బోనస్ యూనిట్లపై పన్ను ఉంటుందా? | The tax would be a bonus units? | Sakshi
Sakshi News home page

బోనస్ యూనిట్లపై పన్ను ఉంటుందా?

Published Mon, Jan 12 2015 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

బోనస్ యూనిట్లపై పన్ను ఉంటుందా?

బోనస్ యూనిట్లపై పన్ను ఉంటుందా?

మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన బోనస్ యూనిట్లపై పన్ను చెల్లించాలా? బోనస్ యూనిట్లపై పన్ను అవి  ఎంత కాలం మన దగ్గర ఉన్నాయన్న విషయంపై కూడా ఆధారపడి ఉంటుందా? ఏ పన్ను (స్వల్పకాల/దీర్ఘకాల  మూలధన లాభాల పన్ను), ఎంత శాతం చెల్లించాల్సి ఉంటుంది? వివరించగలరు?                  - లక్ష్మీకాంత్, విజయనగరం
 
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన బోనస్ యూనిట్లపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  మ్యూచువల్ ఫండ్ సంస్థలు తాము ఆర్జించిన లాభాలను బోనస్‌ల రూపంలో ఇన్వెస్టర్లకు ఉచితంగా అందిస్తాయి. వీటిని విక్రయించినప్పుడు వీటిపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అవి డెట్ మ్యూచువల్ ఫండ్స్ బోనస్ యూనిట్‌లా లేక ఈక్విటీ ఫండ్స్ బోనస్ యూని ట్‌లా అన్న అంశంపై మూలధన లాభాల పన్ను ఆధారపడి ఉంటుంది.

ఇవి మీ దగ్గర ఉన్న కాలాన్ని బట్టి మీరు ఏ (దీర్ఘకాల/ స్వల్పకాల) మూలధన లాభాల పన్ను చెల్లించాలో నిర్ణయిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై స్వల్పకాల మూలధన లాభాల పన్ను 15 శాతంగా ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాల  పన్ను లేదు. అదే డెట్ ఫండ్స్ విషయంలో మీరు పొందిన యూనిట్లను మూడేళ్లలోపు ఎప్పుడైనా విక్రయిస్తే స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మొత్తాన్ని  మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. అలాకాకుండా  ఈ బోనస్ యూనిట్లను మీరు పొందిన  మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది 20 శాతం (ఇండెక్సేషన్ తర్వాత) ఉంటుంది.
 
మా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి కొన్నేళ్లపాటు ఆ విషయాన్ని మీరు మరచిపోండి. ఆ తర్వాత అద్బుత రాబడులు వస్తాయని ఒక మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ నన్ను ఊరిస్తున్నాడు. అతడు చెప్పింది కరెక్టేనా? ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, అంతా ఆ ఫండ్ సంస్థే చూసుకుంటుందా? మనం ఏమీ చెయ్యక్కరలేదా?                  - సుదర్శన్, కడప
 
సాధారణంగా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లు అలానే తమ ఫండ్ స్కీమ్‌లను మార్కెట్ చేస్తారు. కానీ ఒక ఇన్వెస్టర్‌గా ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంతోనే మన బాధ్యత తీరిపోదు. ఎంచుకునేటప్పుడు ఆ ఫండ్ గతంలో పనితీరు ఎలా ఉంది. మ్యూచువల్ ఫండ్ సంస్థ ట్రాక్ రికార్డ్, ఆ ఫండ్ మేనేజర్ పనితీరు, ఫండ్ పోర్ట్‌ఫోలియో, మీ ఆర్థిక లక్ష్యాలు,  తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి.

ఇక ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం రెండు నెలకొకసారైనా ఆ ఫండ్ పనితీరును గమనించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఫండ్స్ పనితీరుపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఏదైనా ఫండ్ పనితీరు సరిగ్గా లేకపోతే ఆ ఫండ్ నుంచి వైదొలిగి అదే కేటగిరీలో మంచి పనితీరు కనబరుస్తున్న ఇతర ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
నేను యాక్సిస్ ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్-గ్రోత్ ప్లాన్‌లో 2013, నవంబర్‌లో ఇన్వెస్ట్ చేశాను. అప్పటి నుంచి అది 9 శాతం వార్షిక రాబడులనిచ్చింది. ఇదే కాలంలో నేను కొన్ని ఈక్విటీలను కొనుగోలు చేశాను. వాటిల్లో బాగా నష్టాలు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్ విక్రయాలపై వచ్చిన లాభాలను ఈక్విటీల్లో వచ్చిన నష్టాలతో అడ్జెస్ట్ చేసుకొని పన్ను భారం తగ్గించుకోవచ్చా?          - ఆనంద్, విశాఖపట్టణం
 
అలా అడ్జెస్ట్ చేసుకొని పన్ను భారం కొంత తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 74 ప్రకారం అలాంటి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ నష్టాలను షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తో కూడా  అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నష్టాలు అదే ఆర్థిక సంవత్సరంలో అడ్జెస్ట్ చేసుకునే వీలు లేకుంటే తర్వాతి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఒక వేళ నష్టాలు ఇంట్రాడే ట్రేడింగ్‌లో వస్తే, దీనిని స్పెక్యులేటివ్ నష్టాలుగా భావిస్తారు. వీటిని క్యాపిటల్ గెయిన్స్‌తో అడ్జెస్ట్  చేసుకోవడానికి లేదు. స్పెక్యులేటివ్ నష్టాలను స్పెక్యులేటివ్ లాభాలతోనే అడ్జెస్ట్ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement