కార్పొరేట్ల డివిడెండ్ల జోరు...
బడ్జెట్‌లో 10 శాతం డీడీటీ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: కంపెనీలు డివిడెండ్ల మీద డివిడెండ్లు ప్రకటిస్తున్నాయి. ఒక్క గురువారం రోజే 47 కంపెనీలు డివిడెండ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటొకార్ప్, శ్రీ సిమెంట్, టొరంట్ తదితర కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. అరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్‌లో రూ.10 లక్షలకు మించిన కంపెనీల డివిడెండ్లపై 10% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీటీటీ) విధించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్నందున, ఈ లోపే డివిడెండ్‌లు ప్రకటించి, చెల్లింపులు జరిపితే ప్రమోటర్లు పన్ను పోటు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. దాదాపు 253 కంపెనీలు మధ్యంతర డివిడెండ్‌ల ప్రకటనల కోసం బోర్డ్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నట్లు బీఎస్‌ఈకి వెల్లడించాయి.
ఇప్పటికే 60 కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. ఇక గురువారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కో షేర్‌కు రూ.10.50 మధ్యంతర డివిడెండ్లను ప్రకటించింది. కంపెనీ డివిడెండ్‌గా చెల్లించే రూ.3,300 కోట్ల మొత్తంలో 46 శాతం అంబానీ కుటుంబానికే వెళుతుందని అంచనా. దీనికి రికార్డ్ డేట్‌గా ఈ నెల 18ని నిర్ణయించింది. ఇక టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఒక్కో షేర్‌పై రూ.40 మధ్యంతర డివిడెండ్లను ప్రకటించింది. ఇక మరో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో ఒక్కో షేర్‌కు రూ.50 చొప్పున డివిడెండ్లను బుధవారమే ప్రకటించింది.