ఆ ఇద్దరే దిక్కు..!
Published Sat, Dec 28 2013 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
సాక్షి, నరసరావుపేట :గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి గ్రామానికి ఓ కార్యదర్శిని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలంలో మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉండే బొల్లాపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీలు, మరో 30 వరకు శివారు తండాలు ఉన్నాయి. మారుమూల ప్రాంత ప్రజలకు సేవలందించేందుకు ఇక్కడ గ్రామ కార్యదర్శులను నియమించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని గరికపాడు, బొల్లాపల్లి గ్రామాలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 21 పంచాయతీలకు కూడా వీరిద్దరే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు.
తండాల్లో ప్రజలకు ఏఅవసరం వచ్చినా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మండల కేంద్రానికి వచ్చి గ్రామ కార్యదర్శితో చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, మంచినీరు వంటి సమస్యలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. బొల్లాపల్లి మండలంలో రూ. 4,77,520 పన్ను వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ. 22,023 మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి గ్రామపంచాయతీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలో ఒక్క వెల్లటూరు గ్రామ పంచాయతీ మినహా మిగతా ఏ పంచాయతీలోనూ పన్ను వసూలు రిజిస్టర్లు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆడిట్‌లో సైతం కేవలం రశీదులు మాత్రమే చూపుతూ రిజిస్టర్లు చూపడంలేదు. పన్ను రిజిస్టర్లు చూపలేదంటూ ఆడిటర్లు రాసుకొని వెళ్లిపోతున్నారు. గత ఏడాది భారీ సంఖ్యలో వీఏఓ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలాన్ని మాత్రం మరిచింది.
పంచాయతీల్లో యథేచ్ఛగా నిధుల గోల్‌మాల్
బొల్లాపల్లి మండలంలోని అనేక పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్, పంచాయతీ, మండలస్థాయి అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయల నిధులను మింగేస్తున్నారు. పేరూరిపాడు పంచాయతీలో 2010లో రూ. 1.75లక్షల నిధులను కాజేసి చెక్‌బుక్‌లు, రికార్డులు సైతం మాయం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి రికార్డులు పంపాల్సిందిగా ఆదేశించారు. ఇది జరిగి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ రికార్డులు చూపలేదు. దీంతో ఈ గ్రామ పంచాయతీలో వున్న రూ. 9లక్షల నిధులను ఖర్చు చేసే వీలు లేకపోవడంతో గ్రామాభివృద్థి కుంటుపడింది. ఇటీవల ఆ గ్రామ మాజీ సర్పంచ్‌పై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం మండలంలో ఈఓపీఆర్‌డిగా పనిచేసిన అధికారి ఒకరు అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 3 లక్షల ఇంటి పన్నులు అక్రమంగా కాజేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారులు వీటిపై దృష్టిసారించకుండా సిబ్బంది కొరత అనే సాకు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం
పేరూరిపాడు గ్రామంలో పెద్ద మొత్తంలో నిధులు కాజేసిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇద్దరే కార్యదర్శులు ఉండటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం.
- డీఎల్‌పీఓ భాస్కరరెడ్డి
Advertisement
Advertisement