హెచ్‌యూఎల్ లాభం జూమ్
క్యూ4లో 17 శాతం అప్; రూ. 1,018 కోట్లు...
⇒ ఆదాయం రూ.7,555 కోట్లు; 9% వృద్ధి
⇒ షేరుకి రూ. 9 తుది డివిడెండ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 1,018 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 872 కోట్లు. తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం రూ. 6,936 కోట్ల నుంచి 9 శాతం వృద్ధి చెంది రూ. 7,555 కోట్లకు పెరిగింది. కొన్ని ప్రాపర్టీల విక్రయం ద్వారా రూ. 170 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది.
మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ పోటీ సంస్థలను మించి మెరుగైన లాభాలు ఆర్జించే దిశగా తాము నిలకడైన వ్యూహాన్ని అనుసరిస్తున్నామని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. మార్జిన్లను మెరుగుపర్చుకుంటూ, మరోసారి మార్కెట్‌ను మించిన పనితీరును కనపర్చగలిగామన్నారు. మరోవైపు, పట్టణ మార్కెట్లను మించి గ్రామీణ ప్రాంత మార్కెట్లు ఎదుగుతూ వచ్చినప్పటికీ.. గత 2-3 ఏళ్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు కాస్త మందగించాయని సంస్థ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. షేరు ఒక్కింటికి రూ. 9 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది.
రెండంకెల వృద్ధి..: సోప్స్, డిటర్జెంట్లతో పాటు శిశు సంరక్షణ ఉత్పత్తులు లాంటివి కొన్నింటిని మినహాయిస్తే మిగతా ఉత్పత్తుల అమ్మకాలు రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. సోప్స్, డిటర్జెంట్స్ విభాగం అమ్మకాల ఆదాయం 5 శాతం పెరిగి రూ. 3,674 కోట్లు, బేవరేజెస్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 976 కోట్లు, పర్సనల్ కేర్ విక్రయాలు 13 శాతం పెరిగి రూ.2,250 కోట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 477 కోట్లు వచ్చాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌యూఎల్ నికర లాభం రూ.3,867 కోట్ల నుంచి రూ. 4,315 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.27,048 కోట్ల నుంచి రూ. 30,170 కోట్లకు ఎగిసింది.
శుక్రవారం బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్ షేరు 3.34% పెరిగి రూ. 894.60 వద్ద ముగిసింది.