ఎంత కాలానికి సిప్ మార్చాలి? | Sip change how much time? | Sakshi
Sakshi News home page

ఎంత కాలానికి సిప్ మార్చాలి?

Published Mon, Oct 12 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

ఎంత కాలానికి సిప్ మార్చాలి?

ఎంత కాలానికి సిప్ మార్చాలి?

మా మిత్ర బృందంలో పలువురు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఆరేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పరిశీలిస్తే, చాలా ఫండ్స్‌కు సంబంధించి ఐదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ రాబడులు వచ్చాయి. అందుకని ప్రతీ మూడేళ్లకొకసారి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మార్చితే మంచిదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం సరైనదేనా ?
 - వికాస్, హైదరాబాద్

 
ఒక నిర్దేశిత కాలంలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడులు ఆ కాలంలో మార్కెట్ పని తీరును బట్టి ఉంటాయి. మీరు గమనించిన కాలం లో ఐదేళ్ల కాలంలో కంటే మూడేళ్ల కాలంలోనే స్టాక్ మార్కెట్ మంచి లాభాలు గడించి ఉండొచ్చు. అం దుకని ఐదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌పై కంటే మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌పైనే అధిక రాబడులు వచ్చి ఉం టాయి.  ఈ విషయం ఆధారం చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు బదిలీ చేయడం ఎంతమాత్రం సమర్థనీయమైన నిర్ణయం కాదు.

మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  బదిలీ చేయాలనుకుంటే,  కేవ లం రెండు సందర్భాలనే పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ పని తీరు కనీసం ఒక ఏడాది కాలంలో ఆ కేటగిరీ ఇతర ఫండ్స్ కన్నా చాలా తక్కువగా ఉన్నప్పుడు. ఇక రెండో సందర్భం.. మీ ఆర్థిక లక్ష్యం గడువు కన్నా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ముందు వేరే సాధనాల్లోకి బదిలీ చేయాలి. ఉదాహరణకు మీ కూతురు/కొడుకు ఉన్నత విద్య అనే ఆర్థిక లక్ష్యం కోసం పదేళ్లు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. తొమ్మిది లేదా 8వ సంవత్సరంలోనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే సురక్షితమైన సాధనాల్లోకి బదిలీ చేయాలి. ఇలా చేస్తే, ఆ తర్వాత మార్కెట్లో సంభవించే ఆకస్మాత్తు ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చు.
 
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌పై 9.3 శాతం రాబడి వస్తోంది. ఈ రాబడులపై టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) ఏమైనా ఉంటుందా? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కనీస, గరిష్ట కాలం ఎంత ? మెచ్యూరిటీకి ముందే ఈ స్కీమ్ నుంచి వైదొలగవచ్చా?  ఇలా ముందుగానే వైదొలిగినందువల్ల ఏమైనా జరిమానా చెల్లించాలా ?              - మాధవి, విజయవాడ
 
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఈ సేవింగ్స్ స్కీమ్ ద్వారా ఆర్జించిన వడ్డీ ఏడాదికి రూ.10,000 మించితే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. ఈ మెచ్యూరిటీ కాలం పూర్తయిన ఏడాదిలోపు  ఈ స్కీమ్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.

ఇలా పొడిగించుకున్న సందర్భాల్లో ఏడాది తర్వాత ఎప్పుడైనా ఈ స్కీమ్ నుంచి వైదొలగవచ్చు. ఎలాంటి జరిమానా ఉండదు. ఇక గడువు(ఐదేళ్ల) కంటే ముందుగానే ఈ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశముంది. అయితే ఒక ఏడాది పూర్తయిన తర్వాతే ఈ అవకాశం ఉంటుంది. ఏడాది తర్వాత వైదొలగితే డిపాజిట్ మొత్తంలో 1.5%, రెండేళ్ల తర్వాత వైదొలిగితే డిపాజిట్ మొత్తంలో 1 శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
 
నేను 1-3 ఏళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నాను. ఈ లక్ష్యం కోసం ఇప్పటిదాకా వివిధ మార్గాల్లో పొదుపు చేసిన మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే మార్కెట్లో చాలా ఫండ్స్-కార్పొ బాండ్ ఫండ్స్, ఇన్‌కమ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్.. ఇలా రకరకాల ఫండ్స్ ఉన్నాయి.  ఎగ్జిట్ లోడ్ తక్కువగా ఉండే, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్‌ను, నా అవసరాలను దృష్టిలో ఉంచుకొని  సూచించండి?     - రమేశ్, నాయుడు పేట
 
మీరు కనుక 10% లేదా 20% ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఈ ఫండ్స్‌లో మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే  వచ్చే రాబడులపై 20% మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది.  మీరు కనుక 30% ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ) లేదా బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

రిస్క్ వద్దనుకుంటే ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఆఫర్ చేసే ఎఫ్‌ఎంపీలో ఇన్వెస్ట్ చేయండి. కొంత రిస్క్ తీసుకోగలిగితే డైనమిక్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. బిర్లా సన్‌లైఫ్ డైనమిక్ బాండ్ ఫండ్, టాటా డైనమిక్ బాండ్ ఫండ్, యూటీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లను పరిశీలించొచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ అయిన ఇన్‌కమ్, గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.  అయితే వడ్డీరేట్ల హెచ్చుతగ్గులను బట్టి ఈ ఫండ్స్‌నుంచి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు బయటకు రావాలో సగటు ఇన్వెస్టర్లకు కొంచెం గందరగోళమైన విషయమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement