inter state thief gang
-
కూరగాయల లోడ్‌లో తరలిపోతున్న గంజాయి
నల్లగొండక్రైం, నాగార్జునసాగర్: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.84లక్షల విలువైన 336 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి డీసీఎంలో గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాగార్జునసాగర్‌లోని విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కూరగాయల లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను ఆపారు. ఆ డీసీఎంలోని కూరగాయల ట్రేల అడుగున 168 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీసీఎంలోని నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ముఠాగా ఏర్పడి.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన జ్ఞానోబా అమోల్ ఘెరే, సంగమేశ్వర సదా శివ జంగనే, ఖయ్యూమ్ ఇషాకే, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన గణపతి బసవరాజు సోనాల్ ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేయడం మొదలుపెట్టారు. జ్ఞానోబా అమోల్ ఘెరే డ్రైవర్‌గా పని చేస్తుండగా.. అతడికి నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జయపాల్ పరిచయమయ్యాడు. వీరంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ మీదుగా వెళ్తే పట్టుబడతామని గుంటూరు, మాచర్ల మీదుగా డీసీఎంలో కూరగాయల లోడు మధ్యలో గంజాయి పెట్టుకొని తరలిస్తుండగా.. పోలీసులకు సమాచారం అందడంతో పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జయపాల్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. గంజాయి రవాణాపై మరింత నిఘా పెట్టి కట్టడి చేస్తామని ఎస్పీ తెలిపారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
తూర్పుగోదావరి, రావులపాలెం (కొత్తపేట): ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు కేసుల్లో నిందితులు, అంతర్ జిల్లాల దొంగలు నలుగురిని రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.తొమ్మిది లక్షల విలువైన 404.54 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటరు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పెద్దిరాజు వారి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గతంలో పలు కేసులు నమోదు కాబడిన నిందితులు మలికిపురం మండలం గుడిమెళ్లంకకు చెందిన మామిడి శెట్టి సురేష్, భీమవరం మండలం గునిపూడికి చెందిన పందిరి వెంకట నారాయణ, సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన జిళ్లెళ్ల రాకేష్, గతనెల 15వ తేదీన మండలంలోని వెదిరేశ్వరంలో ఒక ఇంటిలో దొంగతనం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా నిందితులు దొంగిలించిన నగదును మార్చేందుకు తణుకు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న సీఐ పెద్దిరాజు వచ్చిన సమాచారంతో శుక్రవారం రావులపాలెం ఎస్సై సీహెచ్ విద్యాసాగర్, సిబ్బంది మండలంలోని ఈతకోట చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా దొంగలించిన మోటరు సైకిల్‌పై నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని విచారించగా, చోరీ సొత్తును మారకం చేసేందుకు సహకరించిన తణుకు మండలం వేల్పూరుకు చెందిన ఒబినీడి సాయికృష్ణ కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నాలుగు కేసుల్లో రెండు రావులపాలెం మండల పరిధిలోనివి కాగా మిగిలిన రెండు అమలాపురం రూరల్ పరిధిలో నమోదైన కేసులు, నాలుగు కేసుల్లో సుమారు రూ.తొమ్మిది లక్షల విలువైన 404.54 గ్రాముల బంగా>రు ఆభరణాలు, మోటరు సైకిల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. వీరిపై ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో కూడా పలు కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హజరుపర్చనున్నట్టు తెలిపారు. దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన ఎస్సై విద్యాసాగర్‌ను, పీఎస్సై దుర్గాప్రసాద్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి, హెచ్‌సీలు పి.అమ్మిరాజు, దుర్గారావు, బ్రహ్మాజీ, రమణ, కానిస్టేబుళ్లు చక్రవర్తి, గీతాకృష్ణ, కృష్ణ, సతీష్, తదితరులను సీఐ అభినందించారు. -
అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ప్రజల దృష్టి మరల్చి దేశంలో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత నెల 28న నగరంలోని దేవీ థియేటర్ సమీపంలో దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ముఠా సభ్యులు తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లి జిల్లా శ్రీరంగం మండలం మలైపట్టి, కాతూర్, మిల్‌కాలనీ ప్రాంతాలకు చెందిన ముత్త జ్ఞానవేల్, మదన్ శక్తి అలియాస్ సత్తి, చంద్రుకుమార్, సుందర్ జగదీశ్వర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగతా ముఠా సభ్యులు సుందర్ రాజన్ (ముఠా నాయకుడు), మునిస్వామి, శరవరణ్, వాసు, మోహన్‌లు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయడంతో పాటు కోర్టుకు పక్కా ఆధారాలను సమర్పించి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దృష్టి మరల్చి దొంగతనాలు.. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజల దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు. బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముఠా సభ్యులు దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతారన్నారు. మార్చి 28న నగరంలో దేవీ థియేటర్ యజమాని బొల్లం సుఖేష్‌కుమార్ దృష్టి మరల్చి కారులో ఉన్న లక్ష రూపాయల బ్యాగును దొంగలించినట్లు చెప్పా రు. అదే రోజు కరీంనగర్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద ద్విచక్రదారుడిని దృష్టి మరల్చి రూ.2 లక్షలను దొంగలించినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి తిరిగి స్వస్థలానికి వెళ్తున్న క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చిత్రాల ఆధారంగా స్థానిక ప్రజలు ముఠా సభ్యులను గుర్తు పట్టి ఇంతేజార్గంజ్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో వారిని పట్టుకున్నట్లు సీపీ వివరించారు. దోపిడీ ముఠా సభ్యులు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దృష్టి మరల్చి 7 చోరీలకు పాల్పడగా కరీంనగర్లో ఒక చోరీకి పాల్పడినట్లు ఆయన చెప్పారు. రూ.80 వేలు, 8 గ్రాముల బంగారం స్వాధీనం.. దొంగల ముఠా నుంచి రూ.80,380 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, రూ.25 వేల విలువ గల 8 గ్రామాలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్ వివరించారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను, కానిస్టేబుళ్లను సీపీ ప్రత్యేకంగా అభినంధించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, వరంగల్ ఏసీపీ రాయల ప్రభాకర్, హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్, మట్టెవాడ ఇన్స్పెక్టర్ రవికుమార్‌లు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 లక్షల రూపాయల నగదు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పలు చోరీలకు పాల్పడింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ ముఠాపై 11 కేసులు నమోదయ్యాయి.