హిందుస్తాన్ జింక్ డివిడెండ్ రూ.10,141 కోట్లు
♦ అత్యధిక డివిడెండ్ చెల్లిస్తున్న ప్రైవేట్ కంపెనీ
♦ 1200 శాతం స్పెషల్ గోల్డెన్ జూబ్లీ డివిడెండ్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.10,141 కోట్లు డివిడెండ్ చెల్లించనున్నది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను చెల్లిస్తున్న తొలి ప్రైవేట్ రంగ కంపెనీ ఇదే. డివిడెండ్ ట్యాక్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రూ.12,205 కోట్లకు చేరుతుందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఈ డివిడెండ్‌లో ప్రభుత్వానికి రూ.3,000 కోట్లు చెల్లిస్తున్నామని హిందుస్తాన్ జింక్ సీఈఓ సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకమైన స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని వివరించారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై 1200 శాతం(రూ.24) డివిడెండ్‌ను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు.
2002-03లో ప్రభుత్వం ఈ కంపెనీలో నియంత్రిత వాటాను అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. 29.54 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. వాటా విక్రయం తర్వాత 2002 నుంచి రాయల్టీలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, డివిడెండ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్.. తదితరాల రూపేణా ప్రభుత్వానికి రూ. 32,500 కోట్లు చెల్లించామని దుగ్గల్ వివరించారు. వేదాంత అనుబంధ కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ వెండి, జింక్, లెడ్ లోహాలను ఉత్పత్తి చేస్తోంది. కాగా బీఎస్‌ఈలో ఈ షేర్ 3.1 శాతం లాభంతో రూ.175 వద్ద ముగిసింది.