దిగ్గజ మీడియా సంస్థగా అవతరణ
ఇప్పటికే సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ అనుమతులు
విలీనానికి వీలుగా వ్యాపారాల్లో సర్దుబాట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవలి ఒప్పందం మేరకు... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా ఆస్తుల్లో వాల్ట్ డిస్నీ ఇండియా ఈ డిసెంబర్ త్రైమాసికంలోపు విలీనం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి విలీనం పూర్తవుతుందంటూ స్టాక్ ఎక్స్చేంజ్ లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సమాచారం ఇచ్చింది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతులు లభించడం గమనార్హం. ‘‘మిగిలిన అనుమతుల కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
విలీన లావాదేవీ 2024–25 సంవత్సరం మూడో త్రైమాసికంలో ముగుస్తుందని అంచనా వేస్తున్నాం’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. రిలయన్స్ మీడియా విభాగాలైన టీవీ18 బ్రాడ్‌కాస్ట్, ఈ18, నెట్‌వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఇప్పటికే ఆమోదం తెలియజేసిందని.. అక్టోబర్ 3 నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ 18 పరిధిలోని నాన్ న్యూస్ (వార్తలు కాకుండా), కరెంట్ ఎఫైర్స్ టీవీ ఛానళ్ల లైసెన్స్‌లను స్టార్ ఇండియాకు బదిలీ చేసేందుకు సెపె్టంబర్ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధిట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారానికి వయాకామ్ 18 హోల్డింగ్ కంపెనీగా ఉంది. విలీనం తుది దశలో ఉందని, సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారాల్లో సర్దుబాట్లు చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
అతిపెద్ద మీడియా సంస్థ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగాలు, వాల్ట్‌డిస్నీ ఇండియా వ్యాపారాల విలీనంతో రూ.70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. విలీనానంతర సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 63.16 శాతం, వాల్ట్ డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలుంటాయి. పోటీ సంస్థలైన సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా రూ.11,500 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిగా పెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment