న్యూఢిల్లీ: దేశీ టాప్ 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్‌హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా లెక్కిస్తే దాదాపు 17.5 బిలియన్ డాలర్లు చెల్లించినట్లవుతుంది. ఇందులో అయిదింట నాలుగొంతుల వాటా టాప్ రెండు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌దే ఉంది. అయిదు టాప్ కంపెనీల్లో మూడు కంపెనీలు బోనస్‌లు కూడా ఇచ్చాయి.
ఈ రెండేళ్ల వ్యవధిలో ఈ ఐదు ఐటీ సంస్థల షేర్లు సుమారు 16–68 శాతం మేర పెరిగాయి. ఇలా షేర్‌హోల్డర్లకు తిరిగిచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 61 శాతం షేర్ల బైబ్యాక్ రూపంలోనే జరిగింది. టీసీఎస్ రూ. 32,000 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 21,200 కోట్ల మేర బైబ్యాక్స్ జరిపాయి. అటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా అదే బాటలో నడవగా.. టెక్ మహీంద్రా ఒక్కటి మాత్రమే బైబ్యాక్ చేపట్టలేదు. మరోవైపు, టాప్ 4 కంపెనీలు చేసిన చెల్లింపుల్లో మొత్తం షేర్ల బైబ్యాక్ వాటా 54 శాతం నుంచి 89 శాతం దాకా ఉంది.
బైబ్యాక్స్‌కే ఎందుకు ప్రాధాన్యం..
డివిడెండ్ల కన్నా షేర్ల బైబ్యాక్ వైపే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటానికి 2016 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలే ప్రధాన కారణం. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్స్‌లు గట్రా కట్టేసిన తర్వాత వచ్చే నికర లాభం నుంచే డివిడెండ్ల చెల్లింపు ఉంటుంది. కానీ 2016 బడ్జెట్‌లో రూ. 10 లక్షల పైగా డివిడెండ్ అందుకునే హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు ఆ మొత్తంపై పది శాతం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఇక కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే.. దానిపై దాదాపు 20% దాకా (అసలు 15%, సర్‌చార్జి, సెస్సు మొదలైనవన్నీ కలిపి) డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కట్టాల్సి వస్తుంది. ఈ కారణాలతో డివిడెండ్‌లకు ఆకర్షణీయత తగ్గింది. మరోవైపు, బైబ్యాక్ మార్గంలో షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించినప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీనిపై పది శాతం మేర లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించినా.. డివిడెండ్లతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే డివిడెండ్ల కన్నా బైబ్యాక్‌లవైపే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటోందని నిపుణులు తెలిపారు.
ఈపీఎస్ ప్రయోజనాలు కూడా..
డివిడెండ్ చెల్లించడం కన్నా షేర్లను బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీలకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డివిడెండును కంపెనీ నికర లాభం నుంచి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీంతో.. కంపెనీ నికర విలువ, ఫలితంగా మార్కెట్ విలువ కూడా ఆ మేరకు కాస్త తగ్గుతుంది. అయితే, షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు చలామణీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన (ఈపీఎస్) పెరిగి, వేల్యుయేషన్ కూడా ఆ మేరకు పెరుగుతుంది. అంతే కాకుండా నిర్దిష్ట రేటు ప్రకారం కొనుగోలు ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో సంస్థ షేరు స్థిరపడేందుకు కూడా చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. బైబ్యాక్ ప్రకటించినా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించకుండా దూరంగా ఉంటే.. కంపెనీలో తమ వాటాలను మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.
బోనస్‌లు కూడా....
షేర్ల బైబ్యాక్, డివిడెండ్లతో పాటు ఈ కంపెనీలు బోనస్ షేర్లు కూడా ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు షేరు ఒక్కింటికి ఒక షేరు ఇచ్చాయి. విప్రో మాత్రం రెండు సార్లు బోనస్ ఇష్యూలు ప్రకటించింది. 2017లో షేరు ఒక్కింటికి ఒకటి చొప్పున ఇవ్వగా.. తాజాగా జనవరిలో మరో బోనస్ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి 3 షేర్లకు ఒక్క షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment