Sunil duggal
-
మైనింగ్‌కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు. -
వేదాంత డైరెక్టర్‌గా అనిల్ అగర్వాల్
న్యూఢిల్లీ: మైనింగ్ మ్యాగ్నెట్ అనిల్ అగర్వాల్.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. అనిల్ అగర్వాల్(66)ను నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నవీన్ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్. వెంకటకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్ దుగ్గల్‌ను వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది. -
హిందుస్తాన్ జింక్ డివిడెండ్ రూ.10,141 కోట్లు
♦ అత్యధిక డివిడెండ్ చెల్లిస్తున్న ప్రైవేట్ కంపెనీ ♦ 1200 శాతం స్పెషల్ గోల్డెన్ జూబ్లీ డివిడెండ్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.10,141 కోట్లు డివిడెండ్ చెల్లించనున్నది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను చెల్లిస్తున్న తొలి ప్రైవేట్ రంగ కంపెనీ ఇదే. డివిడెండ్ ట్యాక్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రూ.12,205 కోట్లకు చేరుతుందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఈ డివిడెండ్‌లో ప్రభుత్వానికి రూ.3,000 కోట్లు చెల్లిస్తున్నామని హిందుస్తాన్ జింక్ సీఈఓ సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకమైన స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని వివరించారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై 1200 శాతం(రూ.24) డివిడెండ్‌ను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. 2002-03లో ప్రభుత్వం ఈ కంపెనీలో నియంత్రిత వాటాను అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. 29.54 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. వాటా విక్రయం తర్వాత 2002 నుంచి రాయల్టీలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, డివిడెండ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్.. తదితరాల రూపేణా ప్రభుత్వానికి రూ. 32,500 కోట్లు చెల్లించామని దుగ్గల్ వివరించారు. వేదాంత అనుబంధ కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ వెండి, జింక్, లెడ్ లోహాలను ఉత్పత్తి చేస్తోంది. కాగా బీఎస్ఈలో ఈ షేర్ 3.1 శాతం లాభంతో రూ.175 వద్ద ముగిసింది.