మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లపై పన్ను ఉంటుందా? | Mutual fund dividends On The tax will be? | Sakshi
Sakshi News home page

మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లపై పన్ను ఉంటుందా?

Published Mon, Feb 8 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లపై పన్ను ఉంటుందా?

మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లపై పన్ను ఉంటుందా?

దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయా ? లేకుంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లు ఎక్కువ రాబడులనిస్తాయా? రెండింటిలో ఏవి ఉత్తమం?
 - ఉత్తమ్, విజయవాడ

 
ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడవుతాయి. ఇన్వెస్టర్లు వీటిని బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి బాగా పాపులర్. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇప్పటివరకైతే, దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్ విషయమై, ఈటీఎఫ్‌ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనిస్తున్నాయి. అందుకని మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ఫండ్‌ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
 
మ్యూచువల్ ఫండ్స్ చెల్లించే డివిడెండ్లపై పన్ను ఉంటుందా?  ఒక వేళ ఉంటే ఎంత రేటు చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.? మ్యూచువల్ ఫండ్ కంపెనీయే పన్ను మినహాయించుకొని మిగిలింది ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయా?                                     
 - నిరంజన్, కరీంనగర్

 
ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రకటించే డివిడెండ్‌లపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు 28.84 శాతం చొప్పున డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ని చెల్లిస్తాయి. ఈ పన్ను మొత్తం పోగా మిగిలిన రాబడిని ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి డీడీటీ ఉండదు.
 
నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నేను పాత పెన్షన్ స్కీమ్ కిందకు వస్తాను. ఆదాయపు పన్ను చట్టం,  సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద అదనంగా రూ.50,000 పన్ను మినహాయింపు పొందడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
 - ప్రకాశ్, సికింద్రాబాద్

 
మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో చేరి అదనంగా రూ.50,000 పన్ను రాయితీని సెక్షన్80సీసీడీ(1బీ)కింద పొందవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే ఇతర పెన్షన్, ప్రావిడెండ్ ఫండ్‌ల పెట్టుబడులతో పోల్చితే ఎన్‌పీఎస్‌లో పెట్టే పెట్టుబడులు స్వతంత్రంగా ఉంటాయి.
 
ఏడాది వయస్సున్న నా కొడుకుకు వాడి అమ్మమ్మ రూ.10,000 బహుమతిగా ఇచ్చింది. ఈ డబ్బులు మరో పదేళ్ల దాకా నాకు అవసరం ఉండదు.ఈ సొమ్ములను వాడి భవిష్యత్ చదువుల కోసం వినియోగిద్దామనుకుంటున్నాను. ఈ డబ్బులను బ్యాలెన్స్‌డ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేకుంటే హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ?
 - విజయ్, నెల్లూరు

 
మీ పెట్టుబడి కాలపరిమితి పదేళ్లు కాబట్టి. మీరు నిరభ్యంతరంగా ఈక్విటీ ల్లో  ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో మరే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనం కన్నా ఈక్విటీలే మంచి రాబడులను ఇస్తాయి. కాబట్టి సంపద సృష్టికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే సరైనది. స్టాక్ మార్కెట్లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తుంటాం. ఈ ఫండ్స్‌లో ఈక్విటీలో కనీసం 65%, మిగిలినది డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి.

ఇలాంటి కేటాయింపుల కారణంగా పూర్తి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇవి తక్కువ ఒడిదుడుకులకు గురవుతాయి. స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులుగా ఉన్నప్పుడు డెట్ విభాగం కుషన్‌గా పనిచేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కింది బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించచవచ్చు. .. ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్, టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్, టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్,
 
నా పుట్టింటి వారి నుంచి స్త్రీ ధనం కింద రూ. 2 లక్షల వరకూ వచ్చాయి. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. అందుకని ముందుగా ఏదైనా ఒక  లిక్విడ్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఈ లిక్విడ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని సూచించాడు. ఆ తర్వాత ఇదే మ్యూచువల్ ఫండ్ సంస్థకు సంబంధించి వేరే ఫండ్‌ను ఎంచుకొని, ఈ కొత్త ఫండ్‌లోకి లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను బదిలీ చేయమని సలహా ఇచ్చాడు, ఇది పెట్టుబడులకు సంబంధించి ఇది సరైన వ్యూహామేనా? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? వివరించండి?
 - ప్రణవి, విశాఖపట్టణం

 
మీ మిత్రుడు చెప్పింది. బహుశా సిస్టమాటిక్ టాన్స్‌ఫర్ ప్లాన్(సీటీపీ) గురించి అయి ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే. మీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయనుకోండి. వీటిని దశలవారీగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు.  దీనికి రెండు రకాల పద్ధతులున్నాయి. మొదటిది... ముందుగా ఈ మొత్తాన్ని ఏదైనా ఒక బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఈ ఖాతా నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఏదైనా ఈక్విటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. రెండో విధానం..., మీ దగ్గరున్న పెద్ద మొత్తాన్ని ముందుగా ఏదైనా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ద్వారా ఈ లిక్విడ్ ఫండ్ నుంచి ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోవాలి.

మీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నప్పుడు ఈ విధానం అనుసరిస్తే ఒకింత అధిక రాబడులు పొందవచ్చు. అయితే ఎస్‌టీపీ విధానాన్ని అనుసరిస్తే మీరు కొంత పన్ను భారాన్ని భరించక తప్పదు. ఒక లిక్విడ్ ఫండ్ నుంచి కొంత నిర్ణీత మొత్తంలో ఈక్విటీ ఫండ్‌కు బదిలీ చేసినప్పుడు.. లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకొని, ఈక్విటీ ఫండ్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టినట్లుగా భావిస్తారు. లిక్విడ్ ఫండ్‌లోని యూనిట్లను మూడేళ్లకు ముందే బదిలీ చేస్తే, వీటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుగా పరిగణిస్తారు. 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఇండెక్సేషన్ బెనిఫిట్)తో చెల్లించాల్సి ఉంటుంది.

- ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement