కోటక్ బ్యాంక్ 1:1 బోనస్ షేర్లు
⇒ క్యూ4లో నికర లాభం 38 శాతం అప్
⇒ ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.913 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. అంతక్రితం ఏడాది క్యూ4 లాభం(రూ.663 కోట్లు)తో పోల్చితే 38% వృద్ధి సాధించామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ ఉదయ్ కోటక్ వెల్లడించారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో బోనస్ షేర్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదనను, రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ఇవ్వడానికీ డెరైక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు.
మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధి: వడ్డీయేతర ఆదాయం రెట్టింపు కావడంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఉదయ్ కోటక్ వెల్లడించారు. మొత్తం ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 4,782 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.6,172 కోట్లకు ఎగసిందని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.1,123 కోట్లకు, ఇతర ఆదాయం 94% వృద్ధితో రూ.1,018 కోట్లకు పెరిగాయని వివరించారు. స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.407 కోట్ల నుంచి 29% వృద్ధితో రూ.527 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,553 కోట్ల నుంచి రూ.3,249 కోట్లకు పెరిగాయన్నారు. ఐఎన్‌జీ వైశ్యా విలీన ప్రభావంతో కూడిన ఆర్థిక ఫలితాలు జూన్ క్వార్టర్ నుంచి ఉంటాయని ఉదయ్ కోటక్ తెలిపారు.
ఎన్‌ఎస్‌ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.3 శాతం వృద్ధితో రూ.1,423కు చేరింది.