కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు.
కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు.
భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్‌ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment