కోటక్ బ్యాంక్ లాభం 40 శాతం అప్
ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 40 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.696 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.976 కోట్లకు పెరిగిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,947 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.5,435 కోట్లకు పెరిగింది.
స్థూల మొండి బకాయిలు 2.36 శాతం నుంచి 2.59 శాతానికి, నికర మొండి బకాయిలు 1.06 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.200 కోట్ల నుంచి రూ.267 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.2,090 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17లో రూ.3,411 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.18,996 కోట్ల నుంచి 21,176 కోట్లకు పెరిగాయి. రుణాలు రూ.1,92,260 కోట్ల నుంచి రూ.2,14,590 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.915 వద్ద ముగిసింది.