ఇటీవల నగదు నిల్వలు అధికంగా గల(క్యాష్ రిచ్) కంపెనీలు వాటాదారులకు డివిడెండ్లు, బైబ్యాక్‌ల రూపంలో లాభాలను పంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు విస్తరణ ప్రాజెక్టుల వ్యయాలు తగ్గడం, వ్యాపార నిర్వహణ ద్వారా మెరుగుపడుతున్న క్యాష్‌ఫ్లో తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వార్షిక లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండుగా అందించనున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రకటించడాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం..
ముంబై: కొద్ది రోజులుగా దేశీ బ్లూచిప్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు, బీమా, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను మినహాయిస్తే.. పలు లిస్టెడ్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2020 మార్చికల్లా టాప్ లిస్టెడ్ కంపెనీల వద్ద రూ. 11 లక్షల కోట్లకుపైగా నగదు, తత్సమాన నిల్వలున్నాయి. ఇవి ఆయా కంపెనీల మొత్తం నెట్‌వర్త్‌లో 30 శాతానికి సమానమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండ్లకు కేటాయించనున్నట్లు ప్రకటించింది.
కంపెనీ ఇటీవల కాలంలో చెల్లించిన డివిడెండ్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో వాటాదారులకు భారీ నగదు అందనున్నట్లు నిపుణులు తెలియజేశారు. బజాజ్ ఆటో కొత్త డివిడెండ్ పాలసీ నేపథ్యం లో ఇకపై మరిన్ని కార్పొరేట్స్ ఈ బాటలో నడిచే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు గత వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డివిడెండ్ పంపిణీ పాలసీని సమీక్షించింది. దీనిలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా డివిడెండ్ పాలసీలోకి వచ్చే టాప్–500 కంపెనీల జాబితాను టాప్–1,000కు సవరించింది. ఇది డివిడెండ్ చెల్లింపు విధానాలలో మార్పులకు కారణంకానున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
బజాజ్ దూకుడు...
గత మూడేళ్లలో బజాజ్ ఆటో వాటాదారులకు లాభాల్లో 47 శాతం వాటాను డివిడెండ్లుగా పంచింది. ఈ బాటలో గతేడాది డివిడెండ్ చెల్లింపులకు రూ. 3,472 కోట్లను వెచ్చించింది. తద్వారా అధిక చెల్లింపుల జాబితాలో 10వ ర్యాంకులో నిలిచింది. రూ. 16,000 కోట్లవరకూ మిగులు ఉన్నదని, దీనికితోడు వార్షికంగా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. దీంతో అధిక డివిడెండ్ పాలసీకి తెరతీసినట్లు వెల్లడించింది. కాగా.. దేశీ కార్పొరేట్ల వద్ద గతేడాదికల్లా నగదు నిల్వలు 13.8%కి చేరాయి. ఇందుకు ఐటీ కంపెనీల ఆర్జనల మెరుగుదలతోపాటు.. రిలయన్స్, ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల నిధుల సమీకరణ కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
డిమాండ్ ఎఫెక్ట్
ఇటీవల డిమాండ్ మందగించడంతో ఆటో, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్ తదితర రంగాలలో భారీ విస్తరణ ప్రణాళికలు తగ్గినట్లు ఈక్వినామిక్స్ అండ్ రీసెర్చ్ అడ్వయిజరీ పేర్కొంది. దీంతో మరిన్ని కంపెనీలు డివిడెండ్ చెల్లింపులను పెంచడం, షేర్ల బైబ్యాక్‌లు వంటివి చేపట్టవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అధిక డివిడెండ్లను చెల్లిస్తున్న కొన్ని కంపెనీలు తమ లాభాల్లో మరింతగా ఇన్వెస్టర్లకు అందించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ నేపథ్యంలోనూ గతేడాది(2019–20) ఫైనాన్షియల్‌యేతర రంగ కంపెనీలు 12.8% అధికంగా రూ.1.7 లక్షల కోట్లను వాటాదారులకు అందించినట్లు తెలిపారు. వెరసి 2019–20లో మొత్తం కంపెనీలు తమ నికర లాభాల్లో 78% వాటాను డివిడెండ్లకు కేటాయించాయి. అంతక్రితం ఏడాది ఇది 55% శాతమే.
బైబ్యాక్‌లతో...
2019 జనవరి నుంచి చూస్తే పలు కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లను చేపట్టాయి. తద్వారా దాదాపు రూ. 64,000 కోట్లను వెచ్చించాయి. ఈ జాబితాలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాతోపాటు.. పీఎస్‌యూలు ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ప్రైవేట్ రంగ కంపెనీ అదానీ పోర్ట్స్ తదితరాలున్నాయి. పటిష్ట నిర్వహణ లాభాలు, నీరసించిన ట్రెజరీ ఈల్డ్స్, విస్తరణ ప్రణాళికల్లో మందగమనం వంటి అంశాలు పలు కంపెనీలను బైబ్యాక్, డివిడెండ్లవైపు ప్రోత్సాహిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ వర్గాలు తెలియజేశాయి.
కార్పొరేట్ ఇండియా... డివిడెండ్ బొనాంజా!
Published Tue, Mar 30 2021 6:07 AM | Last Updated on Tue, Mar 30 2021 6:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment