రిలయన్స్ క్యాపిటల్ డివిడెండ్ రూ.10
♦ క్యూ4లో 10% పెరిగిన నికర లాభం
♦ 12% వృద్ధితో రూ.2,828 కోట్లకు ఆదాయం
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.415 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే కాలానికి సాధించిన నికర లాభం(రూ.407 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,542 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,828 కోట్లకు పెరిగిందని వివరించింది.ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.1,001 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధితో రూ.1,101 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
మొత్తం ఆదాయం రూ.8,929 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.9,998 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ. 10 (వంద శాతం)డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.15,390 కోట్లుగా ఉంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ స్వల్పంగా పెరిగి రూ.384 వద్ద ముగిసింది.