుకాణంలో దాచుకున్నాడు. దుకాణంలో నలుగురైదుగురు కూలీలు రోజువారీగా పని చేస్తుంటారు. వారు గ్రామాలలో కొనుగోలు చేసిన పాత ఇనుప సామాను, ఇతర వస్తువులను ఈ దుకాణంలో విక్రయిస్తారు. మంగళవారం ఉదయం పాలు పోసేందుకు వెళ్లిన వ్యక్తి కలీమొద్దీన్‌ను పిలువగా అతడు పలకలేదు.
దీంతో దుకాణం లోపలికి వెళ్లి చూడగా మంచంపై కలీమొద్దీన్ విగతజీవిగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రభాకర్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులను డాగ్ స్క్వాడ్ గుర్తించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీమొద్దీన్ శరీరంపై, మంచం, గోడ, అద్దంపై రక్తం మరకలను పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలాన్ని చౌటుప్పల్ ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరామ్ పరిశీలించారు. కలీమొద్దీన్ మంచంపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బుల కోసం ఆరా తీయగా.. అతడు ఇవ్వకపోవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుని మెడపై ఎడమ వైపు పదునైన ఆయుధంతో బలంగా కొట్టారని, దీంతో రక్తస్రావమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పూర్తిస్థాయి విచారణ చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ విలేకరులకు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం కొరకు రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment