వృద్ధి విస్తృతంగా ఉండాలి
మరిన్ని కంపెనీలు పురోగమించాలి
వెటరన్ బ్యాంకర్ ఉదయ్ కోటక్
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు.
బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు.
గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment