విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అవి విదేశీ ఆస్తులవుతాయా? | If the foreign funds to invest in foreign astulavutaya they? | Sakshi
Sakshi News home page

విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అవి విదేశీ ఆస్తులవుతాయా?

Published Mon, Oct 5 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అవి విదేశీ ఆస్తులవుతాయా?

విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అవి విదేశీ ఆస్తులవుతాయా?

నేను 2007లో సుందరం బీఎన్‌పీ పారిబా ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్-గ్రోత్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా రిడీమ్ చేసుకోవాలో తెలియజేయండి?     - అరుణ్ కుమార్, కర్నూలు
 రిడంప్షన్ ఫార్మ్‌ను పూర్తిచేసి సమీపంలోని సుందరం మ్యూచువల్  ఫండ్ బ్రాంచ్ ఆఫీస్‌లో దాఖలు చేయండి. లేదా వారి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిడంప్షన్‌కు సంబంధించి ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ డెమో అనే ఫీచర్ ఉంటుంది. ఈ  డెమో ఫీచర్ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా రిడీమ్ చేసుకోవచ్చో మీరు తెలసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ ఐఎస్‌ఏ అకౌంట్ ద్వారా వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్స్ స్కీమ్‌లన్నింటినీ రెగ్యులర్ ప్లాన్స్ నుంచి డెరైక్ట్ ప్లాన్స్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలో తెలియజేయండి.
 - భన్వర్‌లాల్, సికింద్రాబాద్

 ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి మీరు ఏదైనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మొదటగా ఆ సిప్‌ను ఆపేయండి. ఆ తర్వాత డెరైక్ట్ ప్లాన్‌కు సంబంధించి కొత్త సిప్‌ను ప్రారంభించండి. లేదా లావాదేవీ పత్రం (ట్రాన్సాక్షన్ స్లిప్)ద్వారా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెగ్యులర్ నుంచి డెరైక్ట్ ప్లాన్స్‌కు మార్చుకోవచ్చు. ఈ లావాదేవీ పత్రాన్ని హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్ నుంచి గానీ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కార్యాలయం నుంచి గాని క్యామ్స్ (కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్-మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీ)ఆఫీస్ నుంచి గానీ పొందవచ్చు. ఈ లావాదేవీ పత్రంలో మీ ఫోలియో నంబర్, మీ ప్రస్తుత స్కీమ్, మీరు మారాలనుకుంటున్న స్కీమ్ తదితర వివరాలను రాసి మ్యూచువల్ ఫండ్ సంస్థకు గానీ, క్యామ్స్ కార్యాలయంలో కానీ దాఖలు చేయండి.  మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను రెగ్యులర్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మార్చుకోవచ్చు.
 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మరణిస్తే, ఆ యూనిట్లు నామినీ/జాయింట్ హోల్డర్‌కి బదిలీ చేస్తారా? నామినీ ఆ యూనిట్లను రిడీమ్ చేసుకోవచ్చా? ఒకవేళ యూనిట్ల బదిలీకి అవకాశం ఉంటే, వాటిని తాజాగా కొనుగోలు చేసినట్లుగా భావిస్తారా? పన్ను అంశాలు ఎలా ఉంటాయి. ?   - కిశోర్, విజయవాడ

 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మరిణిస్తే ఆ యూనిట్లను నామినీ/జాయింట్ హోల్డర్‌కు సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ బదిలీ చేస్తుంది. దీని కోసం   నామినీ/జాయింట్ హోల్డర్ కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

 1. నామినీ నుంచి ఒక అభ్యర్థన పత్రం
 2.మరణించిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్. ఈ జిరాక్స్ కాపీని గెజిటెడ్ ఆఫీసర్ కానీ, బ్యాంక్ మేనేజర్‌తో కానీ అటెస్ట్ చేయించాలి. నోటరీ అయినా చెల్లుతుంది. ఒకవేళ విదేశీ ప్రభుత్వం ఈ ధ్రువీకరణ పత్రం ఇస్తే భారత ఎంబసీ దానిని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. 3. నామినీకి సంబంధించిన కేవైసీ(నో యువర్ కస్టమర్) పత్రాలు.

 కొన్ని బ్యాంకులు మరిన్ని డాక్యుమెంట్లు అడిగినా అడగవచ్చు. ఈ బదిలీ ప్రక్రియకు 10 నుంచి నెల రోజుల సమయం పడుతుంది. యూనిట్ల బదిలీకి నామినీ/జాయింట్ హోల్డర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

 ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్‌లో ఇటీవలనే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఈ ఫండ్ నేరుగా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్‌తో పాటు ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, జేపీమోర్గాన్ యూరప్ డైనమిక్ ఆఫ్‌షోర్ ఫండ్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ సెబీ వద్ద నమోదైన మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని విదేశీ ఆస్తులుగా పరిగ ణిస్తారా? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆదాయపు పన్ను విభాగానికి లేదా ఆర్‌బీఐకి లేదా మరే ఇతర ప్రభుత్వ విభాగానికైనా సమాచారమివ్వాలా?         - శ్రీనివాస్, వరంగల్

 భారత్‌లో నమోదైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని విదేశీ ఆస్తులుగా పరిగణించరు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫీడర్ ఫండ్స్.. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏదైనా విదేశీ ఫండ్‌లో రీ ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్ అన్ని మీ దేశీయ ఇన్వెస్ట్‌మెంట్  పోర్ట్‌ఫోలియోకు సంబంధించినవే కాబట్టి, మీరు ఆర్‌బీఐతో సహా మరే సంస్థకూ ఎలాంటి ప్రత్యేక సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక పన్ను సంబంధిత అంశాల విషయానికొస్తే, తమ తమ నిధుల్లో 65 శాతం వరకూ దేశీయ ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సంబంధించి రాయితీలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫండ్స్, ఫీడర్స్ ఫండ్స్‌ను ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపే వెనక్కి తీసుకుంటే మూలధన లాభాల పన్ను మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను 20 శాతం వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
 
 ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement