సమావేశంలో మాట్లాడుతున్న సీపీ డాక్టర్ రవీందర్
వరంగల్ క్రైం: ప్రజల దృష్టి మరల్చి దేశంలో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దోపిడీ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత నెల 28న నగరంలోని దేవీ థియేటర్ సమీపంలో దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ముఠా సభ్యులు తమిళనాడు రాష్ట్రం తిరుచునాపల్లి జిల్లా శ్రీరంగం మండలం మలైపట్టి, కాతూర్, మిల్‌కాలనీ ప్రాంతాలకు చెందిన ముత్త జ్ఞానవేల్, మదన్ శక్తి అలియాస్ సత్తి, చంద్రుకుమార్, సుందర్ జగదీశ్వర్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగతా ముఠా సభ్యులు సుందర్ రాజన్ (ముఠా నాయకుడు), మునిస్వామి, శరవరణ్, వాసు, మోహన్‌లు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయడంతో పాటు కోర్టుకు పక్కా ఆధారాలను సమర్పించి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
దృష్టి మరల్చి దొంగతనాలు..
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజల దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముఠా సభ్యులు దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతారన్నారు. మార్చి 28న నగరంలో దేవీ థియేటర్ యజమాని బొల్లం సుఖేష్‌కుమార్ దృష్టి మరల్చి కారులో ఉన్న లక్ష రూపాయల బ్యాగును దొంగలించినట్లు చెప్పా రు. అదే రోజు కరీంనగర్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద ద్విచక్రదారుడిని దృష్టి మరల్చి రూ.2 లక్షలను దొంగలించినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి తిరిగి స్వస్థలానికి వెళ్తున్న క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చిత్రాల ఆధారంగా స్థానిక ప్రజలు ముఠా సభ్యులను గుర్తు పట్టి ఇంతేజార్‌గంజ్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో వారిని పట్టుకున్నట్లు సీపీ వివరించారు. దోపిడీ ముఠా సభ్యులు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దృష్టి మరల్చి 7 చోరీలకు పాల్పడగా కరీంనగర్‌లో ఒక చోరీకి పాల్పడినట్లు ఆయన చెప్పారు.
రూ.80 వేలు, 8 గ్రాముల బంగారం స్వాధీనం..
దొంగల ముఠా నుంచి రూ.80,380 నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.25 వేల విలువ గల 8 గ్రామాలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్ వివరించారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను, కానిస్టేబుళ్లను సీపీ ప్రత్యేకంగా అభినంధించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, వరంగల్ ఏసీపీ రాయల ప్రభాకర్, హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్, ఇంతేజార్‌గంజ్ ఇన్స్‌పెక్టర్ ఎస్.రవికుమార్, మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ రవికుమార్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment